టెలికం రంగంలో ‘చైనా’కు చెక్.. పాత నెట్‌వర్క్‌లపైనా కేంద్రం ఫోకస్?
భద్రతా కారణాలతో దేశంలోని టెలికం రంగంలో చైనా కంపెనీల ప్రాధాన్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేయనున్నట్లు తెలుస్తోంది.
By: A.N.Kumar | 31 Aug 2026 9:00 PM ISTభద్రతా కారణాలతో దేశంలోని టెలికం రంగంలో చైనా కంపెనీల ప్రాధాన్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 5జీ నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో చైనా సంస్థలైన హువావే, జెడ్ .టీఈలకు దూరంగా ఉన్న భారత్.. ఇప్పుడు పాత తరాల నెట్‌వర్క్‌ల విషయంలోనూ ఇదే విధానాన్ని అమలు చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం దేశంలోని పలు టెలికం సంస్థలు 2జీ, 3జీ, 4జీ నెట్‌వర్క్‌లతో పాటు ఆప్టికల్ ఫైబర్ వంటి మౌలిక సదుపాయాల్లో హువావే, జెడ్.టీఈ వంటి సంస్థల పరికరాలు, సాంకేతికతపై ఆధారపడి ఉన్నాయి. ఈ నెట్‌వర్క్‌లను ఒక్కసారిగా మార్చడం అంత సులభం కాదు. భారీగా ఖర్చు చేయడంతో పాటు, పరికరాల మార్పు సమయంలో సేవలకు అంతరాయం కలగకుండా చూడటం కూడా టెలికం కంపెనీలకు పెద్ద సవాలుగా మారనుంది.
భద్రతే ప్రధాన కారణం
చైనా టెలికం పరికరాల విషయంలో భారత్ చాలాకాలంగా భద్రతాపరమైన ఆందోళనలను వ్యక్తం చేస్తోంది. కీలకమైన కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాల్లో విదేశీ సంస్థల పరికరాల వినియోగం వల్ల డేటా భద్రత, నెట్‌వర్క్ నియంత్రణ వంటి అంశాల్లో ప్రమాదాలు తలెత్తవచ్చన్న అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలోనే 5జీ విస్తరణలో హువావే, జెడ్.టీఈలకు భారత్ అవకాశం ఇవ్వలేదు.
ఇప్పుడు ఇదే విధానాన్ని ఇప్పటికే అమల్లో ఉన్న 2జీ, 3జీ, 4జీ నెట్‌వర్క్‌లకు కూడా విస్తరించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, కాలపరిమితి, టెలికం సంస్థలపై పడే ఆర్థిక భారం వంటి అంశాలపై ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం.
ఎయిర్‌టెల్, వీఐపై భారీ భారం?
చైనా కంపెనీల పరికరాలను పాత నెట్‌వర్క్‌ల నుంచి తొలగించాల్సి వస్తే ప్రధానంగా భారతి ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా వంటి సంస్థలపై ఆర్థిక ప్రభావం పడే అవకాశం ఉంది. అంచనాల ప్రకారం ఈ రెండు కంపెనీలకు కలిపి సుమారు 3 బిలియన్ డాలర్ల వరకు అదనపు భారం పడొచ్చని తెలుస్తోంది. పాత పరికరాలను తొలగించి కొత్త సంస్థల నుంచి నెట్‌వర్క్ పరికరాలను కొనుగోలు చేయడం, ఇన్‌స్టాలేషన్, టెస్టింగ్, నిర్వహణ తదితర ప్రక్రియలకు భారీగా ఖర్చవుతుంది. ఇప్పటికే ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న టెలికం రంగానికి ఇది మరో సవాలుగా మారవచ్చు.
అయితే కేంద్రం తుది నిర్ణయం తీసుకునే ముందు టెలికం కంపెనీలపై పడే భారాన్ని, ప్రత్యామ్నాయ పరికరాల లభ్యతను, నెట్‌వర్క్ అప్‌గ్రేడ్‌కు పట్టే సమయాన్ని సమగ్రంగా పరిశీలించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. భారత టెలికం రంగంలో చైనా సాంకేతికతపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించే మరో కీలక చర్యగా ఇది నిలిచే అవకాశం ఉంది.
