రతన్ టాటా ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది
అహ్మదాబాద్‌లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా AI171 విమాన ప్రమాదం దేశ చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనలలో ఒకటిగా నిలిచింది.
By: A.N.Kumar | 11 Aug 2025 6:17 PM ISTఅహ్మదాబాద్‌లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా AI171 విమాన ప్రమాదం దేశ చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనలలో ఒకటిగా నిలిచింది. సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్లాల్సిన ఈ విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే కుప్పకూలి, 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, కింద ఉన్న మరో 19 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాద బాధిత కుటుంబాలకు పరిహారం అందడంలో జాప్యం జరుగుతోందని, దీనిపై అమెరికా న్యాయవాది మైక్ ఆండ్రూస్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ, "రతన్ టాటా ఈరోజు జీవించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆయన నైతిక విలువలు, ఉద్యోగుల పట్ల చూపే శ్రద్ధ, బాధితుల పట్ల కనబరిచే దయ.. ఇవి అందరికీ తెలుసు. బాధిత కుటుంబాలు ఇంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండేది కాదు" అని అన్నారు.
ఆండ్రూస్ ప్రస్తుతం ప్రమాదంలో మరణించిన 65 కుటుంబాల తరఫున పరిహారం కోసం న్యాయపోరాటం చేస్తున్నారు. ఒక ఉదాహరణగా వయసుపైబడి మంచాన పడి ఉన్న ఓ తల్లి, తన ఒక్కగానొక్క కొడుకు సంపాదన మీద ఆధారపడి బతుకుతున్న పరిస్థితిని ప్రస్తావించారు. ఆ కొడుకు ప్రమాదంలో మరణించగా, ఇప్పటివరకు ఆమెకు ఎలాంటి పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎయిర్ ఇండియా, బాధిత కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని, అలాగే ప్రమాదంలో దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌ను తిరిగి నిర్మిస్తామని హామీ ఇచ్చింది. జూలైలో తాత్కాలిక పరిహారంగా 25 లక్షలు 147 కుటుంబాలకు, అలాగే నేలపై మరణించిన 19 కుటుంబాలకు ఇచ్చింది. అయితే ఈ మొత్తాన్ని తుది పరిహారం నుంచి మినహాయిస్తామని ప్రకటించింది. పరిహారం అందడంలో ఆలస్యంతో బాధిత కుటుంబాలు కోర్టు శరణు చేరాయి.
ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదిక ప్రకారం, టేకాఫ్ తర్వాత ఇంధన కంట్రోలర్ స్విచ్‌లు ఒక్క సెకనుకు ఆగిపోవడంతో ఇంజిన్‌లకు ఇంధన సరఫరా నిలిచిపోయింది. దాంతో రెండు ఇంజిన్లు గాల్లోనే ఆగిపోయి, కేవలం 32 సెకన్లలో విమానం కూలిపోయింది. పైలట్ల మధ్య ఇంధన స్విచ్‌పై సంభాషణ జరిగినప్పటికీ, అప్పటికే పరిస్థితి అదుపులోకి రాలేదు.
మైక్ ఆండ్రూస్ మాట్లాడుతూ, FADEC (ఫుల్లీ ఆథారిటీ డిజిటల్ ఇంజిన్ కంట్రోల్ ) సిస్టమ్ లోపం కారణమని తేలితే, బోయింగ్ కంపెనీపై అమెరికాలో ఉత్పత్తి బాధ్యత కేసు వేయవచ్చని తెలిపారు. లేకపోతే ఎయిర్ ఇండియాదే బాధ్యత అవుతుందని, మాంట్రియాల్ కన్వెన్షన్ ప్రకారం పరిహారం చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. రెండు పక్షాలకూ బాధ్యత వస్తే, పరిహారం అంశం మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉందని సూచించారు.
ఈ ఘటన, సాంకేతిక లోపాలు - నిర్వహణలో నిర్లక్ష్యం ఎంత ఘోరమైన పరిణామాలకు దారితీస్తాయో మరోసారి గుర్తు చేసింది. అదే సమయంలో, రతన్ టాటా వంటి నైతిక విలువలు కలిగిన నాయకత్వం ఉంటే, బాధిత కుటుంబాల బాధ కొంతైనా తక్కువయ్యేదనే అభిప్రాయం వెలువడుతోంది.
