'అజిత్ దాదా'కు కర్మభూమిగా బారామతి ఎలా అయ్యింది..!
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవార్.. బుధవారం ఉదయం తాను ప్రయాణిస్తున్న విమానం కూలిపోవడంతో మరణించారు.
By: Raja Ch | 28 Jan 2026 6:55 PM ISTమహారాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైన నేతల్లో అజిత్ పవార్ ఒకరు. ఆయన తన అనూహ్య నిర్ణయాలతో ఎన్నోసార్లు వార్తల్లో నిలిచారు.. మహా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఈ క్రమంలో నలుగురు ముఖ్యమంత్రుల వద్ద రాష్ట్రానికి ఆరుసార్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు.. కర్మభూమిగా నిలిచింది బారామతి! ఈ నియోజకవర్గంలోనే ఆయన రాజకీయ ప్రస్థానం మొదలవ్వగా.. అనూహ్యంగా అక్కడే ముగియడం గమనార్హం.
అవును... రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తొలిసారిగా 1991లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అజిత్ పవార్ ను తీర్చిదిద్దిన ప్రదేశం అయిన బారామతి.. యాదృచ్చికంగా ఆయనకు వీడ్కోలు పలికిన ప్రదేశంగా కూడా నిలిచింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవార్.. బుధవారం ఉదయం తాను ప్రయాణిస్తున్న విమానం కూలిపోవడంతో మరణించారు. స్థానిక ఎన్నికలకు ముందు నాలుగు కీలక సమావేశాలు నిర్వహించడానికి ఆయన బారామతికి వెళ్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది.
వాస్తవానికి 1985లో రాజకీయాల్లోకి ప్రవేశించిన అజిత్ పవార్ 1991లో బారామతి నియోజకవర్గం నుండి తొలిసారిగా గెలుపొందారు. అలా బారామతి వేదికగా మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం ఎన్నో సంచలనాలను సృష్టిస్తూ, దాటుకుంటూ ముందుకు కదిలింది. ఆ నియోజకవర్గం ఆయన పదే పదే నిలబెట్టుకుంది. ఎన్నో కీలక సమయాల్లో పార్టీ ఏదైనా, ప్రత్యర్థి మరెవరైనా ఆయనకు దన్నుగా నిలబడింది! రికార్డ్ స్థాయిలో ఎనిమిది సార్లు గెలిపించింది!
జూలై 22, 1959న జన్మించిన అజిత్ పవార్.. మహారాష్ట్ర ప్రజల కోసం అవిశ్రాంత కృషి చేశారని చెప్పొచ్చు. అందువల్లే.. మహా ప్రజలలో 'అజిత్ దాదా' అంటూ ఆయన ప్రేమగా పిలువబడ్డారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలక వ్యక్తిగా మారారు. ఈ క్రమంలో నలుగురు ముఖ్యమంత్రుల వద్ద ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. వీరిలో పృథ్విరాజ్ చౌహాన్, దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే, ఏక్ నాథ్ శిండే ఉన్నారు. కానీ.. ముఖ్యమంత్రి కావాలనే కోరిక తీరకుండానే వెళ్లిపోయారు!
బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పవార్ మొదట 1991 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. తరువాత.. 1995లో హస్తం గుర్తుపైనే పోటీ చేసి గెలిచిన ఆయన... 1999, 2004, 2009, 2014లలో 2019లలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నుంచి గెలిచారు. ఈ ఫ్లో కంటిన్యూ చేస్తూ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి.. బారామతి నుంచి వరుసగా ఎనిమిదో సారి రికార్డు విక్టరీని నమోదూ చేశారు. బారామతితో తనకున్న అనుబంధాన్ని చూపారు!
ఈ క్రమంలో... బారామతిని అటు పారిశ్రామికంగా, ఇటు వ్యవసాయం పరంగా అభివృద్ధికి ఒక నమూనాగా మార్చడంలో అజిత్ పవార్ ప్రసిద్ధి చెందారు. అతన్ని తీవ్రంగా విమర్శించేవారు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తారని అంటారు. ఈ నేపథ్యంలోనే.. ఆయన మరణవార్త అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. అజిత్ పవార్ ను బలమైన అట్టడుగు స్థాయి సంబంధాలతో కూడిన ప్రజల నాయకుడుగా గుర్తు చేసుకున్నారు.
