ఆఫ్రికా అబ్బాయి నోట.. ఇండియా గొప్పతనం పాట.. లోకేష్ ట్వీట్ వైరల్
పాశ్చాత్య మీడియా ముఖ్యంగా యూరప్, అమెరికన్స్ ఇండియాలోని పేదరికాన్ని ఎలుగెత్తిచాటడానికి ముందు ఉంటారు.
By: A.N.Kumar | 26 Dec 2025 8:11 PM ISTపాశ్చాత్య మీడియా ముఖ్యంగా యూరప్, అమెరికన్స్ ఇండియాలోని పేదరికాన్ని ఎలుగెత్తిచాటడానికి ముందు ఉంటారు. ఇక్కడ ఆహార అలవాట్లపై గేలిచేస్తారు. హేళనగా పోస్టులు చేస్తారు. స్ట్రీట్ ఫుడ్ పై వెక్కిరింతలు చేస్తారు. కానీ ఇండియాలోని ఈ గొప్పతనం అందరికీ అర్థం కాదు. ఈ అభివృద్ధి చెందిన దేశాలు.. మన భారత సంస్కృతి సంప్రదాయాలపై ఎప్పుడూ పడి ఏడుస్తూనే ఉంటాయి. కానీ నిజమైన భారత ఎలా ఉందో చూసి మరీ ఒక్క పాటతో కీర్తించాడు ఓ ఆఫ్రికా బాలుడు. అతడి పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నారా లోకేష్ ట్వీట్ తో అదిప్పుడు చర్చనీయాంశైమంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో భారత్ పై ప్రతీకూల ప్రచారం చేసేవారు చాలా మంది కనిపిస్తుంటారు. మన స్ట్రీట్ ఫుడ్, రద్దీగా ఉండే రోడ్లు, పరిశుభ్రత , మన సంప్రదాయాలను తక్కువ చేసి చూపిస్తూ వీడియోలు చేయడం విదేశీయులకు ఒక ట్రెండ్ గా మారింది.
అయితే ఇండియా అంటే కేవలం నెగెటివిటీ మాత్రమే కాదు.. ఇక్కడ అపారమైన ప్రేమ, ఆత్మీయత, అద్భుతమైన సంస్కృతి ఉన్నాయని ఓ ఆఫ్రికా యువకుడు చాటి చెప్పాడు.
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో అబ్బాయి ఫిదా
ఆంధ్రప్రదేశ్ ను సందర్శించిన ఒక ఆఫ్రికా యువకుడు ఇక్కడ ప్రజల ఆదరణకు ముగ్దుడైపోయాడు. కొందరు పనిగట్టుకొని ఇండియాపై విషం చిమ్ముతున్న తరుణంలో ఆయన తన అనుభవాన్ని ఒక అందమైన పాట రూపంలో మలిచాడు. ఈ పాటలో ఆయన భారత దేశ గొప్పతనాన్ని ఇక్కడి ప్రజల ఆత్మీయతను కొనియాడారు. విదేశీయులు మన దేశాన్ని చూసి వెక్కించడం కాదు.. మన సంస్కృతిని గౌరవించాలని ఆయన ఈ వీడియో ద్వారా సందేశాన్ని ఇచ్చారు.
మంత్రి నారా లోకేష్ ప్రశంసలు
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీనిని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. మన రాష్ట్రానికి వచ్చిన అతిథి ఇలాంటి సానుకూల సందేశాన్ని ఇవ్వడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. ‘భారతదేశంపై విషం చిమ్మే వారికి ఈ వీడియో ఒక కనువిప్పు. మన సంస్కృతి మరియు ఆతిథ్యం ఎంత గొప్పవో ఈ ఆఫ్రికా సోదరుడు తన పాటతో నిరూపించారు’ అని పేర్కొన్నాడు.
ప్రపంచం మనల్ని ఎలా చూసినా.. మన దేశంలోని వైవిధ్యం, మానవత్వం ఎప్పుడూ గొప్పవే అని ఇలాంటి సంఘటనలు నిరూపిస్తుంటాయి. కేవలం లోపాలను మాత్రమే వెతికే వారికి, ఈ ఆఫ్రికా యువకుడి పాట ఒక బలమైన సమాధానంగా నిలిచింది.
