ప్రియ శిష్యుడిని పోలీస్ కేసులో ఇరికించిన ఆర్జీవీ!
ఆర్జీవీ చేసిన ఆ ట్వీట్‌ను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి ఏకంగా నెల రోజుల పాటు అజయ్ భూపతి ఆఫీస్ చుట్టూ తిరిగారట.
By: Sivaji Kontham | 31 July 2026 7:13 PM ISTటాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. తన గురువైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) వద్ద శిష్యరికం చేసిన రోజుల్లోనూ...స్వతంత్ర దర్శకుడిగా మారిన తర్వాత ఆయనకు ఎదురైన అనేక ఆసక్తికర విషయాలను ఆయన నిరంతరం మీడియాతో సంభాషిస్తూనే ఉంటారు. తాజా ఇంటర్వ్యూలో కొన్ని ఛమక్కుల్ని వెల్లడించారు. తాజాగా ఆర్జీవీ చేసిన ఒక వివాదాస్పద ట్వీట్ వల్ల తనకు ఎదురైన ఒక విచిత్రమైన, హాస్యభరితమైన అనుభవంతో పాటు తన మొదటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం RX 100 సమయంలో తాను ఎదుర్కొన్న భావోద్వేగ పరిస్థితులను వెల్లడించారు.
ఒకసారి ఆర్జీవీ ప్రశాంతంగా కూర్చుని సినిమా చూస్తూ... ఒక బైక్‌పై ముగ్గురు ప్రయాణించే అంశంపై నేరుగా సిటీ ట్రాఫిక్ కమిషనర్‌నే ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. సినిమా చూసి బయటకు వచ్చిన అజయ్ భూపతి బృందానికి ఆర్జీవీ చేసిన ఈ పని చూసి షాక్ తిన్నారు. ఆర్జీవీ చేసిన ఆ ట్వీట్‌ను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి ఏకంగా నెల రోజుల పాటు అజయ్ భూపతి ఆఫీస్ చుట్టూ తిరిగారట. మొదట ట్వీట్ వేసిన ఆయన్ని తీసుకురండి.. అప్పుడే నేను వస్తాను! అని అజయ్ భీష్మించినా... రోజులు తరబడి తిరుగుతున్న కానిస్టేబుళ్ల బాధ చూడలేక చివరికి పోలీసు స్టేషన్‌కు కౌన్సెలింగ్ కోసం వెళ్లక తప్పలేదు.
స్టేషన్‌కు వెళ్లిన అజయ్ భూపతికి అక్కడ మరొక ఆశ్చర్యకరమైన ఘట్టం ఎదురైంది. అక్కడ ఉన్న ఎస్సై గారు వీళ్లకు కౌన్సెలింగ్ ఇవ్వడం పక్కన పెట్టి... ఆర్జీవీ సినిమాలోని `పిల్లలారా` పాట గురించి ఎంతో భావోద్వేగంగా మాట్లాడారు. ఆ పాట తనను ఎంతగానో ఆకట్టుకుందని ఎస్సై గారు గుర్తుచేసుకున్నారు. ''ఆయన మా బాస్, ఆయనతో పెట్టుకోకూడదు... ఊరికే గిల్లేసి వదిలేస్తుంటాడు'' అంటూ తన గురువు ఆర్జీవీ చేసే చిలిపి పనులను అజయ్ భూపతి ఎంతో ఆత్మీయంగా.. సరదాగా కొనియాడారు.
ఇదిలా ఉంటే.. తన కెరీర్‌ను మలుపు తిప్పిన RX 100 ప్రాజెక్ట్ సమయంలో అజయ్ భూపతి ఎదుర్కొన్న కుటుంబ పరిస్థితులు.. అతడు ప్రదర్శించిన ధైర్యం ఎంతో మందికి ప్రేరణనిస్తాయి. RX 100 కథ ఓకే అయిన సమయానికి ఆయన తండ్రి వైద్య చికిత్స అత్యంత ప్రాధాన్యతగా మారింది. దాంతో సినిమా నిర్మాతల వద్దకు వెళ్లి ''నాకు ఎలాంటి రెమ్యూనరేషన్ వద్దు... మా నాన్నగారి హాస్పిటల్ ట్రీట్‌మెంట్‌కి కావలసిన డబ్బులు ఇస్తే చాలు'' అని స్పష్టం చేశారు. స్వయంకృషితో ఎదగాలనుకున్న అతడు తన దర్శకత్వ ప్రతిభ, మేకింగ్‌పై ఉన్న నమ్మకంతో కుటుంబ బాధ్యతకే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు.
అయితే తన ప్రతిభపైన.. సినిమా విజయంపైనా అపారమైన నమ్మకంతో ఉన్న అజయ్ భూపతి.. రీమేక్ రైట్స్ విషయంలో మాత్రం ముందే ఒక స్పష్టమైన డీల్ కుదుర్చుకున్నారు. రీమేక్ రైట్స్‌లో వచ్చే ఆదాయంలో 50 శాతం నిర్మాతకు.. 50శాతం నాకు ఉండాలి! అని ఒప్పందం చేసుకున్నారు. అనుకున్నట్లే RX 100 చిత్రం సంచలన విజయం సాధించి... బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఆర్జీవీ శిష్యుడిగా పొందిన అనుభవం.. తండ్రిపై ఉన్న ప్రేమ... సినిమాపై ఉన్న నమ్మకమే అజయ్ భూపతిని ఈ రోజు ఇండస్ట్రీలో ఒక విజయవంతమైన దర్శకుడిగా నిలబెట్టాయని చెప్పవచ్చు. అజయ్ భూపతి తెరకెక్కించిన శ్రీనివాస మంగాపురం ఇటీవలే థియేటర్లలోకి విడుదలైన సంగతి తెలిసిందే. జయకృష్ణ- రాషా తడానీ జంటగా పరిచయమయ్యారు.
