నెట్టింట డాక్టర్ మందోపాఖ్యానం వైరల్... ఆప్షన్స్ అడుగుతున్న నెటిజన్లు!
ఇది కాస్తా వైరల్ గా మారింది. ఇక కామెంట్ సెక్షన్ విషయానికొస్తే నెటిజన్లు తమ క్రియేటివిటీకి పని చెప్పి మరీ స్పందిస్తున్నారు.
By: Raja Ch | 6 Nov 2025 5:44 PM ISTమద్యం గురించి ఒక్కొక్కరూ ఒక్కోలా వ్యాఖ్యానిస్తారు! కొంతమంది మందు వల్ల ఒంటరి తనం దూరం అవుతుందని.. ఉన్నంతంలో కాసేపైనా ఎంతో కొంత మనోవేదన తీరుతుందని.. స్వర్గంలో దేవతలు తాగే సురాపానమే భూమిపై మద్యం అని వారి వారి అనుభవాలను బట్టి చెబుతుంటారు! వారి అలవాటును సమర్ధించుకుంటుంటారు!
మరికొంతమంది మాత్రం మద్యం తాగడం ఏమాత్రం మంచిది కాదని, అది ఆరోగ్యాన్ని పూర్తిగా పాడు చేస్తుందని నొక్కి చెబుతారు. అటు ఒళ్లునే కాదు ఇంటినీ గుల్ల చేస్తుందని వివరిస్తారు. ప్రభుత్వాలు సైతం ఓ పక్క మద్యం అమ్ముతూనే, అది ఆరోగ్యానికి హానికరమని హెచ్చరికలు జారీ చేస్తుంటాయి! ఈ క్రమంలో ఓ రచయిత కం వైద్యుడు ‘ఎక్స్’ వేదికగా రాసిన మందోపాక్యానం ఆసక్తిగా మారింది.
అవును... ఆనందం కోసమనో, బాధలో తోడు కోసమనో, సరదా కోసమో, సంబరాల కోసమో ఆల్కహాల్ తీసుకుంటే కలిగే అనర్ధాలను వివరిస్తూ వైద్యుడు శ్రీకాంత్ మిర్యాల ఎక్స్ వేదికగా 'మందోపాఖ్యానం' పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్ గా మారింది. ఇక కామెంట్ సెక్షన్ విషయానికొస్తే నెటిజన్లు తమ క్రియేటివిటీకి పని చెప్పి మరీ స్పందిస్తున్నారు.
మందోపాఖ్యానం:
ఆనందం కోసమని ఆల్కహాలు తాగేవు,
అల్సరొచ్చి అయ్యో రామా అనేవు.
బాధలో ఉన్నానని బీరు కొట్టేవు,
బోన్ మ్యారో దెబ్బతిని బావురుమనేవు.
సంతోషం పంచాలని స్కాచ్ కలిపేవు,
సిర్రోసిస్ తో సగం రక్తం కక్కి పోయేవు.
రంజుగా ఉందని రమ్ము ఎత్తేవు,
రక్త హీనత వచ్చి రసపట్టు కోల్పోయేవు.
జిహ్వచాపల్యానికి జిన్ను వేసేవు,
జివ్వుమని నరాలు లాగి జీవచ్ఛవమయ్యేవు.
సరదాకని సారా కొట్టేవు,
సరసానికి పనికిరాకుండా పోయేవు.
మత్తుకోసమని మద్యం ముట్టేవు,
మతిమరుపు పట్టి మంచం పట్టేవు.
వాదనకి దిగుదాం అని వోడ్కా పట్టేవు,
వాచిన గవదలతో కోతిలా మారేవు.
వయ్యారిభామనని వైన్ తాగేవు,
వరుసగా గర్భాలు వెడలిపోయేను.
కలుపుగోలు కోసమని కల్లు కొట్టేవు,
కండకరిగిపోయి మనిషివి కర్రగట్టేవు.
టోపీ తిప్పి టపీటపీమని టాకీలా తాగేవు,
టెస్టికిల్స్ ఎండిపోయి టెస్టోస్టెరాన్ ఆవిరయ్యేను.
మందు మానరా,
మనిషివయ్యేవు,
మత్తు వదలరా,
మహర్షివయ్యేవు.
కామెంట్ సెక్షన్ లో క్రియేటివిటీ!:
ఈ పోస్ట్ కింద కామెంట్ సెక్షన్లో పలువురు నెటిజన్లు ఆసక్తికరంగా, సరదాగా స్పందించారు. ఇందులో భాగంగా.. "బ్రీజర్ ఓకేనా డాక్టర్ గారు" అని ఒకరు రాస్తే... "బ్రాందీ జోలికి వెళ్ళలేదు తమరు... దయామూర్తులు 🙏🙏" అని మరొకరు స్పందించారు. "చాలా మంచిగా చెప్పారు" అని ఇంకొకరు కామెంట్ చేశారు!
ఇదే సమయంలో... "సహజసిద్ధమైన కల్లు కూడా ఆరోగ్యానికి హానికరమా డాక్టర్ గారు" ఒకరు తన మనోవేదనను చెప్పకనే చెప్పగా... "ఆధునిక ఆశు కవిత్వం అంటే ఇదేనేమో! ఈ సారి 'సిట్టింగ్' వేసినపుడు అందరికి చదివి వినిపించొచ్చు ☺️" అని స్పందించగా.. "కరోనా టైంలో ఇదే కదా అన్న కాపాడింది మనుషులను" అని మరొకరు వారి అనుభవాన్ని వెల్లడించారు!
