భారత్ పై పడి ఏడ్చినంత సేపు పట్టలేదుగా పాక్!
దీంతో... భారత్ పై పాక్ తన అక్కసు వెళ్లగక్కుకుంది. కట్ చేస్తే.. రిజల్ట్ రివర్స్ అయ్యింది! దీంతో పాక్ పై విమర్శలు మొదలయ్యాయి.
By: Raja Ch | 31 Oct 2025 11:45 AM ISTఇటీవల అఫ్గనిస్థాన్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే... టర్కీ, ఖతార్ మధ్యవర్తిత్వంతో కొన్ని రోజులు కాల్పుల విరమణ జరిగింది. అయితే బుదవారం టర్కీ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయని కథనాలొచ్చాయి. దీంతో... భారత్ పై పాక్ తన అక్కసు వెళ్లగక్కుకుంది. కట్ చేస్తే.. రిజల్ట్ రివర్స్ అయ్యింది! దీంతో పాక్ పై విమర్శలు మొదలయ్యాయి.
అవును... విషయం ఏదైనా, సందర్భం మరేదైనా, వేదిక ఇంకేదైనా.. నిత్యం భారత్ పై పడి ఏడ్వడం పాకిస్థాన్ కి బాగా అలవాటుగా మారిపోయిందనే చెప్పాలి. పైగా ఆఫ్గన్ తో భారత్ సంబంధాలు ఇటీవల మరింత బలంగా మారుతున్న విషయాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్న ఇస్లామాబాద్.. ఢిల్లీపై తన అక్కసు వెల్లగక్కుతుంది. ఈ సమయంలో టర్కీలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది.
బుధవారం ఫెయిల్ అయిన చర్చలు!:
సరిహద్దుల్లో కాల్పుల విరమణ, సీమాంతర ఉగ్రవాదం, మొదలైన అంశాలపై ఈ రెండు దేశాల మధ్య శనివారం టర్కీ వేదికగా చర్చలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఇవి విఫలమైనట్లు బుధవారం పాకిస్థాన్ ప్రకటించింది! ఈ సందర్భంగా స్పందించిన పాక్ సమాచార, ప్రసార శాఖ మంత్రి అతావుల్లా తరార్.. చర్చల్లో ఎలాంటి పరిష్కారమూ కనుగొనలేకపోయామని, అవి విఫలమయ్యాయని తెలిపారు.
వెంటనే భారత్ పై పడి ఏడుపు!:
అలా ఆఫ్గన్ తో చర్చలు విఫలమవ్వగానే భారత్ పై పడి ఏడ్వడం మొదలుపెట్టింది పాక్. ఇందులో భాగంగా... కాబూల్ లో తీగలను లాగుతూ, తోలుబొమ్మ ప్రదర్శన నిర్వహిస్తున్న వారిని ఢిల్లీ నియంత్రిస్తోందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అన్నారు. కాబుల్ తో ఒప్పందానికి దగ్గరవుతున్నప్పుడల్లా, కొందరు జోక్యం కారణంగా చర్చలు విఫలమవుతున్నాయని పరోక్షంగా భారత్ పై విమర్శలు చేశారు.
తాజాగా సక్సెస్ అయిన శాంతి చర్చలు!:
అయితే.. టర్కీ, ఖతార్ మధ్యవర్తిత్వంలో ఇస్తాంబుల్ లో జరిగిన తీవ్రమైన శాంతి చర్చల తర్వాత పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా అక్టోబర్ 18 - 19 మధ్య జరిగిన సీజ్ ఫైర్ ఒప్పందాన్ని కొనసాగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని టర్కీ ప్రకటించింది. తదుపరి చర్చలు నవంబర్ 6న జరగనున్నాయి. ఇవి ఈ ఒప్పందం అమలును ఖరారు చేయనున్నాయని అంటున్నారు.
ఇప్పుడు ఏమంటావ్ ఆసిఫ్..?:
పాకిస్థాన్ తో ఆఫ్గనిస్థాన్ శాంతి చర్చలు విఫలమవ్వడానికి భారత్ కారణమని చెబుతోన్న పాకిస్థాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ కు ఇప్పుడు భారత్ నుంచి కీలక ప్రశ్న ఎదురవుతోంది. ఇందులో భాగంగా... కాబూల్, ఇస్లామాబాద్ మధ్య చర్చలు ఫెయిల్ అవ్వడానికి ఢిల్లీ కారణమైతే... ఇప్పుడు చర్చలు సక్సెస్ అవ్వడానికి కూడా ఢిల్లీనే కారణం అని చెబుతారా అని ప్రశ్నిస్తున్నారు.
దేవుడు నోరిచ్చాడు కదా అని భారత్ పై నిత్యం అవాకులు చెవాకులు పేలడం మాని.. దేశాన్ని ఆర్థికంగా, పరిపాలనాపరంగా గాడిలో పెట్టడం.. సరిహద్దుల్లో శాంతి వాతావరణాన్ని నెలకొల్పడంపైనే దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.
పాక్ కు ఆఫ్గాన్ మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్!:
కాల్పుల విరమణ ఏర్పాటు చేయబడినప్పటికీ.. ఆఫ్గనిస్తాన్ అంతర్గత మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఇందులో భాగంగా... 'మా సహనాన్ని మళ్ళీ పరీక్షిస్తే.. మా ప్రతిస్పందన చాలా తీవ్రంగా ఉంటుంది' అని హక్కానీ పేర్కొన్నారు. ఇదే సమయంలో.. తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ)పై చర్య తీసుకోవాలన్న పాకిస్తాన్ డిమాండ్ పై స్పందించిన ఆయన... ఇది పాకిస్తాన్ అంతర్గత విషయం అని నొక్కి చెప్పారని తెలుస్తోంది.
