Begin typing your search above and press return to search.

ఇద్దరు మహిళల సహజీవనం.. సమాజానికి 'న్యాయం' చెప్పిన కోర్టు

ఇలాంటి కేసుల్లో సామాజిక అభిప్రాయాలు, కుటుంబ వ్యతిరేకత కంటే వయోజనుల స్వచ్ఛంద నిర్ణయం, వారి భద్రతకు సంబంధించిన రాజ్యాంగ హక్కులు కీలకమని ఈ ఆదేశం పేర్కొంటోంది.

By:  A.N.Kumar   |   20 Sept 2026 11:13 AM IST
ఇద్దరు మహిళల సహజీవనం.. సమాజానికి న్యాయం చెప్పిన కోర్టు
X

ఇద్దరు వయోజనులు తమ ఇష్టప్రకారం కలిసి జీవించే రాజ్యాంగ హక్కును సమర్థిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇటీవల ఒక కీలక తీర్పును వెలువరించింది. విభిన్న మతాలకు చెందిన ఇద్దరు మహిళలు (లెస్బియన్ జంట) ఎదుర్కొంటున్న భద్రతా ముప్పుపై స్పందిస్తూ వారి సహజీవనానికి చట్టపరమైన రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది.

ఉత్తరప్రదేశ్ లోని వారణాసికి చెందిన ఇద్దరు యువతులు ఒకరు హిందూ.. మరొకరు ముస్లిం గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే వీరి సంబంధాన్ని ఒప్పుకోని కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదురయ్యాయి. తమ ప్రశాంత జీవనానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతోందని.. ప్రాణభయం ఉందంటూ ఆ జంట అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. తమకు పోలీసు రక్షణ కల్పించాలని పిటిషన్‌లో కోరింది. వారి వయస్సుకు సంబంధించిన ధ్రువపత్రాలను కూడా న్యాయస్థానం పరిశీలించింది.

కలిసి జీవించే హక్కు ఉందన్న కోర్టు

ఇద్దరు వయోజనులు తమ ఇష్టప్రకారం కలిసి జీవించడాన్ని చట్టం పరిరక్షిస్తుందని హైకోర్టు పేర్కొంది. వివాహానికి చట్టపరమైన గుర్తింపు ఉందా లేదా అన్నది పక్కనపెడితే.. వయోజనుల వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవం, భౌతిక భద్రతకు రక్షణ ఉండాలని స్పష్టం చేసింది. కుటుంబ సభ్యులు, బంధువులు లేదా సమాజంలోని ఇతర వ్యక్తులు వారి వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకునే హక్కు లేదని తెలిపింది.

అయితే ఈ కేసులో ప్రధానంగా కోర్టు పరిశీలించిన అంశం సహజీవనంలో ఉన్న ఇద్దరు వయోజనుల భద్రత, వ్యక్తిగత స్వేచ్ఛ. సమలింగ వివాహానికి చట్టపరమైన గుర్తింపు ఇవ్వడం అనే అంశాన్ని కోర్టు ఈ ఆదేశం ద్వారా నిర్ణయించలేదు. వివాహ గుర్తింపు లేకపోవడం వల్ల వయోజనుల గౌరవం లేదా భద్రతకు భంగం కలిగించేందుకు ఎవరికీ హక్కు ఉండదని మాత్రం స్పష్టం చేసింది.

అడ్డంకులు కలిగితే పోలీసులే రక్షణ

ఇకపై ఈ జంట సహజీవనంలో కుటుంబ సభ్యులు లేదా మరెవరైనా అడ్డంకులు సృష్టిస్తే ఇద్దరూ మేజర్లు, స్వచ్ఛందంగా కలిసి జీవిస్తున్నారని నిర్ధారించిన అనంతరం పోలీసులు తక్షణమే భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత, గౌరవంతో జీవించే హక్కుల విషయంలో మరోసారి న్యాయస్థానం స్పష్టమైన సందేశం ఇచ్చినట్లయింది.

ఇలాంటి కేసుల్లో సామాజిక అభిప్రాయాలు, కుటుంబ వ్యతిరేకత కంటే వయోజనుల స్వచ్ఛంద నిర్ణయం, వారి భద్రతకు సంబంధించిన రాజ్యాంగ హక్కులు కీలకమని ఈ ఆదేశం పేర్కొంటోంది. ఇద్దరు మహిళలు ఎలాంటి ఒత్తిడి లేకుండా కలిసి జీవించాలనే నిర్ణయం తీసుకున్నారని కోర్టు నిర్ధారించిన నేపథ్యంలోనే పోలీసు రక్షణకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ సందర్భంగా కోర్టు ఒక స్పష్టతనిచ్చింది. ఈ కేసులో పరిశీలించిన అంశం కేవలం ఇద్దరు వయోజనుల భద్రత , వ్యక్తిగత స్వేచ్ఛ మాత్రమే అని, ఇది "సమలింగ వివాహాలకు" చట్టపరమైన గుర్తింపు ఇవ్వడం కిందకు రాదని పేర్కొంది. వివాహ గుర్తింపు లేనంత మాత్రాన వ్యక్తుల ప్రాథమిక హక్కులను, గౌరవాన్ని భంగపరిచే హక్కు ఎవరికీ ఉండదని తేల్చిచెప్పింది.