Begin typing your search above and press return to search.

అబ్బాయిలూ ఆ డేటింగ్ యాప్స్‌తో జాగ్రత్త.. వీరి వలలో పడితే అంతే..

అవును ఇప్పుడు సైబర్ మోసగాళ్లు ఏఐ టెక్నాలజీని వాడుకుని నకిలీ డేటింగ్ యాప్స్ ద్వారా సరికొత్త ‘హనీ ట్రాప్’ దుకాణాలు తెరిచారు.

By:  A.N.Kumar   |   26 Jun 2026 1:16 PM IST
అబ్బాయిలూ ఆ డేటింగ్ యాప్స్‌తో  జాగ్రత్త.. వీరి వలలో పడితే అంతే..
X

డిజిటల్ ఇండియాలో ప్రేమాయణాలు భలే ముదిరిపోతున్నాయి. ముఖ్యంగా మన ఒంటరి యువకులకు "సింగిల్ లైఫ్" బోర్ కొట్టేసి తోడు కోసం డేటింగ్ యాప్స్‌లో వెతుకులాట మొదలుపెడుతున్నారు. అయితే అక్కడ మీకోసం ఎదురుచూసేది నిజమైన ‘దేవత’ కాదు... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సృష్టించిన ‘మాయాజాలం’ అని గ్రహించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. అవును ఇప్పుడు సైబర్ మోసగాళ్లు ఏఐ టెక్నాలజీని వాడుకుని నకిలీ డేటింగ్ యాప్స్ ద్వారా సరికొత్త ‘హనీ ట్రాప్’ దుకాణాలు తెరిచారు.

"పెళ్లి వద్దు.. ఫ్రెండ్‌షిప్ చాలు" అంటూ ఎర!

ఈ నకిలీ యాప్స్‌లో అడుగుపెట్టగానే అప్సరసల్లాంటి అమ్మాయిల ఫొటోలు, వీడియోలు దర్శనమిస్తాయి. అవన్నీ ఏఐ సృష్టించిన నకిలీ బొమ్మలని పాపం మన అమాయక అబ్బాయిలకు ఎలా తెలుస్తుంది? "నాకు పెళ్లి వద్దు.. కేవలం మాట్లాడుకోవడానికి ఒక మంచి స్నేహితుడు కావాలి", "చాలా ఒంటరిగా ఉంది.. చాట్ చేద్దామా?" అంటూ హృదయాన్ని పిండేసే మెసేజ్‌లు వస్తాయి. ఈ తియ్యటి మాటలకు పడిపోయి మనోళ్లు తాము సంపాదించే జీతం దగ్గరి నుంచి ఇంట్లో ఉండే పిల్లి పేరు వరకు సర్వస్వం వాళ్లకు చెప్పేస్తుంటారు.

కొద్దిరోజులు మురిపించి, నమ్మకం కుదిరిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. వీడియో కాల్స్ మాట్లాడదామంటూ ప్రలోభపెట్టి, స్క్రీన్ రికార్డింగ్స్ లేదా అసభ్యకర దృశ్యాలను క్రియేట్ చేస్తారు. ఇక అక్కడి నుంచి ‘బ్లాక్‌మెయిల్’ పర్వం మొదలవుతుంది. "డబ్బులిస్తావా.. లేక ఈ వీడియో నీ ఫ్రెండ్స్ లిస్ట్‌కు పంపమంటావా?" అంటూ బెదిరింపులకు దిగుతారు.

పర్మిషన్లు ఇస్తే... ‘పర్సు’ ఖాళీ

మరో విచిత్రం ఏంటంటే ఈ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకునేటప్పుడు "మీ డేటా మా వద్ద చాలా భద్రం" అంటూనే.. మీ ఫోన్‌లోని కాంటాక్ట్స్, గ్యాలరీ, కెమెరా, లొకేషన్ పర్మిషన్లన్నీ లాగేసుకుంటాయి. అంటే మీ అంతట మీరే దొంగకు ఇంటి తాళాలు ఇచ్చినట్టు అన్నమాట! ఒక్కసారి పర్మిషన్ ఇచ్చారా.. మీ ఫోన్ డేటా మొత్తం సదరు సైబర్ ముఠా చేతికి వెళ్ళిపోతుంది.

ఈ ‘డిజిటల్ లవ్’ ఉచ్చులో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?

గుడ్డిగా ఏ యాప్ పడితే అది డౌన్‌లోడ్ చేయకండి. అక్కడ రేటింగ్స్, పీపుల్ రివ్యూస్ చదివితే అది ‘డేటింగ్’ యాప్పా లేక ‘దోపిడీ’ యాప్పా అనేది అర్థమైపోతుంది. స్క్రీన్‌పై కనిపించే అందాలన్నీ నిజం కావు. పరిచయం లేని వ్యక్తులతో పర్సనల్ ఫొటోలు, బ్యాంకింగ్ వివరాలు షేర్ చేసుకుంటే ఆ తర్వాత లబోదిబోమనాల్సి వస్తుంది. ఒక డేటింగ్ యాప్‌కు మీ కాంటాక్ట్ లిస్ట్‌తో కెమెరాతో 24 గంటలు ఏం పని? అవసరం లేని పర్మిషన్లను నిర్ధాక్షిణ్యంగా తిరస్కరించండి. పొరపాటున ఈ ఉచ్చులో చిక్కుకుంటే, భయపడి వాళ్లకు పైసలు తగలేయకండి. వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ (cybercrime.gov.in)లో లేదా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయండి.

టెక్నాలజీ పెరిగే కొద్దీ నేరగాళ్ల తెలివితేటలు కూడా అప్‌డేట్ అవుతున్నాయి. ఆన్‌లైన్ ప్రపంచంలో ముఖం తెలియని వ్యక్తులపై అమితమైన ప్రేమను కురిపించే ముందు కాస్త అప్రమత్తంగా ఉండండి. లేదంటే, ప్రేమ దొరకడం పక్కన పెడితే.. అకౌంట్ లో ఉన్న డబ్బులు మాత్రం మాయమవడం ఖాయం.