Begin typing your search above and press return to search.

ఆంటీ అంటే యాంటీ...ఏజ్ షేమింగ్ అంటూ !

ఇపుడు కొత్తగా ఏజ్ షేమింగ్ అన్నది కూడా ఆ జాబితాలో చేరే రోజు దూరంలో లేదని అంటున్నారు.

By:  Satya P   |   11 April 2026 9:33 AM IST
ఆంటీ అంటే యాంటీ...ఏజ్ షేమింగ్ అంటూ !
X

తెలుగు వారికి అందమైన బంధాలు ఉన్నాయి. అత్త, మామ పిన్ని బాబాయ్ ఇలా ఉన్న రిలేషన్స్ కి ఇంగ్లీష్ లో మాత్రం ఒక్కటే భాష. ఒక్కటే వాడకం. అవును తెలుగు 56 అక్షరాలు అయితే ఆంగ్లేయుల భాషలో బొత్తిగా 26 లెటర్లే ఉన్నాయి. ఈ కక్కుర్తితో రిలేషన్స్ కి కూడా కుంచించుకొని అందరికీ ఒకే పిలుపుతో వారు అలవాటు చేసుకున్నారు చదువులు ఎక్కువై కల్చర్ అనుకుంటూ మనవాళ్ళు కూడా అదే ఫాలో అవుతున్నారు. గతంలో లేని ఈ కల్చర్ ఇపుడు ఎక్కువ అవుతోంది. దాంతో మధ్య వయస్కులు అంతా తెగ ఫీల్ అవుతున్నారు.

ఎన్టీఆర్ అన్న అయ్యారు :

గతంలో చూస్తే ఆరు పదుల వయసు ఉన్న ఎన్టీఆర్ అన్న అయ్యారు. అలాగే మమతా బెనర్జీ వంటి వారు అక్క అయ్యారు. కానీ ఇపుడు చూస్తే ఆ తీరు లేదు, కాస్తా పెద్ద అనిపిస్తే చాలు ఏకంగా అంకుల్ ఆంటీ అనేస్తున్నారు. వారు ఎవరో తెలియదు, ఎపుడూ చూసి ఉండరు, బస్సులలో రైళ్ళలో సినిమా హాళ్ళలో పక్కన కూర్చుని మరీ ఈ విధంగా తమకు తెలిసిన ఈ న్యూ కల్చర్ ని ఇలా పిలుపులతో ఇబ్బంది పెడుతున్నారు. తమ కంటే ఏడాది పెద్ద ఉన్నా సరే ఆంటీ అయిపోతుంది అమ్మాయి. పెళ్ళి అయితే చాలు ఇక ఆంటీయే. అలాగే ముప్పయి దాటితే చాలు మగవారు అంకుల్ అయిపోతున్నాడు. దాంతో ఆఫీసులలో బయట ఎక్కడ చూసినా ఈ అంటుగట్టిన పిలుపుని వంటబట్టించుకోవడం బహు కష్టంగా ఉందని వగచి వాపోతున్న జనాభా తడిసి మోపెడుగా ఉంది. అయినా ఆంటీ అంకుల్ పిలుపు ఆగదే. వెతికి వెంటాడుతోందే అన్నదే అధిక శాతం మంది బాధ.

కార్పొరేట్ పైత్యం :

మిలీనియం ముందు దాకా చూస్తే పెద్ద వారిని అన్నయ్య అక్కయ్య అని పిలిచే వారు. 2000 తరువాత జనరేషన్ బొత్తిగా కార్పోరేట్ పైత్యంతో జనంలోకి వచ్చారు వారికి ఈ పిలుపులు చాలా లైట్ గా ఉంటున్నాయి. టేకిట్ ఈజీ యార్ అంటున్నారు. కానీ తీసుకునే వారికి కదా ఆ బాధ తెలుస్తుంది. ఈ రోజులలో మూడు కాదు నాలుగు పదులు అయినా పెళ్ళి కావడం లేదు, పైగా కాస్త జుట్టు తగ్గినా బట్ట తల వచ్చినా పొట్ట కనిపించినా వయసుతో సంబంధం లేకుండా అంకుల్ అని ఈ కుర్రకారు పిలిచేస్తున్నారు. దాంతో పలకలేక మూగ వేదన అనుభవించడం చెప్పాలంటే ఎవరికి వారిదే బాధగా ఉంటోంది అంటున్నారు.

అది వరసేనా :

వరసలు లేవు, పద్ధతులు తెలియవు. అత్తకు పిన్నికి తేడా అసలు తెలియదు, మామయ్య బాబాయ్ ల మధ్య ఉన్న తేడా ఏమిటో చెప్పినా అర్థం కాదు, ఏమి చెప్పినా వాట్ అంటూ తెల్ల ముఖం వేయడమే ఈ జనరేషన్ కి తెలుసు. ఎందుకంటే తెల్లవారి భాష నోటి నిండా పుచ్చుకుని పుక్కిలించి వదిలేసే తరం బయల్దేరింది కాబట్టి మ్యాటర్ ఇలాగే ఉంటుంది అని అంటున్నారు. ఇక మనకు ముందు నుంచి ఒక సామెత ఉంది ఆడవారి వయసు మగవారి జీతం అడగరాదు, అందులో మర్మం ఏంటి అంటే ఆడవారు తమ వయసు గురించి అంతలా ఆలోచిస్తారు అని అర్థం. అలాంటి లేడీస్ ని మిడిల్ ఏజ్ కూడా రాని వారిని పట్టుకుని పుసుక్కున ఆంటీ అనేస్తే వారి వేదన అరణ్య రోదన ఎవరికి అర్థం అవుతుంది మరి.

ఎందుకు పిలవాలీ అంటూ :

చాలా మంది అయితే ఇపుడిపుడే రివర్స్ అవుతున్నారు. ఎటాక్ చేస్తున్నారు కూడా ఆంటీ అంటే ఏమిటి ఆ పిలుపు అని కళ్ళు ఎర్రగా చేసి ఎదురు ప్రశ్నిస్తున్నారు. అయితే అలా ఆగ్రహం ఎందుకు చూపిస్తున్నారో అర్ధం చేసుకునే తెలివి బొత్తిగా ఈ కార్పోరేట్ సిటీ కల్చర్ కి లేదంటే లేదు. పైగా సీరియస్ అవుతారెందుకు అని రెట్టిస్తారు, ఆ మీదట వివాదం ముదురుతుంది, చూసిన వారికి ఎబ్బెట్టుగా ఉంటుంది.

కచ్చితంగా ఏజ్ షేమింగ్ :

దాంతో ఆంటీ అంకుల్ అన్నది చివరికి ఎంతదాకా వెళ్తోంది అంటే ఏజ్ షేమింగ్ దాకా అని అంటున్నారు.బాడీ షేమింగ్ అన్నది నేరంగా గుర్తిస్తున్నారు. ఇపుడు కొత్తగా ఏజ్ షేమింగ్ అన్నది కూడా ఆ జాబితాలో చేరే రోజు దూరంలో లేదని అంటున్నారు. వయసుని ప్రభావితం చేసేలా ఈ ఆంటీ అంకుల్స్ పిలుపులతో ఇబ్బంది పెడితే మాత్రం చిక్కుల్లో పడే రోజు వస్తుందని అంటున్నారు. బ్రిటన్ లో ఒక భారతీయ మూలాలు ఉన్న మహిళ ఆంటీ అన్న పిలుపు మీద విసిగి వేసారి ఏకంగా కోర్టుకెక్కింది. ఆ విధంగా పిలిచిన మహిళ మీద కేసు పెట్టేసింది. తన మనోభావాల మీద దెబ్బ తీసేలా ఆ పిలుపు ఉందని ఆమె కోర్టుకు చెప్పుకుంది.

భారత దేశంలో కూడా :

దాంతో కోర్టు కూడా సదరు మహిళ వాదనతో అంగీకరించి ఆంటీ అని పిలిచిన వారికి ఒక లక్షా 76 వేల వరకూ భారీ జరీమానా విధించింది. ఈ తీర్పుని చూసిన తరువాత భారత దేశంలో కూడా వస్తే బాగుండునని అంటున్నారు. అనడమే కాదు ఏదో రోజున వచ్చేలా చూస్తారు కూడా. అందుకే ఎవరి మనోభావాలను దెబ్బ తీసే హక్కు మరొకరికి లేదు అన్నది గ్రహించి ఆంటీ అంకుల్ పిలుపులు ఈ జనరేషన్ తగ్గిస్తే మంచిది. వీలైతే ఏమండి అని పిలిస్తే గౌరవంగా ఉంటుంది. అదన్న మాట మ్యాటర్.