Begin typing your search above and press return to search.

దేశంలోనే ధనిక పార్టీ బీఆర్ఎస్.. తాజా పరిస్థితి ఏంటంటే?

అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారుతోందా? రాజకీయంగా ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, విరాళాల విషయంలో బీఆర్ఎస్ వెనకబడినట్లు తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి

By:  Tupaki Political Desk   |   28 Oct 2025 4:00 PM IST
దేశంలోనే ధనిక పార్టీ బీఆర్ఎస్.. తాజా పరిస్థితి ఏంటంటే?
X

అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారుతోందా? రాజకీయంగా ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, విరాళాల విషయంలో బీఆర్ఎస్ వెనకబడినట్లు తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఒకప్పుడు దేశంలోని ప్రాంతీయ పార్టీలు అన్నింటిలోకెల్లా ధనిక పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న బీఆర్ఎస్.. ఈ ఆర్థిక సంవత్సరంలో విరాళాల సేకరణలో చూపిన లెక్కలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

బీఆర్ఎస్ అధికారంలో ఉండగా, 2023లో దాదాపు రూ.580 కోట్లు విరాళంగా వచ్చినట్లు ఆ పార్టీ ఎన్నికల కమిషన్ కు సమర్పించిన నివేదికలో తెలిపింది. ఇక తాజాగా ఆ పార్టీకి కేవలం రూ.15 కోట్లు మాత్రమే సమకూరాయని మరో నివేదికలో తెలియజేసింది. ఒక పార్టీకి రెండేళ్ల వ్యవధి వచ్చిన విరాళాలు 97 శాతం తగ్గిపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో భారీగా విరాళాలు అందాయని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీకి విరాళాలు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఈ లెక్కలు తెలియజేస్తున్నాయని అంటున్నారు.

బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో విరాళాల రూపంలో రూ.15 కోట్లు అంటే ఇటీవల కాలంలో చాలా తక్కువగానే చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పదేళ్లు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ చివరి మూడు సంవత్సరాలు భారీగా విరాళాలు సేకరించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.193 కోట్లు, 2022-23లో రూ.154 కోట్లు, 2023-24లో రూ.580 కోట్లు విరాళంగా వచ్చిట్లు బీఆర్ఎస్ స్వయంగా వెల్లడించింది.

ఇక గత పార్లమెంటు ఎన్నికల ముందు రూ.1,519 కోట్ల బ్యాంకు బ్యాలెన్సుతో తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనిక పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ఆ ఎన్నికల్లో సుమారు రూ.120 కోట్లు ఖర్చు చేసింది. ఎన్నికలు అయ్యాక బీఆర్ఎస్ అకౌంటులో రూ.1,449 కోట్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ తెలియజేసింది. అయితే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కు గత మూడేళ్లతో పోల్చుకుంటే విరాళాల సేకరణలో బాగా వెనకబడినట్లు తాజా లెక్కలు తెలియజేస్తున్నాయి. దాదాపు 97 శాతం మేర విరాళాలు తగ్గిపోవడం చర్చకు దారితీస్తోంది.