Begin typing your search above and press return to search.

ముఖ్యమంత్రి కాలేకపోయిన అజిత్ పవార్

అయితే బుధవారం ఉదయం మహారాష్ట్రలోని బారామతి వద్ద జరిగిన దారుణ విమాన ప్రమాదంలో అజిత్ పవార్ కన్ను మూశారు.

By:  Satya P   |   28 Jan 2026 10:00 PM IST
ముఖ్యమంత్రి కాలేకపోయిన అజిత్ పవార్
X

రాజకీయాల్లో ఎవరికైనా అంతిమ లక్ష్యం ఉన్నత స్థానానికి చేరుకోవడమే. ఆ విధంగా చూస్తే రాష్ట్ర స్థాయి నాయకులు అంతా ముఖ్యమంత్రి పీఠం మీదకే గురి పెడతారు. తమ జీవిత కాలంలో ఆ ఉన్నతాసనం మీద కొన్నాళ్ళు అయినా కూర్చోవాలని ఆలోచిస్తారు, ఆశిస్తారు. అయితే బుధవారం ఉదయం మహారాష్ట్రలోని బారామతి వద్ద జరిగిన దారుణ విమాన ప్రమాదంలో అజిత్ పవార్ కన్ను మూశారు.

జీవిత లక్ష్యం :

తాను సీఎం కావాలని ఆయన అనుకున జీవిత కాల లక్ష్యం అడుగు దూరంలో ఉండగానే ఈ విధంగా జీవితాన్ని చాలించడం అది కూడా ఘోర ప్రమాదంలో సంభవించడం బట్టి చూస్తే విధి ఎంత బలీయమైనది అన్నది అర్ధం అవుతుంది. మరో వైపు చూస్తే అజిత్ పవార్ రాజకీయ జీవితం ఏమీ చిన్నది కాదు, ఏకంగా నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘమైనది. 1982లో చక్కెర కర్మాగారం సహకార సంఘాల ఎన్నికల ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన అజిత్ పవర్ వయసు అప్పటికి గట్టిగా 23 ఏళ్ళు మాత్రమే. మరో పదేళ్ళు గిర్రున తిరిగేసరికి 1991లో ఆయన బారామతి లోక్ సభకు ఎంపీగా ఎన్నిక అయ్యారు. అంతే కాదు ఏడు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గి ఆరు సార్లు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాదాపుగా కీలకమైన మంత్రిత్వ శాఖలు అన్నీ నిర్వహించిన అజిత్ పవార్ కి ముఖ్యమంత్రి కావాలన్నదే చిరకాలం కోరిక. అది మాత్రం ఎక్కడా నెరవేరక పోవడం విధి లిఖితం అనుకోవాలేమో అంటారు.

గుడ్ అడ్మినిస్ట్రేటర్ :

పాలనపైన అజిత్ పవార్ కి ఉన్నంత పట్టు ఎవరికీ లేదని చెబుతారు. ఆయన అనేక మంది ముఖ్యమంత్రులతో కలసి పనిచేశారు. పాలనాపరంగా ఎంతో అనుభవం సంపాదించారు. అంతే కాదు తనకు అప్పగించిన ప్రతీ శాఖలోనూ రాటు తేలారు, రాణించారు. ప్రభుత్వంలో ఉన్నపుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నపుడు కానీ తన సమర్ధతను చాటి చెబుతూ వచ్చారు.

వ్యూహ చతురుడిగా :

మహారాష్ట్ర రాజకీయాల్లో వ్యూహాలు రూపొందించి దిట్టలుగా అనిపించుకున్న వారిలో శరద్ పవార్ ఒకరు అయితే అజిత్ పవార్ మరొకరు. కాంగ్రెస్ లాంటి మహా సముద్రంలో ఉన్నా లేక ఎన్సీపీ లాంటి ప్రాంతీయ పార్టీని స్థాపించినా అంతే కాకుండా దానిని కూడా రెండుగా చీల్చినా ఎక్కడా అస్తిత్వం కోల్పోకుండా వ్యవహరించడం అజిత్ పవార్ కే చెల్లింది. ఆయన వ్యూహాలు అంత పదును తేరి ఉండేవి. అంతే కాదు అధికార పీఠం వైపుగానే ఆయన అడుగులు పడేవి. అందుకే ఆయన రాజకీయ జీవితం ఒక్కసారి తరచి చూస్తే అత్యధిక కాలం అధికారంలోనే ఉన్నారు. పార్టీలు ఏమిటి అన్నది కాదు ఎవరు సీఎం అన్నది అంతకంటే కాదు, ఆయన మాత్రం ఉప ముఖ్యమంత్రిగా ఉండాల్సిందే. ఇదే ఫార్ములా చాలా దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో అమలు అవుతూ వచ్చింది.

క్రమశిక్షణ విషయంలో :

అజిత్ పవార్ గురించి సహచరులు అనుచరులు చెప్పుకునే మరో విశిష్ట లక్షణం క్రమశిక్షణ. ఆయన సమయ పాలన కచ్చితంగా పాటిస్తారు. ఎపుడూ ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో సమావేశాలు నిర్వహించేవారు అంటే ఆయనకు ఉన్న క్రమశిక్షణ నిబద్ధత ఏంటో అర్ధం అవుతాయి. అలాగే చెప్పిన టైం కి చెప్పిన చోటకు వెళ్ళడంలోనూ ఆయన పేరునే చెబుతారు. అలాగే బారామతిలో జరిగే స్థానిక ఎన్నికల ప్రచారం కోసం ఆయన చెప్పిన సమయానికి వెళ్ళాలని వస్తూ అందులోనే చివరికి ప్రాణాలు అర్పించారు అని గుర్తు చేసుకుని అంతా కన్నీరు పెడుతున్నారు. ఏది ఏమైనా శరద్ పవార్ కి సిసలైన వారసుడిగా అజిత్ పవార్ రాణించారు అన్నది చెప్పక తప్పదు. ఆయన రాజకీయం ఉప ముఖ్యమంత్రిగా ముగిసినా మహారాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ఆయన మార్క్ అన్నది తరాలుగా అందరికీ గుర్తుండే ఉంటుందని అంటున్నారు.