ఎయిర్ చైనా విమానంలో అలజడి.. గాల్లో లగేజీకి మంటలు!
గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడి లగేజీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి విమానంలో భయానక పరిస్థితి నెలకొంది.
By: A.N.Kumar | 18 Oct 2025 6:40 PM ISTచైనాలోని ఎయిర్ చైనా విమానంలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడి లగేజీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి విమానంలో భయానక పరిస్థితి నెలకొంది. అయితే, సిబ్బంది చాకచక్యంతో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.
శనివారం తూర్పు చైనాలోని హాంగ్‌జౌ నుండి దక్షిణ కొరియాలోని సియోల్ సమీపంలో ఉన్న ఇంచియాన్ వైపు బయల్దేరిన ఎయిర్ చైనా విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే ఈ ఘటన జరిగింది. వివరాల ప్రకారం, ఓ ప్రయాణికుడి చేతి లగేజీలో ఉన్న లిథియం బ్యాటరీ అకస్మాత్తుగా పేలిపోవడంతో మంటలు చెలరేగాయి. ఓవర్‌హెడ్ బిన్ నుండి మంటలు, దట్టమైన పొగ బయటకు రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. కొందరు ప్రయాణికుల హాహాకారాలు వినిపించాయి.
సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది అత్యవసర చర్యలు చేపట్టి మంటలను ఆర్పారు. ఆ తర్వాత, విమానాన్ని సమీపంలోని షాంఘై ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అదృష్టవశాత్తు, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు, అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
ఈ ఘటనపై ఎయిర్ చైనా అధికారిక ప్రకటన విడుదల చేసింది. విమానంలో మంటలు చెలరేగిన విషయం వాస్తవమేనని, అయితే సిబ్బంది సమయానికి స్పందించడంతో అందరూ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. ఘటనకు కారణమైన లిథియం బ్యాటరీని పరీక్షించేందుకు విచారణ ప్రారంభించినట్లు తెలిపారు.
ఓ ప్రయాణికుడు ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ సంఘటనతో విమానాల్లో బ్యాటరీ పరికరాల భద్రతపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. ప్రయాణంలో లిథియం బ్యాటరీలు, పవర్ బ్యాంకుల వాడకం, నిబంధనలపై విమానయాన సంస్థలు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
