'పవార్' లేదు.. ఎన్సీపికి తీరని లోటు
విమానం ప్రయాణం ఇంకా ఎన్నో కోట్ల మందికి ఇప్పటికీ నెరవేరని కల. కానీ కొన్ని కుటుంబాలకు పీడకల. విమాన ప్రమాదాలు ఎన్నో కుటుంబాల్లో విషాధాన్ని నింపాయి.
By: A.N.Kumar | 28 Jan 2026 4:00 PM ISTవిమానం ప్రయాణం ఇంకా ఎన్నో కోట్ల మందికి ఇప్పటికీ నెరవేరని కల. కానీ కొన్ని కుటుంబాలకు పీడకల. విమాన ప్రమాదాలు ఎన్నో కుటుంబాల్లో విషాధాన్ని నింపాయి. ఆశలు, ఆశయాలను బుగ్గిపాలు చేశాయి. నమ్ముకున్న వారి భవిష్యత్తును నేలరాల్చాయి. సామాన్యులే కాదు ప్రముఖులు కూడా విమాన ప్రమాద బాధితులే. ఒక్కోక్కరిదీ ఒక్కో గాథ. ఇప్పుడు మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా అలాంటి గాథే.
మహారాష్ట్ర డిప్యూటి సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయనతో పాటు మరో ముగ్గురు కూడా మరణించారు. అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం కొద్దిసేపటికే బారామతిలో కుప్పకూలింది. దీంతో ఎన్సీపీకి కోలుకోలేని దెబ్బపడింది. శరద్ పవార్, అజిత్ పవార్ కొద్దికాలం నుంచి రెండు వర్గాలుగా ఉంటున్నారు. ఇటీవలే కలిశారు. ఇంతలోనే అజిత్ పవార్ మరణించడం ఎన్సీపీ వర్గాల్లో తీవ్రదుఃఖాన్ని మిగిల్చింది. 2026 జనవరి 28న ఘటన చోటుచేసుకుంది.
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా విమాన ప్రమాదంలో మరణించారు. 2025 జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం కొన్ని నిమిషాల్లోనే ప్రమాదానికి గురైంది. ఆ ఘటనలో వందలాది మందితో పాటు విజయ్ రూపాని కూడా తుదిశ్వాస విడిచారు. ఆ విమానం మెడికల్ కాలేజీ హాస్టల్ పై కూలడంతో కాలేజీలో ఉన్న వైద్య విద్యార్థుల కూడా పదుల సంఖ్యలో మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒకేరోజు వందలాది మంది చనిపోవడంతో దేశప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
2011 ఏప్రిల్ 30న అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న దోర్జీ ఖండు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. పర్వత ప్రాంతాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదానికి గురై హెలికాప్టర్ కూలింది. ఆ ఘటనలో ఆయనతో పాటు ఉన్నవారు కూడా మరణించారు. గిరిజనుల అభివృద్ధికి కృషిచేసిన దోర్జీఖండు మరణవార్త ఆ రాష్ట్ర ప్రజల్లో విషాధం నింపింది.
వైఎస్ఆర్.. ఏపీ ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించిన నాయకుడు. సెప్టెంబర్ 2, 2009న ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. నల్లమల అటవీ ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో రాజశేఖరరెడ్డి తుదిశ్వాస వదిలారు. ఆయతతో పాటు వారి సిబ్బంది కూడా మరణించారు. దీంతో ఏపీ రాజకీయ స్వరూపమే మారిపోయింది. ఏపీ ప్రజలు విషాధంలో ఉండిపోయారు. రాజశేఖరరెడ్డి మరణం తర్వాత తెలుగు రాజకీయాల్లో కీలక మార్పులు వచ్చాయి.
మార్చి 3, 2002న లోక్ సభ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన జీఎంసీ. బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. సాధారణ స్థాయి నుంచి వచ్చి అత్యున్నత పదవిని అలంకరించిన ఆయన ప్రస్థానం అకస్మాత్తుగా నిలిచిపోయింది. ఆయన మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి మాధవ్ రావ్ సింథియా కూడా 2001 సెప్టెంబర్ 30న ప్రైవేటు విమానం ప్రయాణంలో సంభవించింది. ఎన్నికల ర్యాలీకి వెళ్తున్న సమయంలో జరిగింది. రాజకీయ మేధావిగా గుర్తింపు పొందిన మాధవ్ రావ్ సింథియా మరణం దేశరాజకీయాల్ని ప్రభావితం చేసింది.
డీఎంకే ఎంపీగా, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన ఎన్.వి.ఎన్ సోమూ 1997 నవంబర్ 14న అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన మరణం తమిళనాడులో తీవ్ర విషాధాన్ని మిగిల్చింది. డీఎంకే పార్టీకి మంచి నాయకుడిని కోల్పోయిన లోటు కనిపించింది.
పంజాబ్ గవర్నర్, హిమాచల్ ప్రదేశ్ అదనపు గవర్నర్ గా పనిచేసిన సురేంద్రనాథ్ 1994లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత 1973లో జరిగిన విమాన ప్రమాదంలో కాంగ్రెస్ నేత, కేంద్ర మంత్రి మోమన్ కుమార మంగళం మరణించారు. 1965లో పాకిస్థాన్- ఇండియా యుద్ధ సమయంలో గుజరాత్ రెండో ముఖ్యమంత్రి బాల్వంత్రాయ్ గోపాల్జీ మెహ్తా శత్రుదేశం విమానంపై జరిపిన దాడిలో తుదిశ్వాస వదిలారు. ఇలా ఎంతో మంది రాజకీయ నాయకులు విమాన, హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణిస్తూనే ఉన్నారు. కానీ ప్రమాదాలు ఆగడం లేదు. వాటి నివారణకు మార్గాలు అన్వేషించడం లేదు. విమాన ప్రమాదాలకు పరిష్కారం కనుగొనేంత వరకు ప్రమాదాలు ఆగవు. ఆర్తనాదాలు ఆగవు.
