ఈ చెట్టు ముందు బంగారం జుజుబి.. కేజీ అక్షరాల రూ.కోటి!
తాజాగా షాంఘైలో జరిగిన వేలంలో 2 కేజీల క్యారా కలప ఏకంగా రూ.154 కోట్లకు అమ్ముడై అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
By: Garuda Media | 12 Feb 2026 1:00 PM ISTసిత్రాలకు నెలవు ప్రకృతి. శోధించే కొద్దీ వెలుగు చూసే విషయాల్ని చూసి అచ్చెరువు పొందాల్సిందే. భూమిలోపల నుంచి ఎంతో ప్రాసెస్ చేస్తే కానీ బయటకు రాని బంగారానికి ఎంతటి విలువ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. విలువలో చూసినప్పుడు ఆ బంగారం సైతం వెలవెలబోయేలా చేస్తుంది ఒక చెట్టు. దీని విలువ గురించి తెలిస్తే నోటి వెంట మాట రాదంతే. ఎందుకలా? దాని విలువకు కారణం ఏమిటి? ఈ చెట్లు ఎక్కడ ఎక్కువగా లభిస్తాయి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చెట్టుగా దీన్ని చెబుతారు. ఈ చెట్టు ధర కేజీ అక్షరాల రూ.కోటి. ఇంతకూ దీని పేరేమిటి అంటారా? అక్కడికే వస్తున్నాం. అగర్వుడ్.
ఆగ్నేయాసియాలో పెరిగే అక్విలేరియా జాతి చెట్లలో అరుదుగా ఏర్పడే ఈ కలపకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. అందుకే.. కేజీ రూ.కోటి పలికే పరిస్థితి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సహజ వనరుల్లో ఒకటిగా దీన్ని చెబుతారు. మిగిలిన చెట్ల మాదిరి ఈ చెట్టు ఉండదు. సాధారణంగా ఈ చెట్లు వాసన లేని తెల్ల కలపతో ఉంటాయి. మేజిక్ ఏమంటే.. ఒక ప్రత్యేకమైన ఫంగస్ సోకినప్పుడు లేదంటే చెట్టుకు ఏదైనా గాయం తగిలినప్పుడు అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంటుంది.
అదేమంటే.. ఈ చెట్టు తనను తాను రక్షించుకోవటం కోసం ముదురుగా ఉండే జిగట లాంటి రసాన్ని విడుదల చేస్తుంది. ఆ రసమే కాలక్రమంలో అద్భుతమైన.. అరుదైన సహజ సువాసన కలిగిన నల్ల అగర్వుడ్ గా మారుతుంది. అలా అని అక్విలేరియా చెట్టు అగర్వుడ్ ను ఉత్పత్తి చేయవు. మొత్తం చెట్లలో 2 నుంచి 7 శాతం చెట్లలో మాత్రమే ఈ ప్రక్రియ చోటు చేసుకుంటుంది. అయితే.. ఇదంతా నెలకో.. ఏడాదికో జరిగిపోదు. తక్కువలో తక్కువ అంటే పదేళ్ల నుంచి ముప్పై ఏళ్ల పాటు వెయిట్ చేస్తే కానీ ఫలితం ఉండదు. ఈ అరుదైన.. సుదీర్ఘమైన ప్రక్రియ కారణంగానే అగర్వుడ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కలపగా గుర్తింపు పొందింది.
ఇందులోనూ అత్యంత నాణ్యమైన రకాన్ని క్యారాగా పిలుస్తారు. దీని ధర గ్రాముకు రూ.8.5 లక్షల వరకు ఉంటుంది. తాజాగా షాంఘైలో జరిగిన వేలంలో 2 కేజీల క్యారా కలప ఏకంగా రూ.154 కోట్లకు అమ్ముడై అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకూ దీన్ని ఎందుకు వినియోగిస్తారు? ఇంత విలువ ఎందుకు? అంటే.. ఖరీదైన పెర్ఫ్యూమ్ తయారీకి ఎక్కువగా వినియోగిస్తారు.
దుబాయ్.. పారిస్ లాంటి నగరాల్లో విలాసవంతమైన పెర్ ఫ్యూమ్స్ కు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అంతేకాదు.. హిందూ.. ఇస్లాం.. బౌద్ద మతపరమైన ఆచారాల్లో అగర్వుడ్ ధూపానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. దాని సువాసన మనసుకుప్రశాంతతను ఇస్తుందని నమ్ముతారు. ఆయుర్వేద వైద్యంలోనూ దీన్ని వాడతారు. ఒత్తిడి.. నిద్రలేమి సమస్యలకు అద్భుతమైన పరిష్కారంగా దీన్ని చెబుతారు. మన దేశంలో అసోం రాష్ట్రంలో ఈ చెట్లు ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా ఈ చెట్లు తగ్గిపోతున్నాయి.
