తండ్రి యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ చీఫ్.. కొడుకు డ్రగ్స్ కు బానిస!
అవును... పంజాబ్ లో మాజీ డీజీపీ మహమ్మద్ ముస్తాఫా కుమారుడు అఖిల్ అక్తార్ మృతి కేసు సంచలనం సృష్టించిన నేపథ్యంలో... దీనిపై తాజాగా ముస్తాఫా స్పందించారు.
By: Raja Ch | 22 Oct 2025 1:40 PM ISTపంజాబ్ లో మాజీ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహమ్మద్ ముస్తాఫా కుమారుడు అఖిల్ అక్తార్ మృతి కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముస్తఫా, ఆయన భార్య, మాజీ మంత్రి రజియా సుల్తానాపై హర్యానా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును పరిశీలించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో తన కుమారుడి మరణం మాజీ డీజీపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవును... పంజాబ్ లో మాజీ డీజీపీ మహమ్మద్ ముస్తాఫా కుమారుడు అఖిల్ అక్తార్ మృతి కేసు సంచలనం సృష్టించిన నేపథ్యంలో... దీనిపై తాజాగా ముస్తాఫా స్పందించారు. ఈ సందర్భంగా.. తన కుమారుడికి డ్రగ్స్ అలవాటుందని తెలిపారు. ఇందులో భాగంగా... తన కుమారుడు గత 18 ఏళ్లుగా డ్రగ్స్ కు అలవాటు పడ్డాడని, అది ఓవర్ డోస్ కావడంతోనే మృతి చెందాడని తెలిపారు. ఇదే సమయంలో తనపై నమోదైన ఎఫ్.ఐ.ఆర్. గురించి ఆయన స్పందించారు.
ఇందులో భాగంగా... ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసినంత మాత్రాన తాము నేరం చేసినట్లు కాదని చెప్పిన ముస్తాఫా.. ఈ కేసుపై అసలు దర్యాప్తు ఇప్పుడే ప్రారంభమైందని, కొన్ని రోజుల్లో నిజం అందరికీ తెలుస్తోందని అన్నారు. ఈ నేపథ్యలోనే... తన కుమారుడు 18 ఏళ్లుగా డ్రగ్స్ కు బానిసయ్యాడని.. ఓ డ్రగ్ ఇంజెక్షన్ ఓవర్ డోస్ అవడంతోనే అతడు ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు.
ఇదే సమయంలో... గతంలో డ్రగ్స్ నుంచి బయటపడేందుకు చండీగఢ్ లో చికిత్స కూడా చేయించామని, అయితే అక్కడి నుంచి అఖిల్ పారిపోయి వచ్చాడని అన్నారు. అతడు డ్రగ్స్ కొనేందుకు డబ్బు కోసం తన భార్య, తల్లిని వేధించేవాడని ఆరోపించారు. తనను తప్పుడు కేసులో ఇరికించి జైలులో పెట్టడమో లేదా చంపేందుకో ప్రణాళికలు జరుగుతున్నాయని ముస్తాఫా ఆరోపించారు.
తన కుమారుడు.. భద్రతా బృందంపై, గన్ మెన్ లపై కూడా దాడి చేశాడని.. వారు పని మానేసి వెళ్లిపోయారని.. ఒకసారి అతను చండీగఢ్ లో పోలీసులపై కూడా దాడి చేశాడని తెలిపారు. తన కుమారుడు సైకోట్రోపిక్ డ్రగ్స్ కు బానిసయ్యాడని.. తరువాత అతను సాఫ్ట్ డ్రగ్స్ కు మారాడని.. కొంతకాలం క్రితం కొంతమంది పెడ్లర్లు అతనికి ఐ.సీ.ఈ. డ్రగ్ ఇచ్చారని.. దీంతో అతను మళ్ళీ అలవాటు పడ్డాడని తెలిపారు.
డ్రగ్స్ నిరోధక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ చీఫ్ గా పనిచేశారు!:
2018లో పంజాబ్ పోలీసుల మాదకద్రవ్యాల నిరోధక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (ఎస్.టీ.ఎఫ్.) చీఫ్ గా కూడా పనిచేసిన ముస్తాఫా... నాలుగుసార్లు రాష్ట్రపతి పోలీసు శౌర్య పతకాన్ని గెలుచుకున్నారు. ఇక ఆయన భార్య సుల్తానా పంజాబ్ లోని ఏకైక ముస్లిం మెజారిటీ జిల్లా అయిన మలేర్ కోట్లా నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అసలేం జరిగింది?:
అఖిల్ అఖ్తర్ అక్టోబరు 16న పంచకులలోని తన ఇంట్లో స్పృహ కోల్పోయాడు. అది గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు. అనారోగ్య సమస్యలతో మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. అయితే... ఇటీవల అతడి స్నేహితుడు పోలీసులను ఆశ్రయించి, అఖిల్ ను హత్య చేసి ఉంటారని ఆరోపించారు.
ఈ సందర్భంగా స్పందించిన డీసీపీ గుప్తా... అఖిల్ మరణంపై మొదట్లో ఎటువంటి అనుమానం రాలేదని, పోస్ట్ మార్టం పరీక్ష తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు. అయితే... మృతుడు మరణానికి ముందు చేసిన కొన్ని సోషల్ మీడియా పోస్టులు, వీడియోలు వెలుగులోకి వచ్చాయని.. అతని ప్రాణాలకు బెదిరింపులు ఉన్నాయనే భయాలను ఆ పోస్టులు ఆరోపించాయని తెలిపారు.
అక్తర్ అంత్యక్రియలు ఉత్తరప్రదేశ్ లోని సహారన్ పూర్ లోని అతని పూర్వీకుల గ్రామం హర్దా ఖేరిలో జరిగాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు తిన్న పదార్థాన్ని గుర్తించడానికి విసెరా నమూనాలను ఫోరెన్సిక్ విభాగానికి పంపారు. అయితే.. నివేదిక రావడానికి రెండు నుండి మూడు నెలలు పట్టే అవకాశం ఉందని అంటున్నారు.
