Begin typing your search above and press return to search.

అన్నాడీఎంకే రెండు ముక్కలు! సీఎం విజయ్ కి మద్దతు ప్రకటించిన తిరుగుబాటు నేతలు

ఇక మంగళవారం పార్టీలో పళనిస్వామి వర్గం నుంచి తాము విడిపోతున్నట్లు బహిరంగంగా సీనియర్ నేత షణ్ముగం చేసిన ప్రకటనతో కలకలం రేగింది.

By:  Tupaki Political Desk   |   12 May 2026 11:35 AM IST
అన్నాడీఎంకే రెండు ముక్కలు! సీఎం విజయ్ కి మద్దతు ప్రకటించిన తిరుగుబాటు నేతలు
X

తమిళనాడు రాజకీయాలలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అంతర్గత విభేదిలతో విపక్ష అన్నాడీఎంకే నిట్టనిలువునా చీలిపోయింది. పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంతో విభేదిస్తూ సీనియర్ నేత షణ్ముగం నేతృత్వంలోని 30 మంది ఎమ్మెల్యేలు టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఈ పరిణామంతో ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వ బలం 150కి చేరుకుంది. ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న రాజకీయాలతో అన్నాడీఎంకే రెండు వర్గాలుగా విడిపోయిందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ సీనియర్ నేత షణ్ముగం ప్రకటన చేశారు.

నిజానికి అన్నాడీఎంకేలో సంక్షోభంపై సోమవారమే మీడియాలో కథనాలు వచ్చాయి. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా మాజీ సీఎం పళనిస్వామిని ఎన్నుకునే విషయంలో సీనియర్ నేతలు ఎస్పీ వేణుమణి, షణ్ముగం విభేదించారు. ఆ ఇద్దరి నేతృత్వంలో 30 మంది ఎమ్మెల్యేలు వేరుకుంపటి పెట్టుకోనున్నట్లు సంకేతాలిచ్చారు. పళనిస్వామిని శాసనసభాపక్ష నేతగా చేయాలంటూ కేవలం 17 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయగా, మిగిలిన 30 మంది వేణుమణికి మద్దతు ప్రకటించారు. వేణుమణిని తమ శాసనసభ పక్ష నేతగా గుర్తించాలని అసెంబ్లీ అధికారులకు లేఖలు సమర్పించారు. షణ్ముగం ను డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఎన్నుకున్నట్లు ఆ లేఖలో తెలిపారు.

ఇక మంగళవారం పార్టీలో పళనిస్వామి వర్గం నుంచి తాము విడిపోతున్నట్లు బహిరంగంగా సీనియర్ నేత షణ్ముగం చేసిన ప్రకటనతో కలకలం రేగింది. అంతేకాకుండా తమ వర్గం ఎమ్మెల్యేలు ఎన్డీఏ నుంచి కూడా బయటకు వస్తున్నట్లు వెల్లడించారు. పదేళ్లుగా పార్టీ వరుస ఓటములకు ప్రధాన కార్యదర్శి పళనిస్వామి కారణమని ఆయన ఆరోపించారు. పార్టీ పదవి నుంచి పళనిస్వామి దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఈపీఎస్ చేతుల్లో నుంచి పార్టీని తాము కాపాడుకుంటామని స్పష్టం చేశారు.

కాగా, ఏఐడీఎంకేలో చీలికను ముందు నుంచి ఊహించిందేనని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల్లో టీవీకే గెలిచినా, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ రాకపోవడంతో ముందుగా మద్దతు ప్రకటించాలని అన్నాడీఎంకేలో మెజార్టీ ఎమ్మెల్యేలు భావించినట్లు చెబుతున్నారు. అయితే పార్టీ నాయకత్వం మాత్రం చిరకాల ప్రత్యర్థి డీఎంకే మద్దతు తీసుకుని అధికారం చేపట్టాలని భావించిందని అంటున్నారు. డీఎంకేతో చిరకాల వైరం పక్కన పెట్టాలని భావించడం, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి క్లీన్ ఇమేజ్ ఉన్న విజయ్ ని తొక్కిపెట్టాలని నిర్ణయించడంపై మెజార్టీ ఎమ్మెల్యేలు విభేదించినట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే మాజీ సీఎం ఈపీఎస్ వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి విజయ్ పక్షాన నిలవాలని వారంతా నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇక అన్నాడీఎంకే పరిణామాలతో ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వానికి పూర్తి స్థిరత్వం వచ్చిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.