Begin typing your search above and press return to search.

భారత్ నుంచి పాక్ కు తాలిబన్ మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్!

భారత్ లో తొలిసారిగా అఫ్గాన్‌ విదేశాంగ మంత్రి ముత్తాఖీ పర్యటిస్తున్నారు. ఈ సమయంలో పాకిస్థాన్‌ కు భారత్‌ నుంచి ముత్తాఖీ స్పష్టమైన సందేశాన్ని పంపించారు.

By:  Raja Ch   |   10 Oct 2025 7:29 PM IST
భారత్ నుంచి పాక్ కు తాలిబన్ మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్!
X

భారత్ లో తొలిసారిగా అఫ్గాన్‌ విదేశాంగ మంత్రి ముత్తాఖీ పర్యటిస్తున్నారు. ఈ సమయంలో పాకిస్థాన్‌ కు భారత్‌ నుంచి ముత్తాఖీ స్పష్టమైన సందేశాన్ని పంపించారు. ఇదే సమయంలో.. భారతదేశానికి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా... ఆఫ్ఘన్ గడ్డను ఏ దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించుకోవడానికి అనుమతించమని.. ఇది ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాక్ పై దాడిగా భావిస్తున్నామని తెలిపారు.

అవును... దేశ రాజధాని ఢిల్లీలో అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీతో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడిన ముత్తాఖీ.. అఫ్గాన్ లో అమెరికా బలగాలు మోహరించిన సమయంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కున్నామని.. అయితే, భారత్ కు వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదని అన్నారు.

కాబూల్‌ లోని తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఇస్లామాబాద్ సరిహద్దు దాడులను ప్రారంభించిన నేపథ్యంలో ఆఫాన్ నుంచి పాకిస్తాన్‌ కు ఈ కఠినమైన హెచ్చరిక రావడం గమనార్హం. ఈ నేపథ్యలోనే తమ భూభాగం నుంచి ఇతర దేశాలపై దాడులు నిర్వహించేందుకు ఏ దేశానికి కూడా అనుమతి ఇవ్వలేదని తెలిపారు.

భారత్ తమ క్లోజ్ ఫ్రెండ్!:

ఇదే సమయంలో... ఇటీవల అఫ్గానిస్థాన్ లో భూకంపం వచ్చినప్పుడు భారత్ అందించిన మానవతాసాయానికి కృతజ్ఞతలు తెలిపిన ఆ దేశ విదేశాంగ మంత్రి ముత్తాఖీ.. తాము ఆపదలో ఉన్నప్పుడు స్పందించిన తొలి దేశం భారత్ అని అన్నారు. ఈ నేపథ్యంలోనే... భారత్ ను తమ క్లోజ్ ఫ్రెండ్ గా భావిస్తున్నామని, ఇరు దేశాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.

ఆఫ్ఘాన్ తో ఆటలు మంచిది కాదు!:

ఇదే సమయంలో... సుదూర ప్రాంతాలలో సరిహద్దు దగ్గర దాడి జరిగిందని చెప్పిన ఆఫ్ఘాన్ మంత్రి.. పాకిస్తాన్ చర్యను తప్పుగా భావిస్తున్నామని తెలిపారు. 40 సంవత్సరాల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ శాంతి, పురోగతిని సాధించింది. ఈ సమయంలో.. ఆఫ్ఘన్ల ధైర్యాన్ని పరీక్షించకూడదు.. ఆఫ్ఘనిస్తాన్‌ తో ఆటలు ఆడటం మంచిది కాదని ముత్తాకి అన్నారు.

ఆఫ్ఘాన్ కోసం భారత్ ఎప్పుడూ ముందుంటుంది!:

ఈ సందర్భంగా స్పందించిన జై శంకర్.... పహల్గాం ఉగ్రదాడి, కునార్‌-నంగర్గహర్‌ భూకంపం.. ఈ రెండు సందర్భాల్లో ఇరు దేశాలు చర్చలు జరిపేందుకు అవకాశం లభించిందని తెలిపారు. సమీప పొరుగు దేశంగా అఫ్గాన్‌ ప్రజల శ్రేయోభిలాషిగా.. అభివృద్ధి, పురోగతికి భారత్‌ ఎప్పుడూ ఆసక్తి చూపుతుందని.. అఫ్గాన్‌ లో భారత్‌ చేపట్టిన అనేక ప్రాజెక్టుల పునరుద్ధరణకు మార్గం సుగమమైందని అన్నారు.

అదేవిధంగా... అటు కరోనా సమయంలోనూ, ఇటీవల భూకంపం సంభవించినప్పుడు ఆఫ్ఘాన్ కు అండగా నిలిచామని చెప్పిన జై శంకర్... అభివృద్ధి పట్ల ఇరు దేశాలకూ ఒకేరకమైన నిబద్ధత ఉన్నప్పటికీ.. రెండూ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాయని అన్నారు. కాబుల్ లో భారత ఎంబసీని తిరిగి ఓపెన్ చేయనున్నట్లు వెల్లడించారు.

అయితే.. ఈ సమావేశం జరుగుతున్న సమయంలోనే కాబుల్‌ లో పాకిస్థాన్‌ వాయుసేన దాడులు జరపడం గమనార్హం.