అక్బరుద్దీన్ సంచలన నిర్ణయం ...మజ్లిస్ కి ఎలా ?
సలాఉద్దీన్ ఒవైసీ నుంచి మజ్లీస్ పార్టీని దశాబ్దాలుగా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రజానీకం ఆదరిస్తున్నారు.
By: Satya P | 19 Nov 2025 9:02 AM ISTసలాఉద్దీన్ ఒవైసీ నుంచి మజ్లీస్ పార్టీని దశాబ్దాలుగా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రజానీకం ఆదరిస్తున్నారు. ఎన్నో సార్లు సలాఉద్దీన్ ఒవైసీ గెలిచి ఎంపీ అయ్యారు. ఆయన స్థాపించిన మజ్లీస్ పార్టీ నుంచి ఎందరో ఎమ్మెల్యేలు కూడా అయ్యారు. ఇక తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్ని పెద్ద కుమారుడు అసదుద్దీన్ ఒవైసీ స్వీకరించారు. ఇక చిన్న కుమారుడు అక్బరుద్దీని ఒవైసీ కూడా యంగ్ టర్క్ గా పార్టీలో చలామణీ అవుతూ వచ్చారు. ఈ ఇద్దరు బ్రదర్స్ మజ్లీస్ కి రెండు కళ్ళుగా ఉంటూ పార్టీని విజయతీరాలకు చేర్చడమే కాకుండా ఎన్ని విపరిణామాలు వచ్చినా జెండా ఎగిరేలా చేసుకుని వస్తున్నారు. ఇందులో అసదుద్దీన్ ఒవైసీ ఎంపీగా అక్బరుద్ధీన్ ఒవైసీ ఎమ్మెల్యేగా గెలవడం విశేషం.
రిటైర్మెంట్ సంకేతాలు :
తమ్ముడు చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ రాజకీయాల నుంచి రిటైర్ కావాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఆయన ఈ మేరకు సంకేతాలు కూడా పార్టీ నేతలకు ఇచ్చేశారు అని అంటున్నారు. ఆయన తెలంగాణా అసెంబ్లీలో మజ్లీస్ పార్టీకి ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. అయితే ఆయన తాను ఇక చాలు రాజకీయం అని అనుకుంటున్నారుట. తన అనుచరులు పార్టీ నేతలకు కార్యకర్తలకు కూడా ఆయన తాను ఇక రాజకీయాల్లో ఉండబోనని సంకేతాలు ఇచ్చేశారు అని టాక్ నడుస్తోంది.
రీజన్ అదేనట :
అక్బరుద్ధీన్ ఒవైసీకి మంచి నాయకుడు డైనమిక్ నేచర్ కలవారుగా పేరుంది. ఆయన మంచి వక్త కూడా. సబ్జెక్ట్ మీద ఎంతో పట్టు ఉంది. అసెంబ్లీలో ఆయన స్పీచ్ కి ఫిదా అయ్యే వారు ఎందరో ఉన్నారు. ఇక మాస్ స్పీచ్ ఇవ్వడంతో కూడా దిట్ట. అయితే ఆయన ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్లనే రాజకీయాలకు గుడ్ బై కొడుతున్నారు అని అంటున్నారు. చాలా కాలం క్రితం అంటే 2011 లో ఆయన మీద ఒక భారీ దాడి జరిగింది. అప్పట్లో ఆయన ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళి బతికి బట్టకట్టారు. గుర్తు తెలియని దుండగులు ఆయన మీద కత్తులతో తుపాకులతో చేసిన తీవ్ర దాడికి ఆయనకు కడుపులో ఇతర శరీర భాగాల మీద గాయాలు అయ్యాయి. ఆపరేషన్లు చేసి ఆయన శరీరంలో దూసుకుని పోయిన బుల్లెట్లు అన్నీ తొలగించినా కూడా ఒకటి మాత్రం అలాగే ఉంది అని చెబుతున్నారు. దాని వల్లనే ఆయన ఈ రోజుకీ హెల్త్ పరంగా ఇబ్బందులు పడుతున్నారు అని అంటున్నారు. దాంతోనే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుని పూర్తి కాలం విశ్రాంతి తీసుకోవాలని చూస్తున్నారుట.
అందివచ్చిన కొడుకు :
ఇక చాంద్రాయణగుట్ట అసెంబ్లీ సీటుకు అక్బరుద్ధీన్ కుమారుడు నూరుద్దీన్ పోటీ చేస్తారు అని టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది. తండ్రి వెంటనే ఉంటూ రాజకీయం మొత్తం చూస్తున్న నూరుద్దీన్ కి పార్టీ క్యాడర్ ని అనుచరులను సన్నిహితం చేసే పనిలో అక్బరుద్ధీన్ ఉన్నారని అంటున్నారు. 2028లో తెలంగాణాకు ఎన్నికలు జరుగుతాయి. అంటే మరో మూడేళ్ళు సమయం ఉంది. ఈ లోగా ఈ యువ నేత అన్ని విధాలుగా రాటు తేలుతారు అని అంటున్నారు. అంటే ఫ్యూచర్ లో పెదనాన్న అసదుద్దీన్ ఒవైసీకి ఆయన తోడుగా తండ్రి అక్బరుద్దీన్ కి వారసుడిగా పనిచేస్తారు అని అంటున్నారు. మొత్తానికి ఈ పరిణామం వల్ల మజ్లీస్ లో అయితే కొంత నిరుత్సాహం ఉంది కానీ యువ నేతగా నూరుద్దీన్ రంగంలోకి దిగి కొత్త జవసత్వాలు మజ్లీస్ పార్టీకి అందిస్తారు అని అంటున్నారు.
