Begin typing your search above and press return to search.

అజిత్ పవార్ ఎన్సీపీ సారధ్యం ఎవరికి ?

దాదాపుగా నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన అజిత్ పవార్ ఉన్నట్టుండి తెర మరుగు అయ్యారు. ఇది అనూహ్య మరణం.

By:  Satya P   |   29 Jan 2026 8:00 AM IST
అజిత్ పవార్ ఎన్సీపీ సారధ్యం ఎవరికి ?
X

దాదాపుగా నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన అజిత్ పవార్ ఉన్నట్టుండి తెర మరుగు అయ్యారు. ఇది అనూహ్య మరణం. అనుకోని విధంగా మృత్యువు కాటేసిన విషాదం. ఆయన వయసు ఆరున్నర పదులు. అయితే రాజకీయంగా ఆయన ఇంకా చాలా కాలం పని చేయాల్సిన వారుగా ఉన్నారు. దాంతో వారసత్వం సమస్య కానీ బాధ్యత అప్పగింత కానీ ఎపుడూ చర్చకు వచ్చి ఉండకపోవచ్చు. దాని కంటే ముందు చెపుకోవాలీ అంటే మూడేళ్ల ముందు తన బాబాయ్ శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీలో ముఖ్య నేతగా అజిత్ పవార్ నంబర్ టూగా ఉండేవారు. ఎపుడైతే శరద్ ఎన్సీపీని చీల్చి అజిత్ ఎన్సీపీగా మార్చారో దానిని పటిష్టం చేసుకుని తిరుగులేని ప్రాంతీయ పార్టీగా నేతగా ఎదిగారో నాటి నుంచే అజిత్ పవార్ పార్టీకి సర్వ సత్తాక నేతగా ఎదిగారు.

భార్యకు ప్రాముఖ్యం :

అయితే అజిత్ పవార్ వెంట ఎంతో మంది ఎన్సీపీ నేతలు మొదటి నుంచి ఆ పార్టీకి అండగా ఉన్న వారు కలిసి వచ్చి భారీ చీలిక సాధ్యపడింది. వారి అండదండలు ఒక వైపు ఉండగానే అజిత్ పవార్ తన కుటుంబానికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు అన్నది తెలుస్తోంది. ఆయన సతీమణి సునేత్రా పవార్ ని 2024 ఎన్నికలో బారామతి నుంచి లోక్ సభకు అజిత్ పవార్ పార్టీ తరఫున పోటీ చేయించారు. అయితే శరద్ పవార్ ఎన్సీపీ తరఫున శరద్ పవార్ కుమార్తె అజిత్ పవార్ చెల్లెలు సుప్రియా సూలే పోటీ చేసి బంపర్ విక్టరీని సాధించారు. ఆ ఎన్నికల్లో ఆమె సునేత్రా పవార్ ని ఓడించారు. అయితే సునేత్రా పవార్ రాజ్యసభ సభ్యురాలిగా ఉంటున్నారు. దాంతో ఆమె పట్ల అజిత్ పవార్ విశ్వాసం ఉంచారు అన్నది అర్ధం అవుతోంది. ఇక ఆమె పార్టీ సారధ్యం వహించడం ద్వారా అజిత్ ఎన్సీపీని ముందుకు తీసుకుని వెళ్ళవచ్చు అని అంటున్నారు. భర్త అకాల మరణం ఆమెకు సానుభూతిగా కలసివచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు.

కుమారుడు సైతం :

ఇక అజిత్ పవార్ పెద్ద కుమారుడు పార్ధుని కూడా రాజకీయాలోకి తీసుకుని వచ్చారు. 2019 ఎన్నికల్లో ఆయనను లోక్ సభకు పోటీ చేయించారు. అయితే ఓటమి పాలు అయిన పార్ధు రాజకీయాల వైపు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఎపుడైతే తండ్రి అజిత్ పవార్ ఎన్సీపీని చీల్చి సొంత కుంపటి పెట్టుకున్నారో నాటి నుంచి పార్ధు మళ్ళీ యాక్టివ్ అయ్యారు. దాంతో ఆయనకు పార్టీ సారథ్య బాధ్యతలు దక్కవచ్చు అన్న చర్చ కూడా ఉంది. అజిత్ పవార్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న బారామతి నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి పార్ధు తన రాజకీయ ప్రయాణాన్ని కొత్తగా మొదలెట్టే చాన్స్ ఉందని అంటున్నారు.

సీనియర్లు లైన్ లో :

ఇక అజిత్ ఎన్సీపీకి అండగా ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నారు. వారిలో ప్రఫుల్ పటేల్ ముందు వరుసలో ఉన్నారు. ఆయనకు ఢిల్లీ స్థాయిలో సైతం మంచి పరిచయాలు ఉన్నాయి. పాలనానుభవం ఉంది. పార్టీని ఒడ్డున పడేసే ట్రబుల్ షూటర్ గా పేరు ఉంది. ఇక ఆయన తరువాత వినిపిస్తున్న రెండవ పేరు సునీల్ తట్కరే. ఈయనకు అజిత్ ఎన్సీపీ క్యాడర్ లో మంచి పేరు ఉంది. గ్రౌండ్ లెవెల్ లో పట్టున్న లీడర్ గా చెబుతారు. ఎన్సీపీ పార్టీని విజయవంతంగా ముందుకు తీసుకుని వెళ్తారు అని పేరు ఉంది. అలాగే సీనియర్ లీడర్ గా ఓబీసీ నేతగా ఛగన్ భుజబల్ పేరు కూడా బయటకు వస్తోంది. కానీ ఆయన ఏజ్ ఇపుడు ఇబ్బందిగా ఉంది. దాంతో ఆయన బాధ్యతలు తీసుకునే అవకాశాలు తక్కువ అని అంటున్నారు. పార్టీకి ఆయన గైడెన్స్ అయితే ఇస్తారు అని అంటున్నారు. ఇక అజిత్ పవార్ కి ఎంతో సాన్నిహిత్యం ఉన్న నాయకుడిగా ధనుంజయ్ ముండే పేరుని చెబుతారు. ఆయనకు పార్టీలో జనంలో యూత్ లో మంచి పేరు ఉంది. దాంతో ఆయనకు బాధ్యతలు అప్పగిస్తారు అన్న ప్రచారం కూడా ఉంది.

విలీనమే మార్గమా :

అయితే అజిత్ పవార్ లేని చీలిక ఎన్సీపీని నడిపించడం బహు కష్టం అన్న భావన కూడా ఉంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తన బాబాయ్ తో కలసి అజిత్ పోటీ చేశారు. ఆయన బతికి ఉంటే తిరిగి ఎన్సీపీ అంతా ఒక్కటిగా ఉండేదన్న మాట ఉంది. ఇపుడు ఆయన లేకపోవడంతో సొంతంగా పార్టీని నడిపే కంటే శరద్ పవార్ సారధ్యంలోని ఎన్సీపీతో విలీనం చేస్తారు అన్న ప్రచారం కూడా ఉంది. తద్వారా కుటుంబం అంతా ఒక్కటి అవుతుందని మళ్ళీ ఎన్సీపీ బలంగా మహారాష్ట్ర రాజకీయాల్లో మారుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.