Begin typing your search above and press return to search.

4 తరాల నిరీక్షణకి తెర.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వీడియో!

200 ఏళ్ల తర్వాత తమ వంశంలో పుట్టిన పాపాయికి ఘనంగా స్వాగతం పలుకుతూ ఆ కుటుంబం ఊరంతా చేసిన సంబరాల గురించిన ఆసక్తికర విషయాలు ఇక్కడ చూద్దాం.

By:  Madhu Reddy   |   3 Sept 2026 11:38 AM IST
4 తరాల నిరీక్షణకి తెర.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వీడియో!
X

ఒక ఇంట్లో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి అడుగుపెట్టిందని సంబరపడతారు. అలాంటిది రెండు శతాబ్దాలుగా, అంటే దాదాపు నాలుగు తరాలుగా ఒక్క ఆడపిల్ల కూడా పుట్టని కుటుంబంలో ఒక పాప జన్మిస్తే.. ఆ సంతోషం ఎలా ఉంటుందో ఊహించండి! మహారాష్ట్రలోని పార్లీకి చెందిన దహిఫలే కుటుంబంలో సరిగ్గా ఇదే జరిగింది. 200 ఏళ్ల తర్వాత తమ వంశంలో పుట్టిన పాపాయికి ఘనంగా స్వాగతం పలుకుతూ ఆ కుటుంబం ఊరంతా చేసిన సంబరాల గురించిన ఆసక్తికర విషయాలు ఇక్కడ చూద్దాం.

200 ఏళ్ల నిరీక్షణకు దక్కిన ప్రతిఫలం:

మహారాష్ట్రలోని పార్లీ గ్రామానికి చెందిన దహిఫలే కుటుంబంలో గత నాలుగు తరాలుగా కేవలం మగపిల్లలే జన్మిస్తూ వచ్చారు. ఆడపిల్ల కళ్ల చూడాలని ఆ కుటుంబ సభ్యులు దశాబ్దాలుగా నిరీక్షించారు. ఎట్టకేలకు 200 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఆ ఇంట్లో ఒక చిన్నారి ఆడపాప జన్మించింది. ఇక తమ ఇంటికి నిజమైన 'మహాలక్ష్మి' అడుగుపెట్టిందని భావించిన కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

రథంపై ఊరేగింపు.. డప్పుచప్పుళ్లతో స్వాగతం:

తమ ఇంట్లోకి లక్ష్మీదేవిలా వచ్చిన ఆ చిన్నారికి, తల్లికి సమాజంలో ఎవరూ ఇవ్వని రీతిలో రాజసం ఉప్పొంగేలా స్వాగతం చెప్పాలని కుటుంబం భావించింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత తల్లీకూతుళ్లను ఒక ప్రత్యేకంగా అలంకరించిన రథంలో కూర్చోబెట్టారు. ఇక ఊరంతా డప్పుచప్పుళ్లు, మంగళ వాయిద్యాలు, బాణసంచా కాల్పుల మధ్య ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లారు. ఈ దృశ్యం చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు.

పాపాయికి 'గార్గి'గా నామకరణం:

ఆడపిల్ల పుట్టిందన్న వార్త తెలియగానే ఊరి ప్రజలంతా వారింటికి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. దహిఫలే కుటుంబ సభ్యులు తమ సంతోషాన్ని ఊరందరితో పంచుకుంటూ తీపి పదార్థాలు పంచిపెట్టారు. ఇక ఆ పండంటి పాపాయికి 'గార్గి' అని ఎంతో ముద్దుగా పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ అరుదైన, సంతోషకరమైన ఘటన సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది.

ఆడపిల్ల పుడితే భారం అనుకునే ఈ రోజుల్లో, ఒక పాప జననాన్ని రెండు శతాబ్దాల కల నెరవేరిన వేడుకలా జరుపుకోవడం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఆడపిల్లల పట్ల సమాజంలో ఉన్న ఆలోచనా దృక్పథం మారాలని, ప్రతి ఆడపిల్ల జననం ఇలాగే ప్రతి ఇంట్లో ఒక పండగలా జరగాలని ఈ ఘటన మనకు చాటిచెబుతోంది. మొత్తానికి అయితే నాలుగు తరాల నిరీక్షణకు స్థిరపడడంతో ఆ కుటుంబ సభ్యులు చేసిన హంగామా అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోనే కాదు ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ గా మారుతోంది. ఆడపిల్ల భారం కాదు బాధ్యత అనే భావిస్తే కష్టమే ఉండదు కదా!.