Begin typing your search above and press return to search.

ల్యాండ్ వివాదంపై కీలక ఆధారాలు బయటపెట్టిన అల్లు అర్జున్ మామ

తాము ఇప్పటికే భూమికి బయానా ఇచ్చినందున, తనకు మూడు ఎకరాలు, సునీల్ కుమార్‌కు మూడు ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించుకున్నామని చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు.

By:  A.N.Kumar   |   17 Sept 2026 3:45 PM IST
ల్యాండ్ వివాదంపై కీలక ఆధారాలు  బయటపెట్టిన అల్లు అర్జున్ మామ
X

హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో 11 ఎకరాల భూమికి సంబంధించిన వివాదం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో తనపై కేసు నమోదైన నేపథ్యంలో అల్లు అర్జున్ మామ, రాజకీయ నాయకుడు కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి స్పందించారు. భూమి వివాదానికి సంబంధించిన అంశాలపై తన వాదనను వెల్లడిస్తూ పలు విషయాలపై క్లారిటీ ఇచ్చారు.

విద్యాసంస్థ ఏర్పాటు చేయాలనుకున్నాం..

నానక్‌రామ్‌గూడలోని సుమారు 11 ఎకరాల భూమి గతంలో వ్యవసాయ భూమిగా ఉండేదని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ భూమిని తాను, తన స్నేహితులు కలిసి కొనుగోలు చేసి భవిష్యత్‌లో అక్కడ స్కూల్ లేదా కాలేజీ వంటి విద్యాసంస్థ ఏర్పాటు చేయాలని భావించినట్లు చెప్పారు.

11 ఎకరాలను మొత్తం ఒకే గ్రూప్‌గా కొనుగోలు చేసి, అనంతరం తమ మధ్య విభజించుకోవాలని అప్పట్లో ఒప్పందం చేసుకున్నామని ఆయన వివరించారు. ఇందులో తాను మూడు ఎకరాలు తీసుకోవాలని, మరో స్నేహితుడు సునీల్ మూడు ఎకరాలు తీసుకోవాలని, మిగిలిన ఐదు ఎకరాలను ఇతర స్నేహితులకు కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

ముందస్తు అడ్వాన్స్‌ ఇచ్చామని వెల్లడి

ఈ భూమిని కొనుగోలు చేసేందుకు భూ యజమానులకు తానే స్వయంగా బయానాగా ముందస్తు అడ్వాన్స్ ఇచ్చినట్లు చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. తాము చెప్పిన రేటుకు భూమిని కొనుగోలు చేస్తామని రాతపూర్వకంగా ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. ఎలాంటి లాభాపేక్షతో కాకుండా ఒక గ్రూప్‌గా ఏర్పడి ఈ భూమిని కొనుగోలు చేయాలని భావించామని చెప్పారు. విద్యాసంస్థ ఏర్పాటు చేయడం లేదా అవసరాన్ని బట్టి ఇతర వ్యాపార కార్యకలాపాలకు భూమిని వినియోగించుకోవాలని ఆలోచించినట్లు వివరించారు.

‘సునీల్ కుమార్‌’కు బాధ్యతలు

తాను రాజకీయాలు, కాలేజీల నిర్వహణలో బిజీగా ఉండటంతో 11 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, అనంతరం విభజించి ఎవరి వాటా వారికి రిజిస్ట్రేషన్ చేయించే బాధ్యతను తమ స్నేహితుల్లో ఒకరైన సునీల్ కుమార్‌కు అప్పగించినట్లు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

అయితే సునీల్ కుమార్ తమకు తెలియకుండా ఈ భూమిని ఇతరులకు విక్రయించి భారీ మొత్తంలో డబ్బు సంపాదించాలని ప్రయత్నించాడని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో భూమి ప్రభుత్వ భూమి అని, దానిపై విచారణ జరిగే అవకాశం ఉందని చెప్పి తమను భూమి కొనుగోలు చేయకుండా మభ్యపెట్టాడని పేర్కొన్నారు.

భూమి వేరే వారికి విక్రయించడంతో వివాదం

తాము ఇప్పటికే భూమికి బయానా ఇచ్చినందున, తనకు మూడు ఎకరాలు, సునీల్ కుమార్‌కు మూడు ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించుకున్నామని చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. అయితే సునీల్ కుమార్ వద్ద డబ్బులు లేకపోవడం లేదా ఆర్థికంగా సర్దుబాటు కాకపోవడం కారణంగా తన వాటాగా భావించిన మూడు ఎకరాలను తన బావ పేరుతో కొనుగోలు చేసినట్లు తెలిపారు. తాము కొనుగోలు చేయాలని ముందుగా ఒప్పందం చేసుకున్న భూమిని సునీల్ కుమార్ ఇతరులకు విక్రయించడంతోనే అసలు వివాదం ప్రారంభమైందని చంద్రశేఖర్ రెడ్డి వివరించారు.

కేసుపై తన వాదన ఇదేనన్న చంద్రశేఖర్ రెడ్డి

తనపై నమోదైన కేసు, నానక్‌రామ్‌గూడ భూమి వివాదానికి సంబంధించి వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వివరాలను వెల్లడిస్తున్నట్లు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. భూమి కొనుగోలు వ్యవహారంలో తమ ఉద్దేశం విద్యాసంస్థ ఏర్పాటు చేయడం లేదా భూమిని వినియోగించుకోవడమేనని.. ఇందులో లాభాపేక్ష లేదని ఆయన స్పష్టం చేశారు.

అయితే భూమి యాజమాన్యం, ఒప్పందాలు, రిజిస్ట్రేషన్లు, ఇతరుల పేర్లపై జరిగిన లావాదేవీలకు సంబంధించిన అంశాలపై తుది నిర్ధారణ సంబంధిత పత్రాలు, దర్యాప్తు, న్యాయ ప్రక్రియ ఆధారంగానే ఉంటుందని స్పష్టంచేశారు. తాము దౌర్జన్యం చేయలేదని.. తమ మిత్రుడు భూమి విషయంలో అన్యాయం చేయడంతోనే గొడవ జరిగిందని చంద్రశేఖర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.