వయసుతో పాటు ఆలోచనలు తుప్పు పడతాయా?
కళా ప్రపంచంలో సృజనాత్మకత అనేది నిర్దిష్టమైన సరిహద్దులు లేని మహా సముద్రం.
By: Srikanth Kontham | 11 Oct 2026 8:00 AM ISTకళా ప్రపంచంలో సృజనాత్మకత అనేది నిర్దిష్టమైన సరిహద్దులు లేని మహా సముద్రం. అయితే ప్రతీ రచయిత, దర్శకుడి మనసులో ఏదో ఒక సందర్భంలో మెదిలే అతిపెద్ద ప్రశ్న `నా ఆలోచనలు వయసుతో పాటు తుప్పు పట్టిపోతాయా? ఏ వయసు దాటితే కొత్తగా ఆలోచించే శక్తి తగ్గుతుంది? అని. సాధారణంగా శారీరక శక్తి వయసుతో పాటు క్షీణిస్తుందనేది నిజమే కానీ సృజనాత్మక ఆలోచనలకు కూడా వయోపరిమితి ఉందా? అన్న అంశంపై ప్రపంచవ్యాప్తంగా అనేక మానసిక, సామాజిక అధ్యయనాలు జరిగాయి.
కొన్ని మానసిక శాస్త్ర అధ్యయనాల ప్రకారం దర్శక, రచయితల్లో సృజనాత్మక ఆలోచనల తీవ్రత సాధారణంగా 35 నుండి 45 సంవత్సరాల వయస్సు మధ్య గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. ఈ వయసులో ఊహాశక్తి, ఉత్సాహం ప్రపంచాన్ని చూసే కొత్త కోణం చాలా బలంగా ఉంటాయి. 50 ఏళ్లు దాటిన తర్వాత కొత్త తరహా ప్రయోగాలు చేయడం లేదా ట్రెండ్‌కి తగ్గట్టుగా ఆలోచించడం కొంత మందగిస్తుందని పరిశోధకులు చెబుతుంటారు. మారుతున్న సామాజిక మార్పులు, యువత ఆలోచనా ధోరణిని అందుకోవడంలో కొంత వ్యత్యాసం రావడం వల్ల క్రియేటివిటీ తగ్గిందనే భావన కలుగుతుంది.
సైన్స్ కోణంలో చూస్తే మెదడులోని నూతన ఆలోచనలను ఉత్పత్తి చేసే నరాల వ్యవస్థ వయసు పెరిగే కొద్దీ కొంత మందగిస్తుంది. యువ వయసులో లభించే ఉత్సాహం, రిస్క్ తీసుకునే నైజం 50–60 ఏళ్ల వయసు దాటాక తగ్గుముఖం పడతాయి. కొత్త సాంకేతికత, ఆధునిక సంస్కృతికి అనుగుణంగా కథలను మలచడంలో పాత తరం రచయితలు, దర్శకులు కొంత వెనుకబడే అవకాశం ఉంటుంది. దీనివల్ల వారు తమ పాత విజయవంతమైన ఫార్ములాలనే మళ్లీ మళ్లీ ఉపయోగించడానికి ప్రయత్నిస్తుంటారు. దాంతో వారి క్రియేటివిటీ తగ్గినట్లు కనిపిస్తుంది.
అయితే క్రియేటివిటీ తగ్గుతుందా లేదా అనేది వారు అనుసరించే శైలిపై కూడా ఆధారపడి ఉంటుంది. పరిశోధకులు సృష్టికర్తలను రెండు రకాలుగా విభజిస్తారు. `కాన్సెప్చువల్, `ఎక్స్‌పెరిమెంటల్`. కాన్సెప్చువల్ సృష్టికర్తలు చిన్న వయసులోనే (30-40 ఏళ్లలోనే) విప్లవాత్మక ఆలోచనలతో అద్భుతాలు సృష్టిస్తారు. కానీ ఎక్స్‌పెరిమెంటల్ సృష్టికర్తలు వయసు పెరిగే కొద్దీ జీవిత అనుభవాల ద్వారా పరిణతి చెంది 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా అద్భుతమైన రచనలు, చిత్రాలను అందిస్తారు.
ప్రపంచ సినిమా , సాహిత్య చరిత్రను పరిశీలిస్తే వయసు అనేది సృజనాత్మకతకు అడ్డంకి కాదని నిరూపించిన మహనీయులు ఎందరో ఉన్నారు. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు మార్టిన్ స్కోర్సెసే, ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్, తెలుగులో కె. విశ్వనాథ్, బాపు, సింగీతం శ్రీనివాసరావు వంటి వారు 60, 70 ఏళ్ల వయసులో కూడా ఆల్-టైమ్ క్లాసిక్ చిత్రాలను తెరకెక్కించారు. అనుభవం ఇచ్చే స్పష్టత, భావోద్వేగాల లోతు వయసు పెరిగే కొద్దీ మరింత పెరుగుతాయి. కాబట్టి కొత్త ఆలోచనల వేగం తగ్గినా? ఆలోచనలోని నాణ్యత , లోతు పెరుగుతాయి.
చివరిగా ఏ నిర్దిష్ట వయసు దాటితే క్రియేటివిటీ పూర్తిగా తగ్గిపోతుంది అని ఖచ్చితమైన గీత గీయలేము. 50 లేదా 60 ఏళ్లు దాటిన తర్వాత కొత్త ఆలోచనల వేగం కొంత తగ్గినప్పటికీ దానికి ప్రతిగా దశాబ్దాల జీవిత అనుభవం, ఆలోచనా పరిణతి లభిస్తాయి. మారుతున్న కాలాన్ని అర్థం చేసుకుంటూ నిరంతరం నేర్చుకునే తత్వం ఉన్నంత కాలం దర్శకులు, రచయితలలో సృజనాత్మకత ఎప్పటికీ క్షీణించదు. అది కేవలం కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది అంతే!R
