అజిత్ విగ్రహం వెలిసింది..రాజకీయాల్లోకి రావాల్సిందేనా ?
ఇక చూస్తే చెన్నై సమీపంలోని కోవూరులో అజిత్ విగ్రహాన్ని తమిళనాడులోని అజిత్ అభిమానులు అంతా కలసి తాజాగా ఏర్పాటు చేశారు.
By: Satya P | 27 Oct 2026 9:20 AM ISTతమిళనాడు రాజకీయం రెండు ద్రవిడ పార్టీల చేతులు మారిపోయింది. ఇపుడు పూర్తిగా చేజారుతుందా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే వెండితెర దళపతి విజయ్ టీవీకేని స్థాపించి సీఎం అయిపోయారు. ఆయన సమకాలీన స్టార్లు కూడా పాలిటిక్స్ వైపు చూస్తున్నారా అన్నది హాట్ డిస్కషన్ పాయింట్ గా ఉంది. ఒకవేళ వారు రావాలనుకోకపోయినా అభిమానులు అయితే అసలు ఊరుకునేలా లేరు. మీ హీరో వచ్చాడు, మా హీరో కూడా రావాల్సిందే అన్నది ఫ్యాన్స్ అందమైన పంతం. దాని వెనక అంతులేని రాజకీయ పందెం కూడా ఉంది. అందుకే విజయ్ రూట్లో చాలా మంది వెండి తెర వేలుపులు కొత్త రాజకీయ అవతార్ కి వేదికలు రెడీ అవుతున్నాయా అన్నదే అంతా ఆలోచించే విషయంగా ఉంది.
అజిత్ బాబు సైతం :
ఇక తమిళనాడులో అజిత్ సూపర్ స్టార్ గా ఉన్నారు. ఆయన విజయ్ దాదాపుగా ఒకే సమయంలో సినీ ఎంట్రీ ఇచ్చారు. 1991లో తెలుగులో గొల్లపూడి మారుతీరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ప్రేమ పుస్తకం మూవీ ద్వారా అజిత్ హీరోగా వచ్చారు. ఆ తరువాత ఆయన ఎన్నో సినిమాలు తమిళ్ లో చేస్తూ సూపర్ స్టార్ డం సంపాదించారు. అలాగే 1994 సమయంలో విజయ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి నిన్నటి దాకా దాదాపు మూడు దశాబ్దాల పాటు అగ్రశ్రేణి నటుడిగా ఉంటూ దళపతి అనిపించుకున్నారు. ఈ ఇద్దరి హీరోల మధ్య పోటా పోటీగా ఉండేది. మరి విజయ్ సీఎం అయ్యారు. అజిత్ సంగతి ఏంటి అని చాలా కాలంగా చర్చ గానే ఉంది. దానికి అభిమానుల జవాబు అన్నట్లుగా ఆయన విగ్రహం ఒకటి వెలిసింది.
ఆలయం కూడా :
ఇక చూస్తే చెన్నై సమీపంలోని కోవూరులో అజిత్ విగ్రహాన్ని తమిళనాడులోని అజిత్ అభిమానులు అంతా కలసి తాజాగా ఏర్పాటు చేశారు. అంతేకాదు, ఆయనకు ప్రత్యేకంగా ఆలయం నిర్మించనున్నట్లుగా అజిత్ ఫ్యాన్స్ ప్రకటించింది. ఇక్కడితో అభిమానం ఆగడం లేదు, తమ హీరో అజిత్‌ను రాజకీయాల్లోకి రావాలని కోరుతూ అభిమానులు అంతా కలసిఒక రాజకీయ సంస్థను కూడా ఏర్పాటు చేయడం విశేషం. ఇదే ఇప్పుడు తమిళనాట సంచలనం రేపుతోంది.
పాలాభిషేకాలతో :
ఇక ఐదు అడుగుల పది అంగుళాల ఎత్తుతో అజిత్ విగ్రహాన్ని తయారు చేయించిన అభిమానులు దాని కోసం 1.76 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లుగా చెబుతున్నారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు పాలాభిషేకం నిర్వహించి 108 కొబ్బరికాయలు కొట్టారు. ఆ విగ్రహానికి ప్రత్యేక పూజలు కూడా చేసి తమ అభిమాన హీరో మీద తమ భక్తిని అభిమానాన్ని ఘనంగా చాటుకున్నారు. అదే కోవూరు ప్రాంతంలో సుమారు మూడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అజిత్ కోసం ప్రత్యేక ఆలయాన్ని నిర్మించాలని ప్రణాళిక రూపొందించినట్లుగా ఆయన ఫ్యాన్స్ ప్రతినిధులు చెబుతున్నారు.
అజిత్ వస్తే పాలిటిక్స్ చేంజ్ :
తమిళనాడులో తమ హీరో అజిత్ క్రేజ్ వేరే లెవెల్ అని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. తమ హీరో ఎంట్రీ ఇవ్వాలే కానీ మొత్తం రాజకీయ పరిణామాలు మారిపోతాయని ఫ్యాన్స్ గట్టిగా బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. అజిత్ కి అన్ని వర్గాలలో పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారని ఆయన రాజకీయాల్లోకి రావాలే కానీ ప్రజలు అంతా పూర్తి మద్దతుగా నిలుస్తారని ఫ్యాన్స్ ధీమాగా చెబుతున్నార్జు. ఈ కోరికను కేవలం మనసులో ఉంచుకోకుండా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి సామాజిక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూనే అజిత్ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరాన్ని ప్రజలకు చెబుతూ భారీ ఎత్తున ప్రచారం చేస్తామని అభిమానులు చెబుతున్నారు.
రాజకీయ సంస్థతోనే :
ఇక అజిత్ ప్రమేయం లేకుండానే అభిమానులు ఇటీవల అనైత్తు నన్బర్గల్ మున్నేట్ర కళగం అంటే ఆల్ ఫ్రెండ్స్ ప్రోగ్రెస్ పార్టీ పేరుతో ఒక రాజకీయ సంస్థను ఏర్పాటు చేయడం విశేషం. ఈ సంస్థకు పసుపు, లేత గులాబీ రంగులతో కూడిన జెండాను కూడా ఫ్యాన్స్ డిజైన్ చేశారు. ఈ పార్టీ గుర్తుగా కారును నిర్ణయించినట్లుగా ఫ్యాన్స్ నిర్వాహకులు చెబుతున్నారు. ఇక ఈ పార్టీ అధ్యక్షుడు బాబు నేతృత్వంలో తొలి కార్యవర్గ సమావేశం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా అజిత్ రాజకీయాల్లోకి రావాలని అభిమానులంతా డిమాండ్ చేశారు. 2031 లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టాలనే లక్ష్యంతోనే తామంతా ముందుకు సాగుతున్నట్లు ఫ్యాన్స్ చెబుతున్నారు.
నో పాలిటిక్స్ అంటూ :
అయితే హీరో అజిత్ కి మాత్రం రాజకీయాల పట్ల ఆసక్తి లేదని అంటున్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం కూడా లేదని అజిత్ స్పష్టంగా చెబుతున్నా ఫ్యాన్స్ మాత్రం వదలడం లేదు. అభిమానులే ఒక రాజకీయ సంస్థను ఏర్పాటు చేయడం అజిత్ రావాలని కోరడంతో ఇపుడు తమిళనాడులో ఇది పెద్ద ఎత్తున చర్చకు తావిస్తోంది. తమిళ రాజకీయాల్లో సినీ ప్రముఖులకు ఎపుడూ కీలక పాత్ర ఉంటుంది. తాజాగా విజయ్ సీఎం కావడంతో అజిత్ కి కూడా మంచి చాన్స్ ఉందని అభిమానులు అంటున్నారు.
