Begin typing your search above and press return to search.

నిన్న ఠాక్రేలు..నేడు ప‌వార్ లు..మ‌హారాష్ట్ర‌లో మ‌ళ్లీ ఏక‌మ‌య్యారు

మ‌హారాష్ట్ర‌ను శాసించ‌గ‌ల రెండు ప‌వ‌ర్ ఫుల్ రాజ‌కీయ కుటుంబాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

By:  Tupaki Political Desk   |   29 Dec 2025 1:33 PM IST
నిన్న ఠాక్రేలు..నేడు ప‌వార్ లు..మ‌హారాష్ట్ర‌లో మ‌ళ్లీ ఏక‌మ‌య్యారు
X

మ‌హారాష్ట్ర‌ను శాసించ‌గ‌ల రెండు ప‌వ‌ర్ ఫుల్ రాజ‌కీయ కుటుంబాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రెండు జాతీయ పార్టీలు, నాలుగు ప్రాంతీయ పార్టీల బ్యాటిల్ ఫీల్డ్ గా మారిన ఆ రాష్ట్రంలో స్థానిక ఎన్నిక‌ల ముంగిట రాజ‌కీయాలు చ‌క‌చ‌కా మారుతున్నాయి. గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన బీజేపీ సార‌థ్యంలోని మ‌హాయుతి కూటమిలో కీల‌క పార్టీ అయిన ఎన్సీపీ (అజిత్ ప‌వార్) ఇప్పుడు మ‌రింత బ‌లంగా మార‌బోతోంది. ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్ష మ‌హా ఘ‌ట్ బంధ‌న్ లోని కీల‌క పార్టీ శివ‌సేన (ఉద్ధ‌వ్ ఠాక్రే) పార్టీతో క‌లిసి పోటీ చేయ‌నున్న‌ట్లు మ‌హారాష్ట్ర న‌వ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే ప్ర‌క‌టించారు. ఇప్పుడు ఉప ముఖ్య‌మంత్రి అజిత్ ప‌వార్ త‌న బాబాయ్ కు చెందిన‌ ఎన్సీపీ (శ‌ర‌ద్ ప‌వార్)తో చేతులు క‌లిపారు. వ‌చ్చే నెల 15న మ‌హారాష్ట్ర‌లో స్థానిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దేశంలోనే అతిపెద్ద కార్పొరేష‌న్ అయిన బృహ‌న్ ముంబై కార్పొరేష‌న్ (బీఎంసీ)తో పాటు 28 కార్పొరేష‌న్లు, 32 జిల్లా కౌన్సిళ్లు, 336 పంచాయ‌తీ స‌మితుల‌కు ఒకే రోజు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. గ‌త ఏడాది జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటినా.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడింది శ‌ర‌ద్ ప‌వార్ నాయ‌క‌త్వంలోని ఎన్సీపీ. ఇప్పుడు స్థానిక ఎన్నిక‌ల ముంగిట మాత్రం అనూహ్య ప‌రిణామం జ‌రిగింది. శ‌ర‌ద్-అజిత్ ప‌వార్ ల నాయ‌క‌త్వంలోని రెండు ఎన్సీపీలు క‌లిసిపోయి పింప్రి-చించ్వాడ్ ఎన్నిక‌ల బ‌రిలో పోటీ చేయ‌నున్నాయి. త‌మ కూట‌మికి బాబాయ్ శ‌ర‌ద్ ప‌వారే సార‌థ్యం వ‌హిస్తార‌ని అజిత్ ప‌వార్ వెల్ల‌డించారు.

అప్ప‌ట్లో అనూహ్యంగా చీల్చి..

అనూహ్యంగా 2023లో శ‌ర‌ద్ ప‌వార్ ఎన్సీపీని చీల్చి ఏకంగా శివ‌స‌నే-బీజేపీ ప్ర‌భుత్వంలో డిప్యూటీ సీఎంగా చేరిపోయారు అజిత్. వారితోనే పొత్తు పెట్టుకుని గ‌త ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ గెలిచారు. మ‌ళ్లీ ఇప్పుడు అనూహ్యంగా స్థానిక ఎన్నిక‌ల్లో బాబాయ్ పార్టీతో క‌లిసి పోటీ చేస్తున్నారు. దీనికిముందే 2022లో శివ‌సేను చీల్చారు ఏక్ నాథ్ శిందే. అప్ప‌ట్లో ఆయ‌న బీజేపీ మ‌ద్ద‌తుతో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసి సీఎం అయ్యారు. అయితే, శిందే ఇప్పుడు శివ‌సేనను పూర్తిగా సొంతం చేసుకున్నారు. మాజీ సీఎం ఉద్ధ‌వ్ కు మాత్రం ఆయ‌న పేరిట శివ‌సేన మిగిలింది. ఉద్ధ‌వ్ తో శిందే క‌ల‌వ‌కున్నా.. దాదాపు 20 ఏళ్ల కింద‌టే వేరుప‌డిన రాజ్ ఠాక్రే ఇప్పుడు చేతులు క‌లిపారు.

స్థానికంగా ప‌ట్టులేక‌నే...?

దాదాపు మూడేళ్ల కింద‌ట ఎన్సీపీని చీల్చినా.. అజిత్ ప‌వార్ కు క్యాడ‌ర్ పెద్ద‌గా లేదు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ హ‌వాతో ఎలాగో నెట్టుకొచ్చారు. కానీ, స్థానిక ఎన్నిక‌ల్లో మాత్రం అది సాధ్యం కాదు. అందుక‌నే సంస్థాగ‌తంగా బ‌లంగా ఉన్న బాబాయ్ పార్టీ శ‌ద‌ర్ ప‌వార్ ఎన్సీపీతో చేతులు క‌లుపుతున్నార‌ని విశ్లేష‌కులు అంటున్నారు. పైకి మాత్రం రాష్ట్ర ప్ర‌యోజ‌నాల రీత్యా అని చెబుతున్నారు. ఇప్ప‌టికే ఠాక్రే సోద‌రులు చేతులు క‌ల‌ప‌గా, ఇప్పుడు ప‌వార్ లు ఏకం అయ్యారు. మ‌రి ఆయా పార్టీల విలీనం ఎప్పుడో? అన్న‌ది చూడాలి.