Begin typing your search above and press return to search.

ఏలూరు నాని...విశాఖలో విడిది !

ఆయనలో అహంకారం గర్వం అన్నది ఎక్కడా లేదని అంతా చెబుతారు. ఆయన విశాఖలో ఇతర పౌరుల మాదిరిగానే తాను నిత్యం వాకింగ్ కి వెళ్ళేవారు.

By:  Satya P   |   15 Sept 2026 8:11 PM IST
ఏలూరు నాని...విశాఖలో విడిది !
X

ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని తుది శ్వాస విశాఖలో విడిచారు. ఏలూరు జిల్లాకు చెందిన ఆళ్ళ నానికి విశాఖతో అనుబంధం చాలానే ఉంది. ఆయన విశాఖ నగరంలో సీతమ్మధారలో ఒక అపార్ట్మెంట్ లో సెకండ్ ఫ్లోర్ లో ఫ్లాట్ తీసుకుని చాలా కాలంగా నివసిస్తున్నారు. ఆయన ఏలూరు నుంచి తరచుగా విశాఖ వస్తూంటారు. విశాఖ ఆయన విడిదిగా చేసుకుని గడుపుతూంటారు. ఒక విధంగా గోదావరి జిల్లాలకు చెందిన ఆళ్ల నాని విశాఖలో కూడా నివాసితుడుగా మారిపోయారు. ఆయన మరణంతో అపార్ట్మెంట్ వాసులు అంతా కలత చెందుతున్నారు అంటే ఆయన అందరితో ఎలా మెలిగేవారో అర్ధం అవుతుంది.

అందరి వాడుగా ఉంటూ :

ఆళ్ళ నాని అందరి వాడు గా ఉంటారు అని పేరు. రాజకీయాల్లో ఆయన అజాత శత్రువుగా మెలిగారు. ఆయన ఎవరినీ పెద్దగా విమర్శించిన దాఖలాలు లేవు. ఆయన మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా ప్రత్యర్థుల మీద ఘాటు విమర్శలు చేయలేదు, పాలసీల ప్రకారమే మాట్లాడేవారు. ఇక ఆయన 2024 ఎన్నికల్లో ఓటమి తరువాత 2025 లో టీడీపీలో చేరారు. ఆయన రాజకీయంగా ఒకింత నెమ్మదించింది ఈ సమయంలోనే అని అంటారు. ఆయన ఎక్కువగా విశాఖలోనే గడుపుతూ వచ్చారు. ఇక ఆయన విశాఖలో ఉంటూ చాలా సాదా సీదా జీవితం గడిపారు అని అంటారు. ఆయనను ఎవరైన గుర్తించి పలకరిస్తే ప్రతి నమస్కారం చేయడం అందరినీ చిరునవ్వుతో పలకరించడం ఆయన మంచితనాన్ని తెలియచేస్తుంది. ఇక అపార్ట్మెంట్ వాసులతో ఆయన ఎంతో కలివిడిగా ఉండేవారు అని చెబుతున్నారు. ఆయన తాను మాజీ ఉప ముఖ్యమంత్రిని అని ఏ మాత్రం హోదా గుర్తు చేసుకోకుండా సామాన్యుడిగా మెలిగారు అని తలచుకుంటున్నారు అంటే ఆళ్ల నాని స్వభావం అర్ధం అవుతోంది.

సాదా సీదాగానే :

ఆయనలో అహంకారం గర్వం అన్నది ఎక్కడా లేదని అంతా చెబుతారు. ఆయన విశాఖలో ఇతర పౌరుల మాదిరిగానే తాను నిత్యం వాకింగ్ కి వెళ్ళేవారు. తన వెంట ఎపుడూ తాను ఎంతో ముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్కతో కనిపించేవారు అని అంటారు. ఇక రాజకీయాలకు అతీతంగా ఆయన అందరితోనూ బాగా ఉంటారు అని చెబుతున్నారు. ఏ సమస్య ఆయన ముందు ఉంచినా తనదైన శైలిలో పరిష్కరించేందుకు ఆసక్తి చూపేవారు అని గుర్తు చేసుకుంటున్నారు. ఆయనకు విశాఖ అంటే ఎంతో ఇష్టం గా చెబుతున్నారు. అలా ఆయన ఎక్కువ సమయం ప్రశాంతంగా విశాఖలోనే ఉంటూ వచ్చారు.

ఆఖరి శ్వాస కూడా :

విశాఖ అంటే ఎంత ఇష్టం అన్నది ఆయన ఆఖరి శ్వాస కూడా అక్కడే విడవడం చూసిన వారు అంతా గుర్తు చేసుకుంటున్నారు. ఆయన మృదు స్వభావి అని అదే సమయంలో పేదలంటే ఎక్కువగా ఇష్టపడేవారు అని అపార్ట్మెంట్ వాసులు చెబుతున్నారు. ఇక ఆళ్ళ నాని రాజకీయ ప్రస్థానం తీసుకుంటే యువజన కాంగ్రెస్ నాయకుడిగా ప్రవేశించి 2004లో కాంగ్రెస్ తరఫున తొలిసారి పోటీ చేసి విజయం సాధించారు. 2009లో మరోసారి గెలిచిన ఆయన వైఎస్సార్ మరణం తరువాత వైసీపీలో చేరి 2014లో పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఆ తరువాత 2017లో వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా నెగ్గారు. 2019లో తిరిగి గెలిచి వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మొత్తం మీద చూస్తే ఆళ్ల నాని విశాఖ జ్ఞాపకాలు చాలానే ఉన్నాయని సన్నిహితులు చెబుతారు. ఆయన హఠాత్తుగా అందరికీ దూరం కావడం పట్ల మాత్రం పెద్ద ఎత్తున సంతాపాలు వ్యక్తం అవుతున్నాయి.