Begin typing your search above and press return to search.

ఇరాన్‌లో ఇంకా ఏమి సాధించాలి? – ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ ప్రశ్న

ప్రపంచ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి.. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఇరాన్ లక్ష్యంగా జరుగుతున్న దాడులపై ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  A.N.Kumar   |   3 April 2026 1:00 AM IST
ఇరాన్‌లో ఇంకా ఏమి సాధించాలి? – ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ ప్రశ్న
X

ప్రపంచ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి.. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఇరాన్ లక్ష్యంగా జరుగుతున్న దాడులపై ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై కొనసాగుతున్న సైనిక చర్యల ఉద్దేశం ఏమిటి? అక్కడ ఇంకా సాధించాల్సింది ఏముంది? అంటూ ఆయన సంధించిన ప్రశ్నలు ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో పెను చర్చకు దారితీశాయి. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే విషయంలో స్పష్టత లేకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

లక్ష్యాలు నెరవేరలేదా?

నేషనల్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అల్బనీస్ ప్రసంగిస్తూ ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా, మిత్రదేశాలు చేపట్టిన చర్యలపై తన గళాన్ని వినిపించారు. ప్రారంభంలో ఈ చర్యలకు ఆస్ట్రేలియా మద్దతు తెలిపిందని ఆయన గుర్తు చేశారు. ప్రధానంగా రెండు లక్ష్యాలతో ఈ పోరాటం మొదలైందని ఆయన వివరించారు. ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకోకుండా అడ్డుకోవడం... ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని తగ్గించి, పొరుగు దేశాలకు ముప్పు కలగకుండా చూడటం...

అయితే ప్రస్తుత పరిస్థితులను విశ్లేషిస్తే ఈ ప్రాథమిక లక్ష్యాలు ఇప్పటికే చాలా వరకు నెరవేరాయని అల్బనీస్ అభిప్రాయపడ్డారు. "లక్ష్యాలు నెరవేరినప్పుడు కూడా యుద్ధాన్ని పొడిగించడంలో అర్థం ఏమిటి? ఇంకా అక్కడ సాధించాల్సింది ఏముంది?" అని ఆయన ప్రశ్నించారు.

ఆర్థిక వ్యవస్థపై యుద్ధ మేఘాల ప్రభావం

యుద్ధం కేవలం సరిహద్దులకే పరిమితం కాదని.. దాని ప్రభావం ప్రపంచ దేశాల ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేస్తుందని అల్బనీస్ హెచ్చరించారు. సుదీర్ఘకాలం సాగే యుద్ధాల వల్ల కలిగే నష్టాలను ఆయన వివరించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకడం వల్ల సామాన్యులపై భారం పడుతోంది. వాణిజ్య మార్గాల్లో ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ దెబ్బతింటోంది. ఆర్థిక అనిశ్చితి వల్ల ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగి అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. "మేము ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా దాని తాలూకు ఆర్థిక భారాన్ని ఆస్ట్రేలియా ప్రజలు మోయాల్సి వస్తోంది" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సమన్వయ లోపంపై అసంతృప్తి

మిత్రదేశాల మధ్య ఉండాల్సిన కనీస సమాచారం కూడా లేకపోవడంపై ప్రధాని అల్బనీస్ విస్మయం వ్యక్తం చేశారు. యుద్ధం ప్రారంభానికి ముందు తమ దేశాన్ని ఎవరూ సంప్రదించలేదని.. ఇది మిత్రదేశాల మధ్య ఉండాల్సిన దౌత్యపరమైన సమన్వయ లోపాన్ని సూచిస్తోందని ఆయన సూటిగా విమర్శించారు. వ్యూహం లేని యుద్ధం ఎప్పుడూ ప్రమాదకరమేనని.. అది ఎప్పుడు ముగుస్తుందో తెలియని స్థితిలో ఉండటం అంతర్జాతీయ భద్రతకు మంచిది కాదని పేర్కొన్నారు.

దౌత్యమే ఏకైక మార్గం

పశ్చిమాసియాలో శాంతి నెలకొనడమే తమ ప్రాధాన్యతని అల్బనీస్ స్పష్టం చేశారు. రాబోయే నెలలు ప్రపంచ రాజకీయాల్లో అత్యంత క్లిష్టంగా ఉండబోతున్నాయని.. ఇలాంటి సమయంలో దూకుడు కంటే దౌత్యపరమైన చర్చలే పరిష్కారం చూపుతాయని ఆయన పిలుపునిచ్చారు. యుద్ధం లక్ష్యాలపై స్పష్టత లేకుండా ముందుకు వెళ్లడం వల్ల ప్రపంచ స్థిరత్వం దెబ్బతింటుందని.. అన్ని దేశాలు సమన్వయంతో ఒక శాంతియుత ముగింపు వైపు అడుగులు వేయాలని ఆయన కోరారు.

మొత్తానికి అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశంగా ఉన్న ఆస్ట్రేలియా నుండే ఇలాంటి ప్రశ్నలు రావడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అల్బనీస్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇటు అమెరికాను, అటు ఇజ్రాయెల్‌ను పునరాలోచనలో పడేస్తాయో లేదో వేచి చూడాలి.