గుర్తు తెలియని నెంబర్ల నుంచి ఫోన్..హైదరాబాద్ ‘ఈక్వల్’ చూసుకుంటుంది
By: Garuda Media | 1 Oct 2025 2:00 PM ISTఅంతకంతకూ విస్తరిస్తున్న టెక్నాలజీతో కొత్త ఆవిష్కణలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు చెప్పేది ఆ కోవకు చెందిందే. మొబైల్ ఫోన్ లేని జీవితాన్ని క్షణం కూడా ఊహించలేం. అలాంటి వేళ.. ఇప్పుడు వచ్చే పలు సమస్యలు మొబైల్ చుట్టూనే ఉంటున్న సంగతి తెలిసిందే. అలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు.. సమయాన్ని వేస్టు చేసుకోకుండా ఉండటమే కాదు.. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ను అటెండ్ చేసేందుకు వీలుగా ఏఐ ఆధారిత ‘ఈక్వల్’ ను రూపొందించింది హైదరాబాద్ కు చెందిన టెక్ కంపెనీ.
అక్టోబరు 2న అంటే రేపు (గురువారం) అందుబాటులోకి వచ్చే ఈ సాంకేతికతతో గుర్తు తెలియని నెంబర్లు.. టెలీ మార్కెటింగ్ కాల్స్ కు చెక్ పెట్టేందుకు.. ఆ కాల్స్ కు సమాధానాలు ఇచ్చేందుకు వీలుగా ఈ ఏఐ ఆధారిత అసిస్టెంట్ సాయం చేస్తుందని చెబుతున్నారు. తొలుత ఈ సాంకేతికతను ప్రయోగాత్మకంగా ఢిల్లీలోని పదివేల మంది ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందించి.. ఆతర్వాత దీన్ని మరింతగా విస్తరించనున్నట్లుగా సంస్థ వ్యవస్థాపకుడు కేశవ్ రెడ్డి చెబుతున్నారు.
ఇంతకూ ఏఐ ‘ఈక్వల్’ బాట్ ఏం చేస్తుందంటే వినియోగదారుడి తరపున కాల్ అటెండ్ చేస్తుంది. కాల్ అవసరాన్ని గుర్తించేందుకు ముందుగా మాట్లాడి.. అనంతరం కాల్ ను మనకు కనెక్టు చేయటం కానీ మెసేజ్ ను నోట్ రూపంలో నోట్ చేసుకొని ఆ సమాచారాన్ని ఇస్తుంది. అనంతరం తమకు వచ్చిన కాల్.. దాని సారాంశాన్ని తెలుసుకొని ఏం చేయాలన్నది నిర్ణయించుకునే వీలు ఉంటుంది. వచ్చే ఏడాదికి రోజువారీగా పది లక్షలమంది యాక్టివ్ యూజర్ల లక్ష్యంగా ప్రణాళికను సిద్దం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. అనవసరమై కాల్స్ అదే పనిగా వస్తున్న వేళ..ఈక్వల్ అవసరం రానున్న రోజుల్లో మరింత ఎక్కువ అవుతుందని చెప్పక తప్పదు.
