Begin typing your search above and press return to search.

ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లలో ఉచిత సేవల వెనక నిజం ఇదే!

ఈ విషయాన్ని తాజాగా ఒక ఎక్స్‌ యూజర్‌ సూరజ్‌ కుమార్‌ తల్రేజా అనే వ్యక్తి చాలా చక్కగా వివరించారు.

By:  A.N.Kumar   |   1 Aug 2025 2:00 AM IST
ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లలో ఉచిత సేవల వెనక నిజం ఇదే!
X

ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ అనేది విమాన ప్రయాణికులకు అందే ప్రత్యేకమైన సదుపాయం. ప్రయాణానికి ముందు ఎయిర్‌పోర్ట్‌లో వేచి ఉండాల్సిన సమయం సేదతీరేందుకు ఇది అద్భుతమైన స్థలం. వైఫై, బఫే భోజనం, కూల్ డ్రింక్స్‌, ఎయిర్‌కండిషన్డ్‌ వాతావరణం, రిక్లైనర్‌ సీట్లు, న్యూస్ పేపర్స్‌, ఛార్జింగ్‌ పాయింట్స్‌, కొన్ని లాంజ్‌లలో స్లీపింగ్‌ పాడ్స్‌, స్పా వంటి వసతులు కూడా లభిస్తాయి. ఇవన్నీ చాలామందికి “ఫ్రీగా” లభిస్తాయనే భావన ఉంది. కానీ నిజానికి అవి ఉచితం కావు. మనం తెలుసుకోని విధంగా వాటికి ఖర్చు అవుతుంది. అది మేము నేరుగా చెల్లించకపోయినా!

-ఫ్రీ లాంజ్‌ యాక్సెస్‌ వెనుక అసలు లాజిక్‌

ఈ విషయాన్ని తాజాగా ఒక ఎక్స్‌ యూజర్‌ సూరజ్‌ కుమార్‌ తల్రేజా అనే వ్యక్తి చాలా చక్కగా వివరించారు. స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంకులో డేటా అనలిస్టుగా పనిచేసిన ఆయన, లాంజ్‌ యాక్సెస్‌ వెనుక ఉన్న వ్యాపార విధానాన్ని వివరించారు.

-ఎవరు చెల్లిస్తున్నారు?

మనకు లభించే ఈ ఫ్రీ లాంజ్‌ యాక్సెస్‌ సదుపాయం వాస్తవంగా క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డులు జారీ చేసిన బ్యాంకులు లేదా కార్డు నెట్‌వర్క్‌లు (వీసా, మాస్టర్‌కార్డ్‌, రూపే వంటి సంస్థలు) చెల్లిస్తాయి. ఇది క్రెడిట్‌ కార్డు ప్రయోజనాల్లో ఒక భాగంగా ఉంటుంది. బ్యాంకులు తమ కస్టమర్లకు ప్రీమియం అనుభూతిని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సదుపాయాన్ని అందిస్తాయి.

-ఒక్కో లాంజ్‌కి ఎంత ఖర్చవుతుంది?

భారతదేశంలో డొమెస్టిక్‌ లాంజ్‌లలో ఒక్క వ్యక్తి సందర్శనకు సగటున రూ.600 నుంచి రూ.1200 వరకు ఖర్చవుతుంది. అంతర్జాతీయ లాంజ్‌ల విషయానికి వస్తే, ఒక్క విజిట్‌కి 25–35 అమెరికన్‌ డాలర్ల వరకు బ్యాంకులు చెల్లిస్తాయి. అంటే మనం కూర్చుని కాఫీ తాగినప్పటికీ, శాండ్‌విచ్‌ తిన్నప్పటికీ ఆ ఖర్చును ఎవరో భరిస్తున్నారు. అది మన బ్యాంకే!

-బ్యాంకుల వ్యాపార లాజిక్‌ ఏంటి?

కస్టమర్లను ఆకర్షించేందుకు, వాళ్లను తమ కార్డులపైనే నమ్మేలా చేసేందుకు బ్యాంకులు ఇలా చేయడం వ్యూహాత్మకం. మీరు ఏదైనా బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు వినియోగించేటప్పుడు “లాంజ్‌ యాక్సెస్‌ ఫ్రీ” అన్న మాట చూసి ఆకర్షితులవుతారు. మరిన్ని లావాదేవీలు చేయాలనే ఉత్సాహం పెరుగుతుంది.

అంతేకాదు, మీరు అధికంగా ఖర్చు చేస్తే, మీ కార్డ్‌పై బ్యాంక్‌కి మర్చంట్‌ ఫీజుల రూపంలో ఆదాయం వస్తుంది. అలాగే, ఎక్కువ ప్రయాణాలు చేసే వారు పేమెంట్‌ కార్డుల్ని ప్రీమియం కార్డులకు అప్‌గ్రేడ్‌ చేయడం ద్వారా వార్షిక ఫీజుల రూపంలో బ్యాంకులకు మరింత ఆదాయం వస్తుంది.

-ఉచితం కాదని గుర్తించండి

సూరజ్‌ కుమార్‌ తల్రేజా స్పష్టం చేయగా ఇది నిజంగా ఫ్రీ సేవ కాదు. మీరు ఏదో ఒక విధంగా మీ వార్షిక ఫీజు ద్వారా లేదా మీ అధిక ఖర్చుల ద్వారా ముందే ఈ ఖర్చు చెల్లించేస్తున్నారు. లాంజ్‌ యాక్సెస్‌ ఒక “ఇన్వెస్ట్‌మెంట్‌ ఫర్‌ లాయల్టీ” అనే విధంగా బ్యాంకులు చూస్తున్నాయి.

ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లలో “ఫ్రీ ఫుడ్‌, ఫ్రీ వైఫై” అనిపించినా వాటికి ఖర్చు అవుతుంది. వాటి వెనుక ఉన్న వ్యాపార లాజిక్‌ను అర్థం చేసుకోవాలి. క్రెడిట్‌ కార్డుల కంపెనీలు మన వినియోగాన్ని పెంచించేందుకు, తమ కార్డులపైనే మన విశ్వాసాన్ని పెంచేందుకు ఈ విధంగా వ్యూహాత్మకంగా పని చేస్తాయి.