Begin typing your search above and press return to search.

కేటీఆర్ అఖిలేష్ ...వేరే ప్లాన్ ఉందా ?

తెలంగాణాలో పర్యటనకు వచ్చిన యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఎక్కువగా గడుపుతున్నారు అని అంటున్నారు.

By:  Satya P   |   14 Dec 2025 4:00 AM IST
కేటీఆర్ అఖిలేష్ ...వేరే ప్లాన్ ఉందా ?
X

తెలంగాణాలో పర్యటనకు వచ్చిన యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఎక్కువగా గడుపుతున్నారు అని అంటున్నారు. ఆయన వచ్చీ రావడం తోనే కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు. ఇక ఆ తరువాత అంతా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోనే గడుపుతూ వచ్చారు. ఆయనతో కలిసి ప్రెస్ మీట్ ని అటెండ్ చేశారు. కాలం ఒక్కలా ఉండదని చెబుతూ బీఆర్ఎస్ మళ్ళీ పవర్ లోకి వస్తుందని ఆశలు కల్పించారు. ఇక కేటీఆర్ సైతం అఖిలేష్ యాదవ్ ని పొగిడేశారు.

కలిసి భోజనం :

కట్ చేస్తే రెండవ రోజున కూడా ఈ ఇద్దరూ మంచి మిత్రులుగా మారిపోయారు. కలసి హైదరాబాద్ లోని రామేశ్వరం కేఫ్‌లో మధ్యాహ్న భోజనం చేయడం విశేషం. ఈ ఇద్దరూ ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ హుషారుగా కనిపించారు. అలాగే భోజనం రుచులను ఒక వైపు ఆస్వాదిస్తూనే మరో వైపు వర్తమాన రాజకీయాల గురించి ఇద్దరూ చర్చించుకోవడం కనిపించింది. ఇదిలా ఉంటే కేఫ్ లో మంచి రుచికరమైన భోజనం లభించిందని అంతా బాగుందని అఖిలేష్ యాదవ్ కేఫ్ యజమానిని మెచ్చుకున్నారు. ఇక ఈ ఇద్దరు నేతలు కలిసి బీఆర్ఎస్ నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ ఇంటికి కూడా వెళ్ళారు.

ఇండీ మిత్రుడుండగా :

ఇదిలా ఉంటే ఇండియా కూటమిలో బీఆర్ఎస్ అయితే లేదు, ఆ పార్టీ జాతీయ రాజకీయాలలో తటస్థంగా ఉంటోంది. ఇక కాంగ్రెస్ తెలంగాణ లో అధికారంలో ఉంది అంతే కాదు ఇండియా కూటమిలో కాంగ్రెస్ ఎస్పీ భుజం భుజం కలిపి పనిచేస్తున్నాయి. ఇంకో వైపు చూస్తే తెల్లారి లేస్తే కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ విపక్ష రాజకీయం గట్టిగా చేస్తూ ఉంటుంది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం సైతం బీఆర్ఎస్ ని ప్రతిపక్షంగా భావించి బలంగా టార్గెట్ చేస్తూంటుంది. అలాంటి రాజకీయ నేపథ్యం తెలంగాణ లో ఉంది.

స్థానిక వేడి ఉండగా :

ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ని ఓడించాలని తాము గెలిచి తీరాలని బీఆర్ఎస్ చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ కీలక సమయంలో ఇండియా కూటమి మిత్రుడుగా హైదరాబాద్ వచ్చిన ఎస్పీ ధినేత అఖిలేష్ యాదవ్ బీఆర్ఎస్ అగ్ర నేత కేటీఆర్ తో చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం అయితే అందరికీ ఆశ్చర్యంగానే ఉంది అని అంటున్నారు. అయితే ఎస్పీ కాంగ్రెస్ యూపీలో మంచి మిత్రులు. అందువల్ల ఆ దోస్తీ అలాగే ఉంటుంది అని అంటున్నారు. ఇపుడు బీఆర్ఎ కొత్త చెలిమి మీదనే అంతా ఆలోచిస్తున్నారు. మరి ఇండీ కూటమిలోకి బీఆర్ఎస్ ని తీసుకుని రావాలని చూస్తున్నారా లేక ఎస్పీని తెలంగాణాలో విస్తరించే క్రమంలో బీఆర్ఎస్ ని మంచి మిత్రుడుగా చేసుకోవాలని ఆలోచిస్తున్నారా అన్నదే చర్చగా ఉంది.