Begin typing your search above and press return to search.

అలీ ఖమేనీ అంత్యక్రియల్లో కుమారులు.. రాని మొజ్తాబా.. కారణం ఇజ్రాయెల్

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియలు దేశవ్యాప్తంగా తీవ్ర విషాద వాతావరణంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ముగిశాయి.

By:  A.N.Kumar   |   5 July 2026 8:16 PM IST
అలీ ఖమేనీ అంత్యక్రియల్లో కుమారులు.. రాని మొజ్తాబా.. కారణం ఇజ్రాయెల్
X

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియలు దేశవ్యాప్తంగా తీవ్ర విషాద వాతావరణంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ముగిశాయి. రాజధాని టెహ్రాన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, మతపెద్దలు, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రతినిధులు హాజరై ఆయనకు తుది వీడ్కోలు పలికారు. అయితే, ఈ అత్యంత ప్రాధాన్యత కలిగిన క్రతువులో ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ గైర్హాజరు కావడం ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

తండ్రి పార్థివదేహం వద్ద కన్నీటి పర్యంతమైన ముగ్గురు కుమారులు

అలీ ఖమేనీ ముగ్గురు కుమారులు మొస్తఫా ఖమేనీ, మసౌద్ ఖమేనీ, మేసమ్ ఖమేనీలు అంత్యక్రియల్లో పాల్గొని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రి పార్థివదేహం వద్ద నిలబడి వారు ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ కన్నీటి పర్యంతమైన దృశ్యాలు అక్కడున్న వారిని కదిలించాయి. కుటుంబ సభ్యులతో పాటు దేశంలోని అగ్రశ్రేణి నాయకులు ఈ అంతిమయాత్రలో పాల్గొన్నారు. కానీ అందరి దృష్టిని ఆకర్షించిన విషయం మాత్రం మరో కుమారుడు మొజ్తబా ఖమేనీ ఈ కార్యక్రమంలో ఎక్కడా కనిపించకపోవడమే.

మొజ్తబా గైర్హాజరు వెనుక ఇజ్రాయెల్ ముప్పు?

ఇరాన్ రాజకీయాల్లో ముఖ్యంగా దేశ తదుపరి సుప్రీం లీడర్ రేసులో మొజ్తబా ఖమేనీ అత్యంత కీలకమైన వ్యక్తిగా పరిగణించబడుతున్నారు. అలాంటి ప్రాధాన్యత కలిగిన నాయకుడు తన తండ్రి అంత్యక్రియలకు రాకపోవడం వెనుక బలమైన భద్రతా కారణాలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

ఇంటెలిజెన్స్ నివేదికల సారాంశం

మొజ్తబా ఖమేనీని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక లేదా నిఘా దాడులు జరిగే ప్రమాదం ఉందని ఇరాన్ ఇంటెలిజెన్స్ వర్గాలకు ముందస్తు సమాచారం అందినట్లు తెలుస్తోంది. భారీ ప్రజాసమూహాలు వచ్చే ఇలాంటి బహిరంగ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటే భద్రతకు తీవ్ర విఘాతం కలగొచ్చని భద్రతా సంస్థలు హెచ్చరించాయి. ఈ ముప్పు నేపథ్యంలోనే ఆయనను అంత్యక్రియలకు దూరంగా రహస్య ప్రాంతంలో ఉంచినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దీనిపై ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇరాన్ భవిష్యత్, ప్రాంతీయ సమీకరణాలు

అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ అత్యున్నత మత, రాజకీయ పదవిని ఎవరు అధిష్ఠిస్తారనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. సుప్రీం లీడర్ ఎంపిక కోసం ఇరాన్‌లోని ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్’ కసరత్తులు ప్రారంభించినట్లు సమాచారం. ఈ రేసులో మొజ్తబా ఖమేనీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఒకవేళ ఆయనే తదుపరి లీడర్ అయితే, ఇరాన్ భద్రతా వ్యూహాలు, ముఖ్యంగా ఇజ్రాయెల్ , అమెరికాతో దేశ వైఖరి ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠగా మారింది.

మరోవైపు అలీ ఖమేనీకి నివాళులర్పించేందుకు దేశం నలుమూలల నుండి టెహ్రాన్‌కు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్లు, ప్రత్యేక బలగాలతో టెహ్రాన్ నగరాన్ని భద్రతా వలయంలోకి తీసుకువచ్చారు. ఖమేనీ యుగం ముగియడంతో మధ్యప్రాచ్యంలో రాజకీయ భౌగోళిక సమీకరణాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయోనని అంతర్జాతీయ వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి.