Begin typing your search above and press return to search.

ఉగ్రవాద పాకిస్తాన్ కు భారీ సాయం.. భారత్ లో ఆందోళన

సాధారణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి అందించే ఈ సాయంపై గ్లోబల్ మానిటరింగ్ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

By:  A.N.Kumar   |   14 Oct 2025 10:00 PM IST
ఉగ్రవాద పాకిస్తాన్ కు భారీ సాయం.. భారత్ లో ఆందోళన
X

ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (AIIB) తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఇప్పుడు భారతదేశ భద్రతా వర్గాలలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. మౌలిక సదుపాయాల కల్పన పేరుతో AIIB, పాకిస్థాన్‌కు ఏకంగా $235 మిలియన్ల (దాదాపు ₹1,950 కోట్లు) భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.

*ప్రాజెక్ట్ లక్ష్యం ఏంటి?

ఈ నిధులను లాహోర్ వాటర్ అండ్ వాచ్ వాటర్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్ కోసం కేటాయించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా లాహోర్ నగరంలో ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందించడం, మురుగునీటి లీకేజీ సమస్యలను పరిష్కరించడం.. అత్యంత ముఖ్యంగా రావి నదిలోకి వ్యర్థాలు ప్రవేశించకుండా నియంత్రించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను లాహోర్ వాటర్ అండ్ శానిటేషన్ ఏజెన్సీ (WASA) , చైనాకు చెందిన ఒక సంస్థ సంయుక్తంగా చేపట్టనున్నాయి. AIIB ఈ మొత్తాన్ని పాకిస్థాన్‌కు విడతల వారీగా అందించనుంది.

* ఉగ్ర కార్యకలాపాలకు నిధులు మళ్లించే ప్రమాదం?

సాధారణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి అందించే ఈ సాయంపై గ్లోబల్ మానిటరింగ్ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాకిస్థాన్ గత చరిత్రే ఈ ఆందోళనకు ప్రధాన కారణం. గతంలో వరల్డ్ బ్యాంక్, IMF, AIIB వంటి అంతర్జాతీయ ఫైనాన్సింగ్ సంస్థల నుంచి అందిన ఆర్థిక సాయం ఉగ్రస్థావరాల నిర్మాణం, ఇతర ఉగ్ర కార్యకలాపాలకు మళ్లించబడిన సందర్భాలు అనేకసార్లు వెల్లడయ్యాయి. తాజా $235 మిలియన్ల సాయం కూడా అదే మార్గంలో వినియోగించబడే అవకాశం ఉందనేది భద్రతా వర్గాల ప్రధాన భయం.

* సరిహద్దులో పాక్ కుట్రలు: భారత ఆర్మీ అప్రమత్తం

AIIB సాయం ప్రకటన వెలువడిన ప్రస్తుత సమయంలోనే, సరిహద్దుల వద్ద పాకిస్థాన్ కార్యకలాపాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత ఆర్మీ ధ్వంసం చేసిన ఉగ్ర స్థావరాలను పాకిస్థాన్ తిరిగి నిర్మిస్తోందన్న వార్తలు వెలువడ్డాయి. పాకిస్థాన్ ఆర్మీ ఎయిర్ బేస్‌లను నిర్మిస్తున్నట్లు చూపించే శాటిలైట్ చిత్రాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తాజా కుట్ర

వెస్టర్న్ ఆర్మీ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ మాట్లాడుతూ పాకిస్థాన్ పహల్గామ్ తరహా మరో దాడికి కుట్ర పన్నుతోందని స్పష్టం చేశారు. అయితే, భారత ఆర్మీ ఈ తరహా పరిస్థితులను ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉందని ఆయన నొక్కి చెప్పారు.

ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ తన సరిహద్దు భద్రతను మరింతగా బలోపేతం చేసేందుకు, పాకిస్థాన్ చర్యలను ప్రతిఘటించేందుకు అన్ని వ్యూహాత్మక మార్గాలను పరిశీలిస్తోంది. AIIB నుంచి పాకిస్థాన్‌కు అందిన ఈ భారీ సాయం, రెండు దేశాల మధ్య భద్రతా పరిస్థితులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది ప్రాంతీయ స్థిరత్వానికి సవాలుగా పరిణమించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.