Begin typing your search above and press return to search.

ఆప్ఘనిస్తాన్‌తో దోస్తీ వెనుక వ్యూహమేంటి? భారత్‌ పర్యటన వెనుక రాజకీయం!

ఇన్నాళ్లుగా పాకిస్తాన్‌కు మిత్రదేశంగా ఉన్న ఆఫ్గానిస్తాన్‌ ఇప్పుడు తన వైఖరి మార్చుకోవడం, భారత్‌తో బంధం బలోపేతం చేసుకోవడానికి ఆసక్తి చూపడం ఆసియా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

By:  A.N.Kumar   |   14 Oct 2025 1:30 AM IST
ఆప్ఘనిస్తాన్‌తో దోస్తీ వెనుక వ్యూహమేంటి?  భారత్‌ పర్యటన వెనుక రాజకీయం!
X

ఇన్నాళ్లుగా పాకిస్తాన్‌కు మిత్రదేశంగా ఉన్న ఆఫ్గానిస్తాన్‌ ఇప్పుడు తన వైఖరి మార్చుకోవడం, భారత్‌తో బంధం బలోపేతం చేసుకోవడానికి ఆసక్తి చూపడం ఆసియా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఇటీవల తాలిబన్ విదేశాంగ మంత్రి భారత్‌ పర్యటన “భారత్‌ అంటే ప్రాణం ఇస్తాం” అంటూ తాలిబన్ వర్గాలు చేసిన ప్రకటనలు రెండు దేశాల సంబంధాలపై కొత్త ఊహాగానాలకు తెరలేపాయి. ఇది కేవలం మైత్రా? లేక సుదీర్ఘ వ్యూహాత్మక ఎత్తుగడలో భాగమా? అనేది చర్చనీయాంశంగా మారింది.

* భారత్‌ పెట్టుబడుల రక్షణే కీలకం!

గత రెండు దశాబ్దాల్లో భారత్‌ అఫ్గానిస్తాన్‌లో సుమారు $3 బిలియన్లకు పైగా భారీగా పెట్టుబడులు పెట్టింది. మౌలిక వసతులు, విద్య, ఆరోగ్యం, నీటి వనరుల అభివృద్ధి వంటి రంగాలకు భారత్‌ అండగా నిలిచింది. సల్మా డ్యామ్‌, జారంజ్‌–డెలారమ్‌ హైవే, ఆఫ్గాన్‌ పార్లమెంట్‌ భవనం వంటి కీలక ప్రాజెక్టులు ఆఫ్గాన్‌ నిర్మాణంలో భారత్‌ పాత్రను చాటుతున్నాయి.

తాలిబన్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ భారీ పెట్టుబడుల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో తాలిబన్‌తో కనీస అవగాహన కుదర్చుకోకపోతే ఈ పెట్టుబడులు, నిర్మాణాలు వృథా అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే, ఈ పెట్టుబడులను రక్షించుకోవడం భారత్‌కు తక్షణ ప్రాధాన్యతగా ఉంది.

* తాలిబన్ వైఖరిలో మార్పుకు కారణాలేంటి?

సాంప్రదాయకంగా భారత్‌పై శత్రుత్వ ధోరణిలో ఉన్న తాలిబన్‌ ఇటీవల తన వైఖరిని మార్చుకోవడం ఆసక్తికరమైన పరిణామం. చైనా, పాకిస్తాన్‌లతో బంధాలను కొనసాగిస్తూనే భారత్‌తో సానుకూల సంభాషణలు జరుపుతోంది. దీని వెనుక రెండు ప్రధాన కారణాలు ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు:

ప్రపంచ దేశాల నుంచి, ముఖ్యంగా భారత్‌ వంటి కీలక ప్రాంతీయ శక్తి నుంచి అంతర్జాతీయ గుర్తింపు పొందాలనే ప్రయత్నం. భారత్‌ సహకారంతో గతంలో ఆగిపోయిన వాణిజ్య మార్గాలు మరియు అభివృద్ధి ప్రాజెక్టులు తిరిగి ప్రారంభించాలన్న లక్ష్యం. అయితే, తాలిబన్ వైఖరిలో ఈ మార్పు నిజంగా అంతర్గత మార్పా? లేక కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసం తాత్కాలికంగా అనుసరిస్తున్న దౌత్య వ్యూహమా? అన్నది కాలమే నిర్ణయించాలి.

* భారత్‌కు దొరికే వ్యూహాత్మక అవకాశాలు

తాలిబన్‌తో సంబంధాలు మెరుగుపడటం భారత్‌కు అనేక వ్యూహాత్మక లాభాలను అందించే అవకాశం ఉంది. అఫ్గానిస్తాన్‌లోని తన కీలక ప్రాజెక్టులను కాపాడుకోవడం. మధ్య ఆసియా దేశాలతో వాణిజ్యాన్ని విస్తరించడానికి కీలకమైన అఫ్గానిస్తాన్ మార్గాన్ని తిరిగి ఉపయోగించుకునే అవకాశం.

*ఉగ్రవాద నియంత్రణ

అఫ్గాన్‌ను భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు వేదికగా ఉపయోగించకుండా నిరోధించే దౌత్యపరమైన అవకాశం. అయితే, ఈ దౌత్యంలో భారత్‌ మానవ హక్కులు, మహిళా స్వేచ్ఛ, విద్య వంటి అంశాలపై తన చిత్తశుద్ధిని, నిబద్ధతను కొనసాగించాల్సిన బాధ్యత ఉంది.

* ఆసియా శక్తిగా భారత్‌ పాత్ర బలోపేతం

తాలిబన్‌తో భారత్‌ సంభాషణ ప్రారంభించడం, ముఖ్యంగా ఆప్ఘనిస్తాన్‌లో చైనా-పాకిస్తాన్‌ కూటమి ప్రభావాన్ని తగ్గించేందుకు ఉద్దేశించిన వ్యూహాత్మక అడుగు కావొచ్చు. అలాగే, రష్యా, ఇరాన్, మధ్య ఆసియా దేశాల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ, ప్రాంతీయ రాజకీయాల్లో భారత్‌ తన స్థానం మరింత బలోపేతం చేసుకోవచ్చు.

ఆఫ్గాన్‌తో మైత్రి కేవలం ఒక దౌత్యపరమైన సంకేతం మాత్రమే కాదు. ఇది ఆసియా భౌగోళిక రాజకీయాల్లో భారత్‌ తన వ్యూహాత్మక స్థిరత్వాన్ని, ప్రాంతీయ శక్తిగా తన ప్రాభవాన్ని నిర్ధారించుకునే కీలక ప్రయత్నం. అయితే, వ్యూహాత్మక ప్రయోజనాలు, మానవ విలువల మధ్య సమతుల్యం సాధించడమే ప్రస్తుతం భారత విదేశాంగానికి అత్యంత క్లిష్టమైన పరీక్షగా మారింది.