రైలులో ఫుడ్ క్వాలిటీపై సీరియస్.. బిర్యానీలో ఈగ కేసులో రూ.లక్ష ఫైన్!
ట్రైన్‌లో ప్రయాణిస్తున్న సదరు వ్యక్తి భోజనం కోసం వెజ్ బిర్యానీ కాంబో ఆర్డర్ చేశారు.
By: Madhu Reddy | 25 Jun 2026 4:00 PM ISTరైలు ప్రయాణంలో వేడివేడి బిర్యానీ ఆర్డర్ చేసుకుని, ముద్ద నోట్లో పెట్టుకునే లోపు అందులో ఒక చచ్చిన ఈగ కనిపిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి చేదు అనుభవమే ప్రతిష్టాత్మక అహ్మదాబాద్-ముంబై తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఒక ప్రయాణికుడికి ఎదురైంది. లగ్జరీ ప్రయాణానికి, నాణ్యమైన సేవలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ రైలులో వడ్డించిన వెజ్ బిర్యానీ కాంబో మీల్‌లో ఈగ రావడంతో ప్రయాణికుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఆహార భద్రతా లోపాన్ని ఐఆర్‌సీటీసీ చాలా సీరియస్‌గా తీసుకుంది.
ప్రయాణికుడి కంప్లైంట్.. క్షమాపణలు చెప్పిన స్టాఫ్:
ట్రైన్‌లో ప్రయాణిస్తున్న సదరు వ్యక్తి భోజనం కోసం వెజ్ బిర్యానీ కాంబో ఆర్డర్ చేశారు. అయితే, అందులో ఈగ కనిపించడంతో పాటు ఫుడ్ క్వాలిటీ కూడా చాలా వరస్ట్‌గా ఉందంటూ వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇకవిషయం తెలుసుకున్న ట్రైన్ కెప్టెన్, ఆన్‌బోర్డ్ క్యాటరింగ్ మేనేజర్ వెంటనే ప్రయాణికుడి వద్దకు వెళ్లి జరిగిన ఇబ్బందికి క్షమాపణలు చెప్పారు. వెంటనే ప్రత్యామ్నాయంగా వేరే కొత్త ఫుడ్ ప్లేట్‌ను ఆఫర్ చేసినప్పటికీ, సదరు ప్రయాణికుడు దాన్ని తినేందుకు నిరాకరించారు.
లక్ష రూపాయల జరిమానా.. లైసెన్స్ రద్దుకు నోటీస్:
ఫుడ్ క్వాలిటీ మరియు హైజీన్ విషయంలో అస్సలు రాజీ పడేది లేదని స్పష్టం చేస్తూ, ఈ భోజనాన్ని సరఫరా చేసిన 'అర్హ హాస్పిటాలిటీ' క్యాటరింగ్ సంస్థపై IRCTC కఠిన చర్యలు తీసుకుంది. ఇక సదరు వెండర్‌కు ఏకంగా రూ. 1 లక్ష భారీ జరిమానా విధించింది. అంతటితో వదలకుండా, ప్రయాణికుల ఆరోగ్యంతో ఆటలాడినందుకు ఆ సంస్థ క్యాటరింగ్ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ 'షోకాజ్' నోటీసు కూడా జారీ చేసింది.
క్వాలిటీ పెంచాలంటూ కఠిన ఆదేశాలు:
ఈ ఘటన తర్వాత రైల్వే నెట్‌వర్క్‌లోని క్యాటరింగ్ సిబ్బందికి IRCTC పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై కేవలం తాజా, నాణ్యమైన ముడిసరుకులను మాత్రమే వాడాలని హెచ్చరించింది. బియ్యం, పప్పులు, మసాలా దినుసులు నిల్వ ఉంచే కంటైనర్లు గాలి చొరబడకుండా కరెక్ట్‌గా ఉన్నాయో లేదో ప్రతిరోజూ తనిఖీ చేయాలని, వంటగదిలో పరిశుభ్రత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.
రైల్వేల్లో రోజుకు సగటున 16 లక్షల మందికి పైగా భోజనాలు అందుతుంటాయి. ఇంతటి భారీ వ్యవస్థలో ప్రయాణికుల ఆరోగ్యం, భద్రతతో ఆడుకునే వెండర్లపై ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకోవడం నిజంగా మంచి పరిణామం. ఈ రూ. లక్ష ఫైన్ దెబ్బతో అయినా మిగతా క్యాటరింగ్ సంస్థలు ఇకపై నాణ్యమైన, శుభ్రమైన ఆహారాన్ని అందిస్తాయని ఆశిద్దాం. ప్రయాణికులు కూడా ఇలాంటి లోపాలు జరిగినప్పుడు వెనకాడకుండా కంప్లైంట్ చేయడం చాలా అవసరం.
