Begin typing your search above and press return to search.

ఎయిరిండియాకు ఏమి అవుతుంది.. ఇన్ని ప్రోబ్లమ్సా?

గత కొంతకాలంగా ఎయిరిండియా విమానయానానికి సంబంధించిన ఘటనలు మీడియాలో హెడ్ లైన్స్ గా మారుతున్న సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   11 Aug 2025 10:19 AM IST
ఎయిరిండియాకు ఏమి అవుతుంది..  ఇన్ని ప్రోబ్లమ్సా?
X

గత కొంతకాలంగా ఎయిరిండియా విమానయానానికి సంబంధించిన ఘటనలు మీడియాలో హెడ్ లైన్స్ గా మారుతున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లో జరిగిన ఘోర ప్రమాదం మొదలు వరుసగా ఎయిరిండియా వార్తల్లో నిలుస్తుంది! సాంకేతిక లోపాలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ లు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వరుస ఘటనలు. ఈ నేపథ్యంలో తాజాగా మరో కీలక ఘటన తెరపైకి వచ్చింది.

అవును... ఎయిరిండియా విమానాలకు సంబంధించిన ఓ షాకింగ్ ఘటన మరోసారి తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి ఆదివారం రాత్రి ఢిల్లీ బయల్దేరిన ఎయిరిండియా ఏఐ-2455 విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో.. వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని చెన్నై మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు.

ఆ విమానంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ సహా పలువురు ఎంపీలు, ఇతర ప్రయాణికులు ఉన్నారు. దీనిపై కేసీ వేణుగోపాల్‌ 'ఎక్స్‌' వేదికగా స్పందించారు. తమకు భయానక అనుభవం ఎదురైందని, ప్రమాదం అంచుల వరకు వెళ్లొచ్చామని అన్నారు. అందుకు కారణం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో మరో విమానం కూడా అదే రన్‌ వేపైకి రావడం.

ఈ సందర్భంగా... ఎయిరిండియా విమానంలో తనతో పాటు మరికొంతమంది ఎంపీలు, వందల మంది ప్రయాణికులు భయానక ప్రమాదం అంచుల వరకు వెళ్లొచ్చామని.. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే విమానంలో కుదుపుల కారణంగా అలజడి మొదలైందని.. గంట తర్వాత కెప్టెన్‌ సిగ్నల్‌ వ్యవస్థలో లోపం కారణంగా విమానాన్ని చెన్నై మళ్లిస్తున్నట్లు ఓ ప్రకటన చేశారని చెప్పారు.

ఆ సమయంలో ల్యాండింగ్‌ కు అనుమతి రాకపోవడంతో సుమారు రెండు గంటల పాటు విమానాశ్రయం చుట్టూనే తామున్న విమానం గింగిరాలు తిరిగిందని.. ఆ తర్వాత ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) అనుమతితో రన్‌ వేపై దిగేందుకు ప్రయత్నిస్తుండగా సరిగ్గా అదే సమయంలో మరో విమానం అక్కడే కన్పించిందని అన్నారు.

అది గమనించిన కెప్టెన్‌ వెంటనే ల్యాండింగ్‌ ను నిలువరించి తమ అందరి ప్రాణాలను కాపాడారని.. ఆ తర్వాత జరిగిన రెండో ప్రయత్నంలో విమానం సురక్షితంగా కిందకు దిగిందని.. తమ అదృష్టం, పైలట్ల చాకచక్యంతో తామంతా బతికిపోయామని కేసీ వేణుగోపాల్ తన పోస్ట్‌ లో రాసుకొచ్చారు.

మరోవైపు ఈ ఘటనపై ఎయిరిండియా స్పందించింది. ఇందులో భాగంగా... విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, ప్రయాణికులందరు తమ గమ్యస్థానాలకు చేరేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని వెల్లడించింది. ఇదే సమయంలో.. జరిగిన అసౌకర్యానికి క్షమించాలని కోరింది. కాగా.. ఆదివారం రాత్రి 8 గంటలకు కేరళ నుంచి బయల్దేరిన ఈ విమానం రాత్రి 10:35 గంటలకు చెన్నైలో దిగింది.