అమెరికా నుంచి వచ్చిన అలర్ట్: తండ్రికి ఫోన్ కాల్.. ఇండియాలో పారిపోయిన దొంగలు
కర్ణాటకలోని ముధోల్‌లో ఒక కుటుంబం చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద దొంగతనం తప్పింది.
By: A.N.Kumar | 29 Aug 2025 10:13 AM ISTకర్ణాటకలోని ముధోల్‌లో ఒక కుటుంబం చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద దొంగతనం తప్పింది. దీనికి కారణం అమెరికాలో ఉన్న వారి కుమార్తెకు అప్రమత్తంగా ఉండడమే. ఇంటికి అమర్చిన సీసీటీవీ కెమెరాల ద్వారా ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం ఆమెకు అందడంతో తండ్రిని అప్రమత్తం చేసి దొంగల బృందాన్ని పారిపోయేలా చేసింది.
- ఏం జరిగింది?
ఆగస్టు 26న అర్థరాత్రి 1.20 గంటల ప్రాంతంలో నాలుగు-ఐదుగురు దొంగల బృందం ముధోల్‌లో దొంగతనం చేయడానికి ప్రయత్నించింది. వారు మొదటిగా ఒక ఇంటి వెనుక కిటికీ నుంచి చొరబడి పడకగదిలో ఉన్న బంగారు నగలను దొంగిలించారు. ఆ సమయంలో ఆ కుటుంబం హాల్లో నిద్రిస్తోంది. ఆ తర్వాత దొంగలు మరో ఇంటిని టార్గెట్ చేశారు. అదే హనుమత్ గౌడ ఇల్లు. అయితే ఆ ఇంటికి అమర్చిన సీసీటీవీ కెమెరాలకు అనుసంధానించిన అలారం సిస్టమ్ వల్ల అమెరికాలో ఉండే ఇంటి యజమాని గౌడ కుమార్తెకు అలర్ట్ వచ్చింది. ఆమె వెంటనే తన తండ్రికి ఫోన్ చేసి, అప్రమత్తం చేయడంతో గౌడ ఇంటి లైట్లు వేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేసరికి దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై ముధోల్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది.
- పోలీసుల హెచ్చరిక
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిద్ధార్థ్ గోయల్ మాట్లాడుతూ ఇలాంటి ముఠాలు వరుసగా ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అనుమానాస్పద కదలికలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. దొంగల పాక్షిక చిత్రాలు కెమెరాలలో రికార్డు అయ్యాయి. ఈ సంఘటనను బట్టి, సాంకేతిక పరిజ్ఞానం.. అప్రమత్తత దొంగతనాలను నిరోధించడంలో ఎంత సహాయపడతాయో తెలుస్తోంది.
