Begin typing your search above and press return to search.

మరో యుద్ధం మొదలైంది.. అఫ్ఘాన్ దెబ్బకు పాక్ సైన్యం కుదేలైందా?

డ్యురాండ్ సరిహద్దు వెంబడి పాక్-అఫ్ఘాన్ దళాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి.. తాలిబాన్ దళాలు ఆకస్మికంగా చేసిన దాడిలో 12 మంది పాక్ సైనికులు మృతి చెందినట్లు తెలుస్తోంది.

By:  A.N.Kumar   |   12 Oct 2025 9:43 AM IST
మరో యుద్ధం మొదలైంది.. అఫ్ఘాన్ దెబ్బకు పాక్ సైన్యం కుదేలైందా?
X

అఫ్ఘాన్-పాక్ సరిహద్దు వెంబడి పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. తాలిబాన్ ఆధీనంలోని అఫ్ఘాన్ దళాలు పాక్ ఆర్మీ పోస్టులపై దాడి జరపడంతో ఘర్షణలు తీవ్రతరం అయ్యాయి. ‘టోలో న్యూస్’ తెలిపిన వివరాల ప్రకారం, కూనార్ , హెల్మండ్ ప్రావిన్సుల పరిధిలో పాక్ సైన్యం ఏర్పాటు చేసిన రెండు ప్రధాన అవుట్‌పోస్టులు అఫ్ఘాన్ సైన్యం స్వాధీనం చేసుకుందని సమాచారం. ఈ దాడుల్లో పలు పాక్ సైనికులు మరణించగా, మరికొందరు గాయపడ్డారని విదేశీ మీడియా పేర్కొంటోంది.

* పాక్ పోస్టులపై దాడి – సైనికుల పరార్!

డ్యురాండ్ సరిహద్దు వెంబడి పాక్-అఫ్ఘాన్ దళాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి.. తాలిబాన్ దళాలు ఆకస్మికంగా చేసిన దాడిలో 12 మంది పాక్ సైనికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలు బహ్రమ్చా, షాక్జీ, బీబీజానీ, సలేహాన్ జిల్లాలలో చోటుచేసుకున్నాయి. పాక్ ఆర్మీ స్థావరాలను తాలిబాన్ దళాలు స్వాధీనం చేసుకున్నట్లు అఫ్ఘాన్ రక్షణ శాఖ ధృవీకరించింది.

* పాక్‌కు గట్టి బదులు

తమ గగనతలాన్ని పాక్ ఉల్లంఘించిందని ఆరోపించిన అఫ్ఘాన్ రక్షణ శాఖ ప్రతినిధి ఇనాయతుల్లా ఖొవరాజ్మీ మాట్లాడుతూ “మా భూభాగంలోకి పాక్ డ్రోన్లు, యుద్ధవిమానాలు ప్రవేశించడం మేము సహించమని హెచ్చరించాం. అయినప్పటికీ పాక్ క్రియాశీలత కొనసాగడంతో మేము ప్రతీకార దాడులు చేయాల్సి వచ్చింది” అని తెలిపారు. పాక్ దళాల వాహనాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు కూడా ప్రకటించారు.

* పాక్ స్పందన – ‘దీటుగా బదులిస్తాం’

అఫ్ఘాన్ దాడులను పాక్ తీవ్రంగా ఖండించింది. “అకారణంగా మా సరిహద్దులపై కాల్పులు జరిపారు. మా సైన్యం దీటుగా ప్రతిస్పందిస్తోంది” అని పాక్ భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో పాక్ సైనికులు తమ స్థావరాలు విడిచి పరారవుతున్న దృశ్యాలు కనిపించడం చర్చనీయాంశమైంది.

* అంతర్జాతీయ ఆందోళన

పాక్-అఫ్ఘాన్ సరిహద్దులో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొనడంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఖతర్‌ సహా అనేక దేశాలు ఇరు దేశాలు తక్షణమే సంభాషణలు ప్రారంభించాలని, సైనిక చర్యలతో సమస్యలు పరిష్కరించవద్దని సూచించాయి.

* పరిశీలన

కొన్ని రోజుల క్రితం పాక్‌ ఆర్మీ కాబూల్ సమీపంలో టీటీపీ ఉగ్రవాదులను టార్గెట్ చేస్తూ గగనతల దాడులు చేసింది. ఆ చర్యకు ప్రతీకారంగానే ఈ ఘర్షణలు చెలరేగినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాలిబాన్ అధికారం చేపట్టిన తర్వాత అఫ్ఘాన్-పాక్ సంబంధాలు సున్నితంగా మారాయి. ఇప్పుడు ఈ తాజా ఘర్షణలు ఇరు దేశాల మధ్య యుద్ధ మంటలు మరింత ఎగసే సూచనలున్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.