Begin typing your search above and press return to search.

అక్వాలో సిక్కోలే కింగ్.. దేశంలోని తొలి ఏఐ అక్వా పార్కు

దేశంలోని మొట్టమొదటి కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత ఆక్వాకల్చర్ పార్క్ శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు కాబోతోంది.

By:  Tupaki Political Desk   |   18 Nov 2025 4:10 PM IST
అక్వాలో సిక్కోలే కింగ్.. దేశంలోని తొలి ఏఐ అక్వా పార్కు
X

దేశంలోని మొట్టమొదటి కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత ఆక్వాకల్చర్ పార్క్ శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు కాబోతోంది. సీఐఐ సదస్సు సందర్భంగా ఏపీ ప్రభుత్వంతో కింగ్స్ ఇన్‌ఫ్రా వెంచర్స్ ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. రూ.2,500 కోట్లతో 500 ఎకరాల్లో కింగ్స్ మారిటైమ్ ఆక్వాకల్చర్ టెక్నాలజీ పార్క్ ఏర్పాటుకు ఆ సంస్థ సిద్ధమవుతున్నట్లు తెలిపింది. ఈ పార్కు నిర్మాణంతో శ్రీకాకుళం జిల్లాలో వేలాది మంది మత్స్యకారులకు గ్యారెంటీ ఉపాధి లభించనుందని అంటున్నారు. ప్రత్యక్షంగా 1,500 మందికి పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు.

కింగ్స్ ఆక్వాకల్చర్ టెక్నాలజీ పార్కుతో సాంకేతిక ఆధారిత స్థిరమైన సముద్ర ఆహార ఉత్పత్తికి కేంద్రంగా శ్రీకాకుళం అవతరించనుందని అంటున్నారు. కేరళకు చెందిన కింగ్స్ ఇన్ ఫ్రా నేరుగా ఇక్కడ చేపలు, రొయ్యల ఉత్పత్తిని ప్రారంభిస్తుంది. ఈ పరిశ్రమకు అనుబంధంగా చిన్న వ్యాపారాలు, పునరుత్పాదక వెంచర్లు ఏర్పాటయ్యే అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా సుమారు రూ.2 వేల కోట్ల పెట్టుబడితో అక్వా పార్కు అభివృద్ధి జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

ఈ ప్రాజెక్టులో హేచరీలు, ఇండోర్ ఫార్మింగ్, ప్రాసెసింగ్ ఉంటాయి. విశాఖపట్నం నుంచి కృతిమమేథ ద్వారా అక్వా పార్కును నియంత్రిస్తారని అంటున్నారు. అంతేకాకుండా ఐదేళ్లలో ఐదు వేల మంది అక్వా కల్చర్ నిపుణులకు ఈ సంస్థ శిక్షణ ఇవ్వనుంది. ఏడాది పొడవునా ఉత్పత్తి చేయడం వల్ల మత్స్యకారులకు ఉపాధి లభించడంతోపాటు సముద్ర వేట ద్వారా వారు ప్రాణాపాయాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉండదని అంటున్నారు. మరోవైపు రొయ్యలు, చేపలు ఇతర సీఫుడ్ ఎగుమతి ద్వారా రాష్ట్రానికి గణనీయమైన ఆదాయం లభిస్తుందని ఆశిస్తున్నారు.

ప్రస్తుతం ఎంవోయూ కుదిరినందున శ్రీకాకుళం జిల్లాలో తగిన భూమిన ఎంపిక చేయాలని కలెక్టర్ కు ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. గత మే నెలలో మత్స్యకారుల భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం చేసింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై.. మత్స్యకారులకు శాశ్వత ఉపాధి కల్పించడంతోపాటు మత్స్య సంపద పెంపకంలో వారిని నిపుణులుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అలా ఆయన చెప్పిన ఐదు నెలలకే కింగ్స్ ఇన్ ఫ్రా ప్రాజెక్టును శ్రీకాకుళం తేవడంపై మత్స్యకారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.