ఏఐడీఎంకేలో సంక్షోభం! చీలిక తప్పదా?
ఇక ఈపీఎస్ ను శాసనసభాపక్ష నేతగా గుర్తించాలని ఏఐడీఎంకే రాసిన లేఖపై 30 మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకపోవడం తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
By: Tupaki Political Desk | 11 May 2026 9:00 PM ISTతమిళనాడు రాజకీయాలు తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే విపక్షంలోని ఏఐడీఎంకే పార్టీ రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడ పళనిస్వామి నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఓ వర్గం తిరుగుబాటు చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు నిదర్శనంగా పళనిస్వామిని ఏఐడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునేందుకు కేవలం 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే సంతకాలు చేసిన లేఖను చూపుతున్నారు. ఆ పార్టీకి మొత్తం 47 మంది ఎమ్మెల్యేలు ఉండగా, సుమారు 30 మంది ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా పళనిస్వామి పేరుపై విముఖత చూపుతున్నారని అంటున్నారు.
ప్రధానంగా ఎన్నికల ఫలితాల అనంతరం టీవీకేతో పొత్తుకు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి (ఈపీఎస్) నిరాకరించడంపై 30 మంది ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారని అంటున్నారు. విజయ్ కి మద్దతు ప్రకటిస్తే తమకు అధికారంలో వాటా దక్కేదన్న భావనతో ఉన్న ఎమ్మెల్యేలు, ఈపీఎస్ మూలంగా మళ్లీ ప్రతిపక్షానికి పరిమితం కావాల్సివచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం డీఎంకేతో చేతులు కలపడానికి సిద్దపడ్డారని, విజయ్ తో కలిస్తే తప్పేంటని మరికొందరు నిలదీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక ఈపీఎస్ ను శాసనసభాపక్ష నేతగా గుర్తించాలని ఏఐడీఎంకే రాసిన లేఖపై 30 మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకపోవడం తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ పరిణామంతో ఆ పార్టీ నిట్టనిలువునా చీలిపోయే పరిస్థితి కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే పార్టీ నాయకత్వం మాత్రం దీనిపై ఇంతవరకు స్పందించలేదు. మరోవైపు ఎన్నికల ఫలితాలు వచ్చిన నుంచి అన్నాడీఎంకే పార్టీలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత పార్టీ నేతలు తలోదిక్కున పయనిస్తున్నారని అంటున్నారు.
మాజీ సీఎం పన్నీరు సెల్వం ఎన్నికలకు ముందు డీఎంకేలో చేరగా, సీనియర్ నేతలు శశికళ, దినకరన్ వంటి వారు సొంతంగా పార్టీ పెట్టుకోవడం వంటి పరిణామాలతో అన్నాడీఎంకే పూర్తి దెబ్బతిన్నదని కార్యకర్తలు చెబుతున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ తమిళనాడులో ఊహించని పరాభవం ఎదురుకావడం కూడా పార్టీ శ్రేణులను భయాందోళనకు గురిచేస్తోందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈపీఎస్ తీరును నిరసిస్తూ 30 మంది ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెట్టేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే తమిళ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
