బీహార్ దంగల్: ఎంఐఎం దారెటు?
ఎంఐఎం.. హైదరాబాద్‌కు చెందిన మజ్లిస్ పార్టీ. అయితే.. జాతీయ స్థాయిలో ఈ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చక్రం తిప్పుతున్నారు.
By: Garuda Media | 8 Oct 2025 3:00 PM ISTఎంఐఎం.. హైదరాబాద్‌కు చెందిన మజ్లిస్ పార్టీ. అయితే.. జాతీయ స్థాయిలో ఈ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చక్రం తిప్పుతున్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా.. నేనున్నానంటూ ముందుకు వస్తున్నారు. యూపీ, బీహార్, ఢిల్లీ సహాఈ ఏడాది జరిగిన జార్ఖండ్‌లోనూ పోటీ చేశారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ముస్లింలను ఐక్యం చేయడంతోపాటు.. కీలకమై న పార్టీలకు కంట్లో నలుసుగా మారుతున్నారు. ఇక, ఇప్పుడు కీలకమైన బీహార్ ఎన్నికలు వచ్చాయి. అయితే.. ఇక్కడ ఎంఐఎం ఏం చేస్తుందనేది చూడాలి. దీనికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి.
1) మహాఘట్ బంధన్‌లో చేర్చుకోకపోవడం: బీహార్‌లో కాంగ్రెస్ నేతృత్వంలో ఆర్జేడీ, సీపీఎం, సీపీఐ చిన్న చితక పార్టీలు కలిసి మహాఘట్ బంధన్‌గా ఏర్పడ్డాయి. అంతేకాదు.. కొన్నాళ్లుగా ఇక్కడ ప్రచార పర్వం కూడా నిర్వహిస్తున్నాయి. అయితే.. అప్పట్లో మేము మీతో కలిస్తాంటూ.. ఎంఐఎం అధినేత ఒవైసీ కాంగ్రెస్‌కు కబురు పంపారు. దీనికి ఆర్జేడీ సుముఖంగానేఉంది. ఎందుకంటే.. బీహార్‌లో బలమైన ముస్లింలను ఎంఐఎం ఎప్పటి నుంచో ప్రభావితం చేస్తోంది. కానీ, బ్రాహ్మణ, హిందూ ఓటర్లపై ఎంఐఎం ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం విషయంలో ఇప్పటికీ ఏమీ తేల్చలేదు.
2) ముస్లిం ప్రాబల్య సీమాంచల్‌లో పట్టు: ఇక, బీహార్‌లోని సీమాంచల్ ప్రాంతంగా పేర్కొనే చోట.. ఎంఐఎంకు బలమైన మద్దతు ఉంది. ఇక్కడ నుంచే గత ఎన్నికల్లో ఐదు స్థానాల్లో విజయం కూడా దక్కించుకుంది. ఈ సీమాంచల్ డివిజన్‌లో పూర్నియా, కతిహార్, అరారియా, కిషన్‌గంజ్ జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ ముస్లింలు 50 శాతానికి పైగా ఉన్నారని గణాంకాలు చెబుతున్నా యి. అంతేకాదు.. ఇక్కడ వీరికి ఎంఐఎం తప్ప.. ప్రత్యామ్నాయ ముస్లిం పార్టీ లేదన్న భావన ఉంది. వాస్తవానికి అవామీలీగ్ ఉన్నా.. అది బీజేపీతో జట్టు కట్టింది. ఇది ఎంఐఎంకు కలిసి వస్తోంది. దీంతో సీమాంచల్ లో పట్టును నిలుపుకోవాల్సి ఉంది.
3) పార్టీకి ఉన్న బలం: బీహార్‌లో స్థానిక ముస్లింలే కాకుండా.. జాట్లు కూడా ఎంఐఎంకు మద్దతు పలుకుతున్నారు. గత ఎన్నికల్లో సీమాంచల్ పరిధి దాటి జాట్లు ఉన్న చోట కూడా పోటీ చేసినా.. ఎంఐఎం రెండో స్థానం దక్కించుకుంది. ఈ పరిణామాల క్రమంలో ఎంఐఎం ఇప్పుడు ఒంటరిగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. కానీ, మహాఘట్ బంధన్ తో కలిస్తే.. కనీసంలో కనీసం.. రెండంకెల సంఖ్యకు బలాన్ని పెంచుకోవచ్చన్నది అసదుద్దీన్ అంచనా. మరి ఏం చేస్తారో చూడాలి.
