నేవీ ఉత్సవాలకు పవన్... వెంట అకీరా నందన్
విశాఖలో డిసెంబర్ 4వ తేదీన జరగబోయే నావికాదళ ఉత్సవాలకు సంబంధించి ముందస్తుగా తూర్పు ప్రాంత నావికాదళ కమాండ్ విశాఖపట్నంలో ఒక భారీ కార్యక్రమం నిర్వహించారు.
By: Satya P | 30 Nov 2025 9:02 AM ISTవిశాఖలో డిసెంబర్ 4వ తేదీన జరగబోయే నావికాదళ ఉత్సవాలకు సంబంధించి ముందస్తుగా తూర్పు ప్రాంత నావికాదళ కమాండ్ విశాఖపట్నంలో ఒక భారీ కార్యక్రమం నిర్వహించారు. సర్గం 2025 - ఇండియన్ నేవల్ సింఫనిక్ ఆర్కెస్ట్రా కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ని ఈ ఏడాది నేవీ అధికారులు ఆహ్వానించారు. నేవీ సముద్రిక ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది.
వెంట కుమారుడితో :
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి నేరుగా విమానంలో పవన్ విశాఖ చేరుకున్నారు. ఆయన వెంట ఆరడుగులకు మించి ఎత్తుతో స్పురధ్రూపిగా నవ యువకుడు కనిపించారు. అతనే పవన్ కుమారుడు అకీరా నందన్. ఇక ఆయన ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని ఎంతో ఆనందించారు. నేవీ బ్యాండ్ ఆర్కేష్ట్రా అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది. అకీరా నందన్ కి కూడా మ్యూజిక్ మీద మంచి ఆసక్తి ఉంది. స్వతహాగా ఆయన కొన్ని వాయిద్య పరికరాలను కూడా వాయిస్తారు అని చెబుతారు. మరి ఆ మక్కువతోనే తండ్రి వెంట అకీరా నందన్ వచ్చి ఆద్యంతం ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా ఆసక్తిగా తిలకించారు.
ఫస్ట్ టైం పవన్ :
నేవీ ఉత్సవాలలో ఎపుడూ వీవీఐపీలు పాల్గొంటారు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ముఖ్యమంత్రులు హాజరవుతారు. ముందస్తు సన్నాహాలలో ఉప ముఖ్యమంత్రిని అహ్వానించడంతో తొలిసారి పవన్ తూర్పు నావికా దళాన్ని సందర్శించారు. ఇక ఆయనకు విశాఖపట్నం విమానాశ్రయంలో నేవల్ ఆఫీసర్లతో పాటు నగర పోలీసులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఈస్టర్న్ నావల్ కమాండ్ లోని శౌర్య అతిథి గృహంలోకి పవన్ చేరుకున్నారు. ఆ మీదట సముద్రిక ఆడిటోరియం వద్ద కూడా పవన్ కి ఘన స్వాగతం లభించింది చీఫ్ అడ్మిరల్ సంజయ్ భల్లా ఆయన సతీమణి ప్రియా భల్లా స్వాగతం పలికారు.
అలరించిన నేవీ బ్యాండ్ :
సర్గం 2025లో భాగంగా తూర్పు ప్రాంత నావికాదళ సింఫనీక్ బ్యాండ్ లయబద్దంగా చేసిన సంగీత విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మ్యూజిక్ కంపోజర్, ఈస్ట్రన్ నావల్ కమాండ్ బ్యాండ్ డైరెక్టర్ సతీష్ ఛాంపియన్, ఈస్ట్రన్ నావెల్ బ్యాండ్ డిప్యూటీ డైరెక్టర్ ప్రదీప్ కుమార్ లయబద్ధంగా సంగీతానికి దర్శకత్వం వహించగా, దేశభక్తి గీతాలు, హిందీ పాటలతో పాటు ఎన్విరాన్మెంట్ సంబంధిత అంశాలపై కూడా ఈస్ట్రన్ నేవీ బ్యాండ్ చేసిన సంగీతం అందరిని ఆకట్టుకుంది. సుమారు గంటకు పైగా చేసిన ఈ సంగీత విన్యాసాలు అందరిని సమ్మోహితం చేశాయి.
