మీ దగ్గర ఓట్లు ఉంటే నా దగ్గర నిధులున్నాయ్.. అజిత్ పవార్ సంచలనం
అజిత్ పవార్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోక్లిప్ వైరల్ గా మారింది. ఈ తీరును విపక్షాలు మండిపడుతున్నాయి. చివరకు సంకీర్ణ ప్రభుత్వంలో మిత్రపక్షం సైతం ఈ వ్యాఖ్యల్ని తప్పు పడుతున్నాయి.
By: Garuda Media | 23 Nov 2025 4:00 PM ISTమహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం కొలువు తీరి ఉన్న సంగతి తెలిసిందే. ఆర్థిక మంత్రిగా ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆ రాష్ట్రంలోని బారామతి జిల్లా మాలెగావ్ నగర పంచాయితీ ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని నగర పంచాయితీలకు ఎన్నికలు డిసెంబరు 2న జరుగుతున్న నేపథ్యంలో పార్టీలు ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాయి. తాజాగా రాష్ట్ర ఆర్ధిక మంత్రి కం ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రచారానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
తమ పార్టీకి చెందిన ఎన్సీపీ అభ్యర్థులు పద్దెనిమిది మంది ఉన్నారని.. వారిని ఎన్నుకుంటే నిధుల కొరత అనేది ఉందని.. మొత్తం పద్దెనిమిది మందినీ ఎన్నుకుంటే తాను ఇచ్చిన ఎన్నికల హామీలన్నింటిని నెరవేరుస్తానని.. అదే సమయంలో తమ అభ్యర్థుల్ని తిరస్కరించే పక్షంలో తాను నిధులు ఇవ్వనని ఓపెన్ గా చెప్పేశారు.‘‘మీ వద్ద ఓట్లు ఉంటే.. నా దగ్గర నిధులు ఉన్నాయి’’ అంటూ ఓటర్లకు వార్నింగ్ ఇచ్చిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
అజిత్ పవార్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోక్లిప్ వైరల్ గా మారింది. ఈ తీరును విపక్షాలు మండిపడుతున్నాయి. చివరకు సంకీర్ణ ప్రభుత్వంలో మిత్రపక్షం సైతం ఈ వ్యాఖ్యల్ని తప్పు పడుతున్నాయి. ఉద్దవ్ వర్గానికి శివసేనకు చెందిన నేత అంబదాస్ స్పందిస్తూ.. పవార్ తీరును తప్పు పట్టారు. నిధులు అజిత్ పవార్ ఇంటి నుంచి రావని.. సామాన్యులు చెల్లించే పన్నుల నుంచి వస్తాయన్న విషయాన్ని మర్చిపోకూడదంటూ.. ‘‘పవార్ లాంటి నాయకుడు ఓటర్లను బెదిరిస్తుంటే.. ఎన్నికల కమిషన్ ఏం చేస్తోంది’’ అని ప్రశ్నించారు. ఓటర్ల మనసు దోచుకోవటానికి బదులుగా.. ఓపెన్ గా వార్నింగ్ ఇస్తున్న అజిత్ పవార్ లాంటి నేతలపై ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
