Begin typing your search above and press return to search.

ఇక అన్నా డీఎంకే ఒక చరిత్ర ?

తమిళనాడులో అన్నా డీఎంకేని అప్పటి వెండి తెర ఆరాధ్య దైవం ఎంజీ రామచంద్రన్ స్థాపించారు.

By:  Satya P   |   13 May 2026 1:00 AM IST
ఇక అన్నా డీఎంకే ఒక చరిత్ర ?
X

తమిళనాడులో అన్నా డీఎంకేని అప్పటి వెండి తెర ఆరాధ్య దైవం ఎంజీ రామచంద్రన్ స్థాపించారు. 1972 అక్టోబర్ 17న ఎంజీఆర్ డీఎంకే నుంచి వేరుపడి ఈ పార్టీని స్థాపించారు. అంటే 56 ఏళ్ళ చరిత్ర అన్నా డీఎంకేది. అయితే ఆ పార్టీ ఇపుడు అతి పెద్ద రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. దాంతో 2026 ఎన్నికల ఫలితాల తరువాత అన్నా డీఎంకే మనుగడ ప్రశార్ధకం అయిపోయింది. ఎంజీఅర్ తరువాత జయలలిత అన్నా డీఎంకేకి బలమైన నేతగా ప్రజాకర్షణ కలిగిన లీడర్ గా ఉంటూ దాదాపు మూడు దశాబ్దాల పాటు నడిపించారు. దాని కంటే ముందు ఎంజీఆర్ పదిహేనేళ్ళ పాటు పార్టీకి సారధిగా నిలిచి కంచుకోటగా చేశారు. 2016 డిసెంబర్ లో జయలలిత మరణంతో అన్నా డీఎంకే ఇబ్బందుల్లో పడింది. అయితే అప్పటికి అధికారం నాలుగున్నరేళ్ళు ఉండడంతో 2021 దాకా కొనసాగింది. ఇక 2021 నుంచి 2026 వరకూ ప్రధాన ప్రతిపక్షంగానూ బీజేపీ మద్దతుతో

మనుగడ సాగించింది. ఇపుడు ఈ రెండూ లేవు. దాంతో పాటు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి మీద తీవ్ర అసంతృప్తిని పార్టీ సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు. దాంతో నిట్ట నిలువు చీలికకు అది దారి తీస్తోంది.

పళనిస్వామి వైఖరితోనే :

అన్నా డీఎంకేకి నాయకత్వం వహిస్తున్న పళనిస్వాని వైఖరితోనే పార్టీలో చీలిక సంభవిస్తోంది అని అంటున్నారు. పళనిస్వామి పార్టీలో సీనియర్లను అణగదొక్కుతున్నారు అని ప్రచారంలో ఉంది. జయలలితకు ఇష్టుడైన పన్నీరు సెల్వం ని అలాగే సీఎం పోస్టు నుంచి దించి గద్దెనెక్కారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చినట్లే ఇచ్చి పొగ పెట్టారు. పార్టీలోనూ ప్రాధాన్యత తగ్గించేశారు. దాంతో 2026 ఎన్నికల కంటే ముందు ఆయన డీఎంకేలో కలిశారు. ఇక ఈ ఎన్నికలలో వ్యూహాత్మకంగా పళనిస్వామి తప్పులు చేశారని అన్నా డీఎంకే సీనియర్లు ఆరోపిస్తున్నారు. టీవీకేతో పొత్తు పెట్టుకుందామని అంటే తాను సీఎం కావాలన్న ఉద్దేశ్యంతో పళనిస్వామి పడనిచ్చారు కాదని బీజేపీతో పొత్తుకు ఆయన మొగ్గు చూపారని ఆరోపిస్తున్నారు.

బీజేపీ సైతం ఆగ్రహం :

అయితే బీజేపీతో పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చారని అంటున్నారు. ఓడిపోయే సీట్లను వారికి ఇచ్చారని అపుడే ఆరోపించారు ఇక ఓట్ల బదిలీ కూడా అన్నా డీఎంకే నుంచి బీజేపీకి జరగలేదు అని వారు విమర్శిస్తున్నారు. అన్నా డీఎంకే నేతలు బీజేపీ అభ్యర్ధులకు ప్రచారం చేయలేదు. దాంతో 27 సీట్లు ఇచ్చినా చివరికి ఒక్కరే బీజేపీ నుంచి గెలిచారు. ఈ విషయాలు అన్నీ కేంద్ర బీజేపీ పెద్దలకు చేరడంతో వారు సైతం పళని స్వామి పట్ల గుర్రుగా ఉన్నారని అంటున్నారు. అంతే కాదు బీజేపీకి తమిళనాడులో బలమైన గొంతుగా ఉన్న రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన అన్నామలైని తప్పించేంతవరకూ పళనిస్వామి నిద్ర పోలేదని కూడా కమలనాధులు చెబుతారు.

చివరికి అంతకు కూడా :

డీఎంకేతో పొత్తుకు కూడా చివరికి పళని స్వామి తెగించారని అన్నా డీఎంకే నేతలు మండిపడుతున్నారు. ఇదంతా ఆయన అధికార దాహంతో తీసుకున్న సొంత నిర్ణయాలు అని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే సీనియర్ నేతలు అంతా ఒక్కటిగా అయి 30కి పైగా ఎమ్మెల్యేలతో టీవీకేకు మద్దతుగా నిలబడుతున్నారు. వారంతా విజయ్ ప్రభుత్వం బలపరీక్షలో అనుకూలంగా ఓటు వేయబోతున్నారు. దాంతో పళనిస్వామి అన్నా డీఎంకేకు ఎంత మంది ఎమ్మెల్యేలు మిగులుతారు అన్నది చూడాల్సి ఉంది. ఒకవేళ వారంతా టీవీకేలో విలీనం అయితే తమిళనాడులో నామమాత్రంగా అన్నా డీఎంకే మిగిలిపోతుంది. పార్టీని జనాకర్షణ కలిగిన నేతలు లేనపుడు సమిష్టిగా పనిచేయాల్సింది పోయి పళనిస్వామి తన వైఖరితో ఈ విధంగా ఎంజీఆర్ జయలలిత పార్టీని బలహీనం చేసేలా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. దాంతో రానున్న రోజులలో తమిళనాడు రాజకీయాలలో టీవీకే డీఎంకే రెండు పార్టీలు మాత్రమే ఉండే సీన్ కనిపిస్తోంది అని అంటున్నారు. ఎన్నో చారిత్రాత్మక విజయాలు అందుకున్న అన్నా డీఎంకే భవిష్యత్తు అయితే ప్రశార్ధకంగా ఉందని అంటున్నారు.