Begin typing your search above and press return to search.

అజిత్ మరణం.. మహా రాజకీయాలో తెరపైకి మూడు అతి పెద్ద ప్రశ్నలు!

సుమారు 40 ఏళ్లుగా మహారాష్ట్ర రాజకీయాల్లో ఉన్న అజిత్ పవార్ లేకుండా ఆ రాష్ట్ర రాజకీయా దృశ్యాన్ని ఊహించడం కష్టమే చర్చ తాజాగా ఆయన అకాల మరణంతో తెరపైకి వచ్చింది.

By:  Raja Ch   |   28 Jan 2026 7:20 PM IST
అజిత్ మరణం.. మహా రాజకీయాలో తెరపైకి మూడు అతి పెద్ద ప్రశ్నలు!
X

సుమారు 40 ఏళ్లుగా మహారాష్ట్ర రాజకీయాల్లో ఉన్న అజిత్ పవార్ లేకుండా ఆ రాష్ట్ర రాజకీయా దృశ్యాన్ని ఊహించడం కష్టమే చర్చ తాజాగా ఆయన అకాల మరణంతో తెరపైకి వచ్చింది. మహారాష్ట్రలో ఎక్కువకాలం ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అజిత్ పవార్.. ఆ రాష్ట్ర ప్రత్యామ్నాయ శక్తి కేంద్రాలలో ఒకటిగా నిలిచారనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం ఉండదు! ఈ క్రమంలో తాజాగా పలు కీలక ప్రశ్నలు.. ప్రధానంగా మూడు పెద్ద ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

అవును... బుధవారం బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాలను, ముఖ్యంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లోని రెండు వర్గాలను అనిశ్చితి దశలోకి నెట్టివేసిందనే చర్చ ఈ సందర్భంగా తెరపైకి వచ్చింది. పైగా... రాజ్యసభ పదవీకాలం ముగిసిన తర్వాత పదవీ విరమణ చేయాలనే నిర్ణయాన్ని ప్రకటించిన శరద్ పవార్ లేకుండా... ఎన్సీపీ లోని రెండు ముఖాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చర్చనీయాంశంగా మారింది.

మహారాష్ట్రలో బీజేపీ, ఏక్ నాథ్ శిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీల మహాయతి కూటమి అధికారంలో ఉంది. ఈ సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వంలో 41 మంది ఎమ్మెల్యేలతో ఎన్సీపీ కీలక భూమిక పోషిస్తోంది. ఈ నేపథ్యంలోనే దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో అజిత్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ క్రమంలో.. ఆయన మరణానంతర పరిణామాల్లో ఎవరు ఎటు వైపు ఉంటారనేది ఆసక్తిగా మారిందని అంటున్నారు.

ఈ క్రమంలో.. ఎన్సీపీ నుండి ఉప ముఖ్యమంత్రి ఎవరు అవుతారు..? అనేది ఇప్పుడు ఓ కీలక ప్రశ్నగా ఉంది. ఇదే సమయంలో... రెండు ఎన్సీపీ వర్గాలు [ఎన్సీపీ, ఎన్సీపీ (ఎస్పీ)] విలీనం అవుతాయా..? అనే ప్రశ్నా తెరపైకి వస్తోంది. ఇదే సమయంలో... అజిత్ పవార్ ఎన్సీపీలోని ఎమ్మెల్యేలంతా కలిసే ఉంటారా..? అనే చర్చా తెరపైకి మరి ముఖ్యంగా వస్తోంది. ఇప్పుడు ఈ కీలక ప్రశ్నలే అజిత్ మరణానంతరం మహా రాజకీయాల్లో ప్రధానంగా వినిపిస్తున్నాయి.

వాస్తవానికి 2019లోనే అజిత్ పవార్ బీజేపీలోకి ఫిరాయించారు. ఈ క్రమంలో వెంటనే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం.. శరద్ పవార్ పిలుపుతో తిరిగి ఎన్సీపీలో చేరిన ఆయన... నాలుగేళ్ల తర్వాత 2023లో శరద్ పవార్ స్థాపించిన ఎన్సీపీని చీల్చి.. బీజేపీ - శివసేన మహాయతి కూటమిలో చేరిపోయారు. దీంతో... శరద్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ (ఎస్పీ) చిన్నగా మిగిలిపోయింది! ఆ పార్టీకి ఇప్పుడు శరద్ కుమార్తె సుప్రీయా సూలే నాయకురాలిగా ఉన్నారు!

ఈ సమయంలో... ఎన్సీపీలోని ఎమ్మెల్యేలు, నేతలు ఎన్సీపీ (ఎస్పీ) వైపు చూసే అవకాశాలు ఉన్నాయా.. ప్రధానంగా ఎన్సీపీకి ఉప ముఖ్యమంత్రి పదవి రానుందని చెబుతోన్న నేపథ్యంలో వారిలో ఐకమత్యం ఈ సందర్భంగా ప్రశ్నార్థకం కాబోతుందని అంటున్నారు. ఏది ఏమైనా... పవార్ కుటుంబానికి జరిగిన ఈ భారీ వ్యక్తిగత నష్టం.. అటు ఎన్సీపీ, ఇటు మహారాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనేది ఆసక్తిగా మారింది.

కాగా... అజిత్ పవార్ కు ఇద్దరు కుమారులు పార్థ్, జే పవార్ ఉన్నారు. ఈ క్రమంలో.. పార్థ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి మహారాష్ట్రలోని మావల్ నియోజకవర్గం నుండి లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ, ఆయన భారీ తేడాతో ఓడిపోయారు. మరోవైపు.. జే రాజకీయాలకు దూరంగా ఉంటూ, తక్కువ ప్రజా గుర్తింపును కలిగి ఉన్నారు.