Begin typing your search above and press return to search.

భారత్ కంటే బలంగా ఆఫ్గన్ కరెన్సీ... కారణం తెలుసా?

గత కొన్ని రోజులుగా ఆఫ్గనిస్తాన్ రెగ్యులర్ గా గతంతో పోలిస్తే విభిన్న అంశాల్లో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది.

By:  Raja Ch   |   17 Oct 2025 1:00 AM IST
భారత్  కంటే బలంగా ఆఫ్గన్  కరెన్సీ... కారణం తెలుసా?
X

గత కొన్ని రోజులుగా ఆఫ్గనిస్తాన్ రెగ్యులర్ గా గతంతో పోలిస్తే విభిన్న అంశాల్లో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. సాధారణంగా యుద్ధాలు, తాలిబాన్ల పాలనలో విధానాలు, మొదలైన విషయాలతో వార్తల్లో నిలిచే ఆఫ్గనిస్తాన్.. ఇటీవల పాక్ సైన్యాన్ని వణికిస్తూ, అంతకంటే ముఖ్యగా భారత్ తో దోస్తీ కడుతూ అంతర్జాతీయ మీడియాలో ఆసక్తిగా మారింది. ఈ సమయంలో ఆ దేశ కరెన్సీ బలం ఆసక్తిగా మారింది.

అవును... ప్రపంచంలోని అత్యంత పేద, అస్థిర దేశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఆఫ్గనిస్తాన్.. ప్రస్తుతం తాలిబన్ల నేతృత్వంలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓ పక్క పాకిస్థాన్ తో సరిహద్దు ఘర్షణల్లో వరుసగా వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ నడుస్తోంది. ఏది ఏమైనా ఎంతో సంక్షోభంలో ఉన్న ఈ దేశం కరెన్సీ.. రూపాయి కంటే బలంగా ఉంది.

రూపాయి వర్సెస్ ఆఫ్గనీ!:

ఆఫ్గనిస్తాన్ కరెన్సీ ఆఫ్గనీ.. ఇప్పుడు భారతదేశ కరెన్సీ రూపాయి కంటే బలంగా ఉంది. తాజా నివేదికల ప్రకారం.. ఒక ఆఫ్గనీ 1.32 రూపాయిలతో సమానం. అంటే... ఆఫ్గన్ లో ఒక లక్ష సంపాదిస్తే అది భారత్ లో సుమారు రూ.1.32 లక్షలకు సమానం అన్నమాట. ప్రస్తుతం ఆఫ్గన్ దేశ ఆర్థిక పరిస్థితి గురించి తెలిసిన వారికి ఈ లెక్కలో తేడా ఆశ్చర్యం కలిగించే అవకాశాలు పుష్కలం!

తెరపైకి పలు కారణాలు!:

ఇలా భారత కరెన్సీ రూపాయి కంటే ఆఫ్గనిస్తాన్ కరెన్సీ ఆఫ్గనీ బలంగా ఉండటానికి పలు కారణాలున్నాయని అంటున్నారు నిపుణులు. ప్రధానంగా 2021లో రెండోసారి కాబుల్ ను చేజెక్కించుకుని ఆఫ్గన్ లో 2.0 పాలన ప్రారంభించిన తాలిబన్ల కఠినమైన కరెన్సీ విధానాలే ఇందుకు ప్రధాన కారణం అని చెబుతున్నారు. ఇందులో భాగంగా... ఇక్కడ అమెరికా డాలర్లు, పాకిస్థానీ రూపాయల వినియోగాన్ని నిషేధించారు.

తద్వారా విదేశీ కరెన్సీ డిమాండ్ ను బాగా తగ్గించారు. ఇదే సమయంలో... వారు మెజారిటీ లావాదేవీలు తమ ఆఫ్గనీ కరెన్సీలోనే జరగాలని నిబంధనలను కూడా విధించారు. పరిమిత దిగుమతులు, ఎగుమతులతో పాటు విదేశీ కరెన్సీ చెలామణిలో ఉండటంతో, స్థానిక కరెన్సీ స్థిరంగా ఉంటుందని చెబుతున్నారు. అంటే.. అన్ని దేశీయ వాణిజ్యం ఆఫ్గనీలోనే నిర్వహించబడుతుండటం వల్ల అది స్థిరంగా ఉంటుందని అంటున్నారు.

ఇదే సమయంలో... తాలిబన్లు చాలా వరకు ఆన్‌ లైన్ కరెన్సీ ట్రేడింగ్‌ ను నేరంగా పరిగణించారు.. ఉల్లంఘించిన వారికి జైలు శిక్షతో సహా కఠినమైన శిక్షలు విధించారు. ఈ విధంగా... ప్రాథమిక కరెన్సీగా ఆఫ్గని పాత్రను పటిష్టం చేసే లక్ష్యంతో తాలిబన్లు ఇలాంటి పలు కీలక నిర్ణయాలు కఠినంగా అమలు పరిచారు!