Begin typing your search above and press return to search.

సరికొత్త హోమ్ మెయిడ్ రోబో.. మనిషి అవసరం లేని ఆ 'స్మార్ట్ హోమ్' మాయాజాలం ఏంటి?

సాధారణంగా రోబోటిక్స్ రంగంలో జపాన్ లేదా అమెరికా అగ్రస్థానంలో ఉంటాయని భావిస్తారు. కానీ ఈ ఆవిష్కరణతో చైనా తన సత్తా చాటింది.

By:  Tupaki Political Desk   |   28 March 2026 1:00 PM IST
సరికొత్త హోమ్ మెయిడ్ రోబో.. మనిషి అవసరం లేని ఆ స్మార్ట్ హోమ్ మాయాజాలం ఏంటి?
X

రోబోలు మన ఇంట్లో మనుషుల కంటే మెరుగ్గా గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం, చివరకు వంట కూడా చేయడం అంటే వినడానికే ఏదో మాయాజాలంలా ఉంది కదా.. చైనాకు చెందిన యూనిపాత్ (Unipath) సంస్థ రూపొందించిన ఈ సరికొత్త ఏఐ గృహ రోబోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని వెనుక బలమైన కారణం ఉంది. సాధారణంగా రోబోలు అంటే ఫ్యాక్టరీల్లో కష్టమైన పనులు చేస్తాయని మనకు తెలుసు, కానీ ఇది మన వంటింట్లో గరిటె తిప్పడం, పడకలను సర్దడం వంటి అత్యంత సాధారణ పనులను కూడా అవలీలగా చేస్తోంది. ఈ ‘స్మార్ట్ హోమ్ అసిస్టెంట్’ సృష్టిస్తున్న సంచలనం, భవిష్యత్తుపై దాని ప్రభావం గురించి లోతుగా పరిశీలిస్తే..

ఇంటి పనుల్లో ఆల్ రౌండర్!

ఈ రోబోట్ కేవలం ఒక యంత్రం మాత్రమే కాదు.., ఇది ఒక పూర్తిస్థాయి గృహంలో సహాయకుడిలా పనిచేస్తుంది. దీని ప్రత్యేకతలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే..

వంట, క్లీనింగ్: మానవ సాయం లేకుండానే భోజనం తయారు చేయడం, నేలను శుభ్రం చేయడం, బట్టలను వాషింగ్ మెషిన్ లో వేయడం వంటి పనులను సునాయాసంగా చేస్తుంది.

హోమ్ మేనేజ్‌మెంట్: పడకలను సర్దడం, గృహోపకరణాలను ఆపరేట్ చేయడం, యజమానులను సరైన సమయానికి నిద్రలేపడం వంటి పనులను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తుంది.

స్వీయ నిర్వహణ: పనులు పూర్తయిన తర్వాత తనను తాను శుభ్రం చేసుకోవడం దీనిలోని అత్యంత విశిష్టమైన ఫీచర్. అంటే దీనిని శుభ్రం చేయడానికి మళ్లీ మనం కష్టపడాల్సిన అవసరం లేదు.

చైనా మార్క్ టెక్నాలజీ!

సాధారణంగా రోబోటిక్స్ రంగంలో జపాన్ లేదా అమెరికా అగ్రస్థానంలో ఉంటాయని భావిస్తారు. కానీ ఈ ఆవిష్కరణతో చైనా తన సత్తా చాటింది. పారిశ్రామిక అవసరాల కంటే సామాన్యుల రోజువారీ కష్టాలను తగ్గించడంపైనే యూనిపాత్ దృష్టి సారించింది. దీనివల్ల ఉద్యోగస్తులు, వృద్ధులు, శారీరక శ్రమ చేయలేని వారికి ఇది గొప్ప వరంగా మారనుంది. సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, ఇంటిని ఎప్పుడూ క్రమపద్ధతిలో ఉంచడానికి ఇది తోడ్పడుతుంది.

సహాయమా? భర్తీనా?.. తలెత్తుతున్న ప్రశ్నలు!

ఈ సాంకేతికత ఎంత సౌకర్యవంతంగా ఉన్నా, కొన్ని మౌలికమైన ప్రశ్నలను కూడా లేవనెత్తుతోంది. యంత్రాలు ఇంటి బాధ్యతలను స్వీకరిస్తే, మనుషుల మధ్య ఉండే అనుబంధాలు, శ్రమపై గౌరవం ఏమవుతుందనే చర్చ మొదలైంది. రోబో మనకు 'సహాయం' చేస్తోందా లేదా మనల్ని 'భర్తీ' చేస్తోందా అనే గీత అస్పష్టంగా మారుతోంది. భవిష్యత్తులో మనం ఒక రోబోతో కలిసి ఒకే ఇంట్లో ఉండటం అనేది ఒక సాధారణ విషయంగా మారిపోవచ్చు.

ప్రస్తుతానికి ఒక రోబో మొత్తం ఇంటిని నిర్వహించడం అనేది అసాధారణంగా అనిపించవచ్చు, కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరీక్షలు చూస్తుంటే ఈ 'రోబోటిక్ విప్లవం' మన ముంగిటకే వచ్చిందనిపిస్తోంది. యూనిపాత్ వంటి సంస్థల ఆవిష్కరణలు మన జీవనశైలిని పూర్తిగా మార్చేయనున్నాయి. రోబోలు కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా, మన వంటింట్లో వంట చేసే రోజులు అతి దగ్గర్లోనే ఉన్నాయి.