ఏఐ యాప్స్ డేటా లీకులు: ప్రమాదంలో కోట్లాది వినియోగదారుల వ్యక్తిగత సమాచారం !
డిజిటల్ ఐడెంటిటీ వెరిఫికేషన్‌లో అగ్రగామిగా చెప్పుకునే ఐడీ మెరిట్ సంస్థ నుంచి 100 కోట్లకు పైగా రికార్డులు బహిర్గతం కావడం సామాన్యమైన విషయం కాదు.
By: A.N.Kumar | 24 Feb 2026 8:47 AM ISTసాంకేతిక విప్లవంలో 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (ఏఐ) ఒక అద్భుత సాధనంగా అవతరించింది. ఫోటోలను అందంగా మార్చుకోవడం నుంచి.. నిమిషాల్లో బ్యాంకింగ్ కేవైసీ పూర్తి చేయడం వరకు అంతా ఏఐ మయం. కానీ ఈ సౌలభ్యం వెనుక 'డేటా లీకుల' రూపంలో ఒక పెను ప్రమాదం పొంచి ఉందని తాజా ఘటనలు నిరూపిస్తున్నాయి. ఐడీమెరిట్ , వీడియో ఏఐ ఆర్ట్ జనరేటర్ యాప్‌ల నుంచి జరిగిన భారీ డేటా లీకులు, డిజిటల్ భద్రతపై మనకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాయి.
బిలియన్ల రికార్డులు.. అంగడి సరుకైన వ్యక్తిగత సమాచారం
డిజిటల్ ఐడెంటిటీ వెరిఫికేషన్‌లో అగ్రగామిగా చెప్పుకునే ఐడీ మెరిట్ సంస్థ నుంచి 100 కోట్లకు పైగా రికార్డులు బహిర్గతం కావడం సామాన్యమైన విషయం కాదు. ఇందులో పేరు, చిరునామా, ఫోన్ నంబర్లు మాత్రమే కాకుండా.. అత్యంత కీలకమైన నేషనల్ ఐడీ వివరాలు, ఈమెయిల్స్, టెలికాం మెటాడేటా కూడా ఉండటం గమనార్హం. 26 దేశాలకు చెందిన వ్యక్తుల సమాచారం సామాన్య సైబర్ నేరగాళ్లకు సైతం అందుబాటులోకి రావడం భవిష్యత్తులో జరిగే భారీ సైబర్ దాడులకు పునాది వేస్తోంది.
మరోవైపు కేవలం 5 లక్షల డౌన్‌లోడ్లు ఉన్న 'వీడియో ఏఐ ఆర్ట్ జనరేటర్’ అనే యాప్ ద్వారా 12TB డేటా లీక్ అవ్వడం విస్మయానికి గురి చేస్తోంది. వినియోగదారులు సరదాగా అప్‌లోడ్ చేసిన 15 లక్షల ఫోటోలు, 4 లక్షల వీడియోలు ఎటువంటి భద్రత లేకుండా ఇంటర్నెట్‌లో పడి ఉండటం కంపెనీల బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.
కంపెనీల నిర్లక్ష్యం.. వినియోగదారుల ప్రాణం మీదకు..
ఈ లీకులకు ప్రధాన కారణం టెక్ కంపెనీలు అనుసరిస్తున్న 'ముందు లాభం.. ఆ తర్వాత భద్రత' అనే ధోరణి. క్లౌడ్ స్టోరేజ్ సెట్టింగులలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం, డేటాబేస్‌లను పాస్‌వర్డ్ లేకుండా వదిలేయడం వంటివి అక్షరాలా నేరాలుగా పరిగణించాలి. టర్కీకి చెందిన కోడ్‌వే వంటి సంస్థలు గతంలోనూ ఇటువంటి తప్పులు చేసినా మళ్లీ అదే బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శించడం గమనార్హం.
ముంచుకొస్తున్న ముప్పులు
ఈ డేటా లీకుల వల్ల వినియోగదారులు కేవలం సమాచారాన్ని మాత్రమే కోల్పోవడం లేదు.. వారి జీవితాలే ప్రమాదంలో పడుతున్నాయి. లీక్ అయిన వీడియోలు, ఫోటోలను ఉపయోగించి అశ్లీల లేదా నకిలీ వీడియోలు సృష్టించే అవకాశం ఉంది. కేవైసీ వివరాలు చేజిక్కించుకున్న నేరగాళ్లు బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేయడం, సిమ్ స్వాపింగ్ వంటి దారుణాలకు ఒడిగట్టవచ్చు. వ్యక్తిగత వివరాల ఆధారంగా వినియోగదారులను నమ్మించి, వారిని ట్రాప్ చేసే ప్రమాదం ఉంది.
నియంత్రణే మార్గం
టెక్నాలజీ ఎంత వేగంగా దూసుకుపోతుందో, దానికి తగ్గట్టుగా డేటా ప్రొటెక్షన్ చట్టాలు అంతే వేగంగా అమలు కావాలి. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా వినియోగదారుల గోప్యతను పణంగా పెట్టే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి.
ఏదో ఒక యాప్ బాగుందని డౌన్‌లోడ్ చేసే ముందు.. అది మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎంతవరకు అడుగుతుందో గమనించండి. అనవసరమైన పర్మిషన్లు ఇవ్వకండి. గుర్తుంచుకోండి.. డిజిటల్ ప్రపంచంలో 'మీ డేటాయే మీ ఆస్తి'. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీతో పాటు ఆయా కంపెనీలపై కూడా ఉంది.
