ఔను.. ఆ ఇద్దరూ ఒక్కటవుతున్నారు !
ఎన్సీపీ ఏకమవుతోంది. మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవార్ కుటుంబంలో మనస్పర్థలు సమసిపోయినట్టు తెలిపారు.
By: A.N.Kumar | 10 Jan 2026 1:00 AM ISTఎన్సీపీ ఏకమవుతోంది. మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవార్ కుటుంబంలో మనస్పర్థలు సమసిపోయినట్టు తెలిపారు. శరద్ పవార్, అజిత్ పవార్ మధ్య దూరం తగ్గుతోందని వ్యాఖ్యానించారు. పింప్రి చించ్వాన్ మున్సిపల్ ఎన్నికల కోసం రెండు వర్గాలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. రెండు వర్గాల కార్యకర్తలు పవార్ కుటుంబం ఏకం కావాలని కోరుకుంటున్నట్టు అజిత్ పవార్ స్పష్టం చేశారు. దీంతో చీలిన ఎన్సీపీ మళ్లీ ఒక్కటయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
ఎన్సీపీ-శివసేన కథ ఒకటే
ఎన్సీపీ చీలిక వెనుక బీజేపీ ఉందన్న ప్రచారం ఉంది. శివసేనలాగే ఎన్సీపీని కూడా బీజేపీ చీల్చిందని ఎన్సీపీ శరద్ పవార్ వర్గం ఆరోపించింది. మహారాష్ట్రలో సొంతంగా బలపడాలన్న ఉద్దేశంతో ప్రాంతీయ పార్టీలను బీజేపీ బలహీనపరుస్తోందన్న వాదన ఉంది. శివసేన, ఎన్సీపీ రెండూ మహారాష్ట్రలో బలంగా ఉన్నాయి. ఈ రెండింటినీ చీల్చి బలహీనపరిస్తే తప్పా.. బలపడలేమని బీజేపీ వ్యూహం పన్నింది. అందులో భాగంగానే మొదట శివసేనను చీల్చింది. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే.. ఆయన కొడుకు ఉద్ధవ్ థాకరే. ఉద్దవ్ థాకరే నుంచి ఆ పార్టీ లీడర్ ఏక్ నాథ్ శిండేను చీల్చి సొంత కుంపటి పెట్టించింది. మెజార్టీ ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ శిండే వైపు రావడంలో బీజేపీ పాత్ర ఉంది. శివసేన అధికారికంగా ఏక్ నాథ్ శిండేకు దక్కడంలోనూ బీజేపీ పాత్ర ఉందన్నది విశ్లేషకుల అభిప్రాయం. బీజేపీ వ్యూహంతో శివసేన రెండు ముక్కలై .. బాల్ థాకరే కొడుకు ఉద్దవ్ కు తన సొంత పార్టీ తనకు కాకుండా పోయింది. దీంతో ఉద్దవ్ శివసేన యూబీటీగా పేరు పెట్టుకున్నారు. గతంలోనే శివసేన నుంచి విడిపోయి ఎంఎన్ఎస్ స్థాపించిన రాజ్ థాకరే తో కలిసి ఎన్నికలకు వెళ్తున్నారు.
భావజాల వైరుద్యం
ఎన్సీపీ చీలికకు భావజాల వైరుద్యమే కారణమన్న ప్రచారం బీజేపీ చేయించింది. శరద్ పవార్.. కాంగ్రెస్, శివసేన యూబీటీతో కలిసి వెళ్లాలనుకున్నారు. కానీ అజిత్ పవార్ బీజేపీ, ఏకనాత్ శిండే శివసేనతో కలిసి వెళ్లాలని పట్టుబట్టారు. దీనికి శరద్ పవార్ ఒప్పుకోలేదు. దీంతో అజిత్ పవార్ వేరు కుంపటి పెట్టుకున్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అయ్యారు. అజిత్ పవార్ కు పదవుల ఆశ చూపి బీజేపీ చీల్చిందని శరద్ పవార్ వర్గం ఆరోపించింది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటే తమ పప్పు ఉడకదని బీజేపీ.. శివసేన, ఎన్సీపీని చీల్చిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కలయికతో కొత్త సమీకరణాలు
ఎన్సీపీ కలయిక కొత్త సమీకరణాలకు దారితీస్తుంది. ఎన్సీపీ నిర్ణయాల్లో మార్పు ఉండవచ్చన్న వాదన ఉంది. ఎందుకంటే రెండు వర్గాలు కలిసినప్పుడు ఇద్దరికీ ఆమోదయోగ్య నిర్ణయాలు ఉండాలి. అప్పుడే ఏకీకరణ కొనసాగుతుంది. లేదంటే మళ్లీ చీలిక తప్పదు. శరద్ పవార్ బీజేపీతో కలిసి వెళ్లడంపై అజిత్ వాదనతో ఏకీభవిస్తారా? . లేదా అజిత్ పవార్ బీజేపీ నుంచి బయటికి వస్తారా ? అన్న చర్చ కూడా ఉంది. పవార్ కుటుంబం ఒక్కటైతే రాజకీయంగా మహారాష్ట్రలో మార్పులు తప్పవంటున్నారు విశ్లేషకులు.
