Begin typing your search above and press return to search.

పర్ఫెక్షన్ వద్దు.. ‘తప్పులే’ ముద్దు: AI ప్రపంచంలో సరికొత్త వింత

సాధారణంగా టెక్నాలజీ అంటేనే పనులను వేగంగా, అత్యంత ఖచ్చితత్వంతో పూర్తి చేయడం.

By:  A.N.Kumar   |   27 April 2026 7:00 PM IST
పర్ఫెక్షన్ వద్దు.. ‘తప్పులే’ ముద్దు: AI ప్రపంచంలో సరికొత్త వింత
X

సాధారణంగా టెక్నాలజీ అంటేనే పనులను వేగంగా, అత్యంత ఖచ్చితత్వంతో పూర్తి చేయడం. మనం ఏదైనా ఈమెయిల్ రాసినా లేదా ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ సిద్ధం చేసినా.. అందులో పొరపాట్లు ఉండకూడదని గ్రామర్లీ వంటి టూల్స్ వాడుతుంటాం. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. "తప్పులు చేయడమే ఈ ఏఐ ప్రత్యేకత" అంటూ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పరిశోధకుడు రూపొందించిన ఒక టూల్ టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఏమిటీ ‘సిన్సియర్లీ’? దీని వెనుక ఉన్న కథ ఏంటి?

అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ స్కూల్ కు చెందిన పరిశోధకుడు బెన్ అభివృద్ధి చేసిన ఈ టూల్ పేరు “సిన్సియర్లీ”. సాధారణంగా ఏఐ టూల్స్ అన్నీ మన రాతను మెరుగుపరిచి.. వ్యాకరణ దోషాలు లేకుండా చేస్తాయి. కానీ సిన్సియర్లీ దీనికి పూర్తి భిన్నం. ఇది మీరు ఇచ్చే సమాచారాన్ని తీసుకుని.. అందులో కావాలని కొన్ని చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్, వ్యాకరణ పొరపాట్లు, మనుషులు సహజంగా వాడే భాషా శైలిని జోడిస్తుంది.

ఎందుకు ఈ వింత ప్రయత్నం?

ఈ వినూత్న ఆలోచన వెనుక చాలా లోతైన కారణం ఉంది. ప్రస్తుతం కార్యాలయాల్లో ప్రతి చిన్న పనికి ఏఐ (చాట్ జీపీటీ, జెమినీ వంటివి) వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏఐ రాసే లేఖలు చాలా పర్ఫెక్ట్‌గా, ఒకే రకమైన ఫార్మల్ టోన్‌లో ఉంటాయి. ఇది చదివేవారికి ఒక రోబో రాసినట్లుగా అనిపిస్తుంది తప్ప.. అవతలి వ్యక్తి మనసు పెట్టి రాసినట్లు అనిపించదు.

కంపెనీలు ఇప్పుడు ఏఐ ద్వారా రాసిన కంటెంట్‌ను గుర్తించడానికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లను వాడుతున్నాయి. దీనివల్ల ఉద్యోగుల క్రియేటివిటీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక మనిషి రాసేటప్పుడు అక్కడక్కడ చిన్న తప్పులు దొర్లడం సహజం. ఆ చిన్న చిన్న పొరపాట్లే ఆ రాతలో ఒక "సహజత్వాన్ని" నింపుతాయి. పర్ఫెక్ట్ గ్రామర్ ఒక్కోసారి కృత్రిమంగా కనిపిస్తుంది.

‘సిన్సియర్లీ’ ఎలా పనిచేస్తుంది?

ఈ టూల్ కేవలం తప్పులు చేయడం మాత్రమే కాదు.. ఆ తప్పులను చాలా తెలివిగా చేస్తుంది. టైప్ చేసేటప్పుడు అనుకోకుండా దొర్లే 'టైపాస్' వంటి వాటిని ఇది ప్రవేశపెడుతుంది. యూజర్లు తమకు కావాల్సిన శైలిని ఎంచుకోవచ్చు. అది బాస్‌కి రాసే రిపోర్ట్ అయినా, సహోద్యోగికి పంపే క్యాజువల్ మెసేజ్ అయినా.. దానికి తగ్గట్లుగా ఇది రాతను మారుస్తుంది. ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైన రాత శైలి ఉంటుంది. ‘సిన్సియర్లీ’ ఆ శైలిని అనుకరిస్తూ ఏఐ రాసినట్లు కాకుండా ఒక సామాన్య ఉద్యోగి రాసినట్లుగా భ్రమింపజేస్తుంది.

సహజత్వమే అసలైన విజయం!

టెక్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ టూల్ రాకతో ఏఐ వినియోగం మరో మెట్టు ఎక్కింది. టెక్నాలజీ ఎంత పెరిగినా, మనుషుల మధ్య జరిగే సంభాషణల్లో "ఎమోషనల్ కనెక్ట్" , "సహజత్వం" అనేవి చాలా ముఖ్యం. ఈమెయిల్స్ పూర్తిగా తప్పులు లేకుండా ఉన్నాయా అన్నదాని కంటే అది అవతలి వ్యక్తికి ఎంత నిజాయితీగా చేరువయ్యింది అనేదే ముఖ్యం.

మేము పరిపూర్ణత కంటే సహజత్వానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం. నేటి కాలంలో ఒక చిన్న పొరపాటు కూడా మీరు స్వయంగా కష్టపడి రాశారని చెప్పడానికి ఒక నిదర్శనంగా మారుతోంది" అని డెవలపర్లు పేర్కొంటున్నారు.

మొత్తానికి తప్పులను సరిదిద్దే కాలం నుండి తప్పులను కావాలని చేసే స్థాయికి ఏఐ చేరుకుంది. వినడానికి ఇది కొంచెం విడ్డూరంగా ఉన్నా.. డిజిటల్ ప్రపంచంలో "మనుషుల ఉనికిని" చాటుకోవడానికి ఇదొక కొత్త మార్గంగా కనిపిస్తోంది. భవిష్యత్తులో మనం పంపే ఈమెయిల్స్‌లో చిన్న తప్పులు ఉంటే.. అది ఆ వ్యక్తి నిర్లక్ష్యం అనుకోలేం, బహుశా అది 'సిన్సియర్లీ' వంటి టూల్ మాయాజాలం కూడా కావచ్చు!