సిగ్గు సిగ్గు... పాకిస్థాన్ యుద్ధ ట్యాంకర్లను ఎత్తుకెళ్లిన అఫ్గానిస్థాన్!
అఫ్గాన్ భూభాగాన్ని ఉపయోగించుకుంటున్న తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులు.. పాకిస్థాన్ ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఇటీవల దాడులు చేశారు.
By: Raja Ch | 15 Oct 2025 6:04 PM ISTఅఫ్గానిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చగా, సరిహద్దు ప్రాంతాలు తుపాకులు, బాంబుల శబ్ధాలతో దద్దరిల్లుతున్నాయి. ఈ సమయంలో సరిహద్దుల్లో మొహరించిన పాకిస్థాన్ యుద్ధ ట్యాంకులను ఆఫ్హనిస్థాన్ సైనికులు స్వాధీనం చేసుకున్న దృశ్యాలు వైరల్ గా మారాయి.
అవును... ఆఫ్గాన్, పాక్ మధ్య యుద్ధం కాందహార్ సరిహద్దు ప్రాంతానికి చేరుకుంది. స్పిన్ బోల్డాక్ గేట్ వద్ద తాలిబన్, పాకిస్తాన్ దళాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ సమయంలో పాక్ సైనికులను ఆఫ్గాన్ సైన్యం చుట్టుముట్టడంతో.. పాక్ సైన్యం లొంగిపోయిందని అంటున్నారు. దీంతో వారిని సజీవంగా బంధించిన ఆఫ్గాన్ సైనికులు.. వారితో పాటు యుద్ధ ట్యాంకులను తమ దేశానికి తీసుకెళ్లారు.
ఈ సమయంలో పలు అవుట్ పోస్టులను తాలిబన్ లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో పాకిస్తాన్ పై విజయం సాధించామని తాలిబన్లు ప్రకటించుకోవడంతో ఆఫ్గన్లు విజయోత్సవాల్లో మునిగిపోయారు. మరోవైపు పాక్ కాల్పులు తమ పౌరులు 12 మంది చనిపోయారని ఆఫ్గన్ ప్రభుత్వం వెల్లడించగా... ఆఫ్గాన్ దాడుల్లో 10మందికి పైగా పాక్ సైనికులు మరణించారని తెలుస్తోంది.
స్పందించిన తాలిబాన్ ప్రభుత్వం!:
ఈ సందర్భంగా పాకిస్థాన్ దళాలు ఆఫ్తాన్ పై తేలికపాటి, భారీ ఆయుధాలను ప్రయోగించడంతో సరిహద్దు పోరాటాన్ని ప్రారంభించాయని.. ఈ దాడుల్లో 12 మంది పౌరులు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారని ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఆరోపించారు. ఈ సమయంలో ఆఫ్గాన్ దళాలు ఎదురు కాల్పులు జరిపాయని.. పెద్ద సంఖ్యలో పాక్ సైనికులను హతమార్చాయని.. ఆ దేశ యుద్ధ ట్యాంకులను స్వాధీనం చేసుకున్నాయని తెలిపారు.
ఏమిటీ పాక్ – ఆఫ్గన్ వివాదం?:
అఫ్గాన్ భూభాగాన్ని ఉపయోగించుకుంటున్న తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులు.. పాకిస్థాన్ ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఇటీవల దాడులు చేశారు. ఈ దాడుల్లో లెఫ్టినెంట్ కర్నల్, మేజర్ సహా 11 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. ఈ నేపథ్యంలో గత గురువారం అఫ్గాన్ రాజధాని కాబుల్ లో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ పేలుళ్లకు పాకిస్థాన్ కారణమని తాలిబన్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ క్రమంలో... శనివారం రాత్రి అఫ్గాన్ సైన్యం, పాకిస్థాన్ పై దాడులకు దిగింది. అక్కడ నుంచి ఇరు దేశాల సరిహద్దులు వేడెక్కిపోతున్నాయి!
